Pawan Kalyan is a real Political power star :   పవన్ కల్యాణ్ ఎటు వైపు ఉంటే పవర్ అటు వైపు ఉంటుంది. మధ్యస్థంగా ఉంటే  ప్రభుత్వాలు మారిపోతాయి. ఇప్పుడా విషయం మరోసారి నిరూపితమయింది. చిరంజీవి  ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం బాధ్యతలు తీసుకున్నారు. విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ పదవులు కోరుకోలేదు. ఎక్కడా పోటీ చేయలేదు. కానీ ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం అయిన తర్వాత సైలెంటయ్యారు. కానీ ఆయనలోని రాజకీయ భావాలు కుదురుగా ఉండనీయలేదు. అందుకే జనసేన పార్టీని ప్రారంభించారు. 


2014లో టీడీపీ,, బీజేపీ కూటమికి మద్దతు 


ఇప్పుడు రాజకీయల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్. సినిమాల్లో అది బిరుదు మాత్రమే . రాజకీయాల్లో మాత్రం నిజమైన పవర్ స్టార్. తాను ఎటు వైపు ఉంటే అటు వైపు పవర్ ఉంటుందని మరోసారి నిరూపించారు. తాను మొదట ఓడిపోయినా.. రెండో సారి పవర్ ఫుల్ విక్టరీ సాధించారు.  అనుకోకుండా సినిమాల్లోకి వచ్చినా రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంగా అడుగు పెట్టారు. ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా తట్టుకుని నిలబడ్డారు. ఇవాళ ఏపీ రాజకీయాల్లో తిరుగులేని పవర్ స్టార్ గా నిలబడ్డారు.  


గేమ్ ఛేంజర్ గా మారిన పవన్ 


పవన్  జనసేన పార్టీతోనే రాజకీయం ప్రారంభించలేదు. ప్రజారాజ్యం పార్టీలో యువత విభాగం యువరాజ్యానికి పవనే అధినేత.  2009 ఎన్నికల సమయంలో పవన్ చేసిన హైవోల్టేజ్ ప్రచారం మెగా అభిమానులను కిక్కెక్కించింది.  పంచెల డైలాగ్ అయితే ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. అయితే ప్రజారాజ్యం డిజాస్టర్ తర్వాత పవన్ సొంత పయనం ప్రారంభించడంతో  ఏపీ రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. మార్చి 14, 2014న పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు.  కానీ ఓట్లు చీలిపోకూడదన్న లక్ష్యంతో బీజేపీ, టీడీపీ కూటమికి మద్దతుగా నిలిచారు. అందుకోసం పవన్ కల్యాణ్ ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించలేదు. కొన్ని ప్రజాసమస్యల పరిష్కారాన్ని మాత్రమే కోరుకున్నారు.  తర్వాత జనసేన పార్టీని ప్రజల ముందు బలంగా పెట్టాలన్న లక్ష్యంతో  కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేశారు. ఆ ప్రయత్నం ఫెయిలయింది. తాను స్వయంగా రెండు చోట్ల ఓడిపోయారు. అయినా కుంగిపోలేదు. మొక్కవోని పట్టుదలతో ముందుకు సాగారు. నేడు  పవర్ మార్చేసేంత బలం తెచ్చుకున్నారు 


సొంత డబ్బుతో రాజకీయాలు 


సినిమాల్లో స్టార్ డమ్ తాను ఎప్పుడూ కోరుకోలేదని పవన్ కల్యాణ్ చెబుతూంటారు. జీవనోపాధి కోసమే సినిమాలని తన దృష్టి అంతా ఎప్పుడూ సమాజం పైనే ఉంటుందని చెబుతూంటారు., పవన్ కల్యాణ్ సమాజంలో ఉన్న అసమానతలపై మాట్లాడేటప్పుడు అనుకోకుండానే ఆవేశపడతారు. అది ఆవేశం కాదు.. ఆయన మనసులో ఉన్న తపన . సమాజాన్ని బాగు చేయాలన్న ఆరాటం. అందుకే రాజకీయాలపై మొదటి నుంచి ఎంతో ఆసక్తి చూపించేవారు. అందులో ఎన్నో వేధింపులు ఉంటాయని తెలిసి కూడా అడుగు పెట్టారు. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా సొంత  డబ్బుతో రాజకీయం చేస్తూ.. ముందడుగు వేస్తూ వచ్చారు. 


ఓట్ల చీల్చబోనని సవాల్ చేసి కూటమిలో చేరిన పవన్ -  నిజమైన విన్నర్ 


ఇవాళ్టి ఏపీ రాజకీయంలో పవన్ కల్యాణ్ నిజమైన విన్నర్. ఓట్ల చీల్చబోనని సవాల్ చేసి  మరీ తాను అనుకున్నది చేశారు. ఎక్కడ తగ్గాలో తెలుసని నిరూపించారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ ప్రాధాన్యాన్ని ఏపీ రాజకీయవర్గాలు ఏ మాత్రం తక్కువ చేయలేవు. ముఖ్యంగా ఆయనను హేళన చేసిన..  వ్యక్తిగతంగా దూషించి ఐదేళ్లుగా టార్గెట్ చేసిన వైఎస్ఆర్  కాంగ్రెస్ పార్టీ  నేతలు అసలు తేలికగా తీసుకోలేరు. ఎందుకంటే..  వారికి అధికారాన్ని దూరం చేసింది పవన్ కల్యాణే.