Jana Sena party will be allotted glass symbol permanently :  జనసేన పార్టీక గాజు గ్లాస్ గుర్తు శాశ్వతంగా కేటాయించనున్నారు. 
జనసేన పార్టీ ఇప్పుడు గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీ హోదా పొందింది. ఇప్పటి వరకూ రిజిస్టర్డ్ పార్టీనే.  ప్రాంతీయ పార్టీ హోదా రావాలంటే కొన్ని ప్రమాణాలు అందుకోవాలి.  గత ఎన్నికల్లో అన్ని చోట్లా పోటీ చేసినా అందుకోలేకపోయారు. కానీ  ఈ సారి మాత్రం పొత్తులతో పోటీ చేసి అనుకున్నది సాధించారు. ఈ ఫలితాలతో 'గాజు గ్లాసు' గుర్తును ఆ పార్టీకి EC శాశ్వతంగా కేటాయించనుంది.                

  


2014లో సాధించిన ఫలితాలతో రాని  ప్రాంతీయ పార్టీ గుర్తింపు            


ఎన్నికల సంఘం 2013లో జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే శాసనసభకు జరిగిన ఎన్నికల్లో పోలైన ఓట్లలో కనీసం ఆరు శాతం తెచ్చుకోవాలి. అలాగే రెండు అసెంబ్లీ సీట్లను గెలవాలి. 2019లో జనసేనకు ఆరు శాతం ఓట్లు కంటే కొద్ది ఓట్లు తక్కువ వచ్చాయి.  అసెంబ్లీ స్థానం కూడా ఒక్‌కటే వచ్చింది. కనీసం ఒక లోక్‌సభ స్థానం గెలిచినట్లయినా గుర్తింపు దక్కి ఉండేది.  ఏ సీట్లు సాధించకపోయినా ఎనిమది శాతం ఓట్లు వచ్చినా ఈసీ గుర్తింపు వచ్చి ఉండేది.  కానీ అవేమీ అప్పటి ఎన్నికల్లో రాలేదు.        


          పోటీ చేసిన అన్ని చోట్లా గెలిచి ఓట్లు, సీట్లు సాధించిన జనసేన                                          


కానీ 2024లో 21 చోట్ల పోటీ చేసి మొత్తం గెలిచారు. రెండు ఎంపీ సీట్లు కూడా గెలిచారు.  ఓటు బ్యాంక్ కూడా ఎనిమిది శాతం దాటిపోయింది. ఇప్పుడు జనసేన గుర్తింపు పొందిన పార్టీ. గుర్తింపు లేనందున జనసేన గుర్తు గాజు గ్లాస్ పై రకరకాల వివాదాలు ప్రారంభించేవారు.  కుట్రలు చేసేవారు. ఇక ముందు ఆ అవకాశం లేదు. గాజు గ్లాస్ గుర్తు జనసేనకు మాత్రమే ఉంటుంది. ఇతరులకు కేటాయించే అవకాశాలు ఉండవు. ఎన్నికల కమిషన్ ప్రతీ ఏడాది ఇలా అర్హత ప్రకారం ఓట్లు, సీట్లు సాధించిన పార్టీలను ప్రకటిస్తుంది. ప్రకటించినప్పుడు జనసేన సింబల్్ ను శాశ్వతంగా కేటాయిస్తారు.        


జనసేన నేతల్లో సంతోషం                                 


పార్టీ పెట్టిన పదేళ్ల తర్వాత అద్బుతమైన విజయాన్ని జనేసన పార్టీ సొంతం చేసుకుంది. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినా సాధించలేకపోయిన గుర్తింపును ఇప్పుడు సాధించడంతో జనసేన నేతలు, కార్యకర్తల్లోనూ సంతృప్తి వ్యక్తమవుతోంది.