Memes Trolling On AP Election Results 2024: ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో కూటమి అభ్యర్థులు ప్రభంజనం సృష్టించిన వేళ సోషల్ మీడియాలో హోరెత్తుతోంది. కొందరు టీడీపీ, జనసేనను ఆకాశానికెత్తేస్తూ పోస్టులు పెడుతుంటే.. మరికొందరు వైసీపీని విమర్శిస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి.. ప్రచారం, సభలు, రోడ్ షోలు, పోలింగ్ సరళి, ఎన్నికల ఫలితాలు ఇలా అన్ని సందర్భాల్లోనూ సామాజిక మాధ్యమాల్లో టీడీపీ, వైసీపీ మద్దతుదారులు తమ నేతలకు అనుకూలంగా మీమ్స్ వైరల్ చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా టీడీపీ కూటమి భారీ విక్టరీ తర్వాత బాస్ వస్తున్నాడు, కూటమి సునామీ అంటూ హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ చేశారు. జూన్ 1న ఎగ్జిట్ పోల్స్ అనంతరం కూడా తమ తమ రీతిలో సీఎం జగన్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. దీనికి వైసీపీ మద్దతుదారులు సైతం కౌంటర్ ఇచ్చారు. చివరకు ఎన్నికల ఫలితాల్లో కూటమి అభ్యర్థులు 164 అసెంబ్లీ స్థానాల్లో, 21 ఎంపీ స్థానాలు కైవసం చేసుకున్నారు. టీడీపీ 135 స్థానాలు, జనసేన పోటీ చేసిన 21 స్థానాలు, బీజేపీ 8 చోట్ల ఘన విజయం సాధించింది. 














'వై నాట్ 175 ఏమైంది.?'


టీడీపీ ఘన విజయంతో వైసీపీపై నెట్టింట ట్రోల్స్ పేలుతున్నాయి. 'వై నాట్ 175' ఇదే నినాదంతో సీఎం జగన్ ఈ ఎన్నికల్లో ప్రచారం హోరెత్తించారు. అయితే, ఫలితాల్లో ఆ పార్టీ ఘోర పరాభవం చవిచూసింది. కేవలం 11 అసెంబ్లీ సీట్లు, 4 ఎంపీ స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మంగళవారం మధ్యాహ్నానికే రిజల్ట్స్‌పై ఓ అంచనా రావడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. సీఎం జగన్ 'వై నాట్ 175' అంటూ చేసిన స్పీచ్‌ను ట్వీట్ చేస్తూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. మంత్రులు కొడాలి నాని, రోజా, గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి ప్రముఖులు కూడా ఓటమి పాలవ్వడంతో వారు గతంలో చేసిన డ్యాన్సులు, కామెంట్స్, అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను విపరీతంగా ట్రోల్ చేశారు. బూతులు మాట్లాడే మంత్రులకు తగిన శాస్తి జరిగిందంటూ కామెంట్స్ చేశారు.


ఫ్యాన్ రెక్కలు విరిచి..










కూటమి సంచలన గెలుపుతో కొన్ని చోట్ల కూటమి పార్టీల అభిమానులు ఫ్యాన్‌ రెక్కలు విరిచేసి బైక్‌పై వెళ్తూ ఈడ్చుకెళ్లారు. మరికొన్ని చోట్ల ఫ్యాన్ కింద పడేసి కాలితో తొక్కుతూ సంబరాలు చేసుకున్నారు. దీనికి సంబంధించి వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అటు, జనసేనాని పవన్ కల్యాణ్‌పై సీఎం జగన్ సహా వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను సైతం ట్వీట్ చేస్తూ వాటికి జనసైనికుల గెలుపు సంబరాలను జత చేశారు. అటు, ఫలితాల తర్వాత తాడేపల్లిలోని ప్యాలెస్ వద్ద దృశ్యాలను షేర్ చేస్తూ సెటైర్లు వేశారు. కాగా, ఎన్నికల ప్రచారం సందర్భంగా సీఎం జగన్ 'సిద్ధం'సభలు, బస్సు యాత్ర సందర్భంగా చంద్రబాబు, టీడీపీ నేతలను తిట్టిస్తూ, తీవ్రంగా విమర్శించిన వీడియోలను సైతం షేర్ చేస్తూ ఏకిపారేస్తున్నారు. 


టీడీపీని ఆకాశానికెత్తేస్తూ..


మరోవైపు, కూటమి సంచలన విజయంతో టీడీపీ అధినేత చంద్రబాబును, జనసేనాని పవన్ కల్యాణ్‌ను ఆకాశానికెత్తేస్తూ పోస్టులు షేర్ చేస్తున్నారు. 'బాస్ ఈస్ బ్యాక్', జగన్‌పై గతంలో జనసేనాని పవన్ చేసిన వ్యాఖ్యలను సైతం వైరల్ చేస్తూ.. ఈ గెలుపును జనసైనికులు, కూటమి శ్రేణులు ఎంజాయ్ చేస్తున్నారు.