NDA parties have taken key decisions for joint campaign in AP : ఏపీ అసెంబ్లీ   , లోక్‌సభ ఎన్నికల నామినేష్ల గడువు సమీపిస్తూండటంతో  గెలుపు వ్యూహాలపై ఎన్డీయే కూటమి దృష్టిసారించింది. ఈ మేరకు కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేీప కీలక నేతలు  తాడేపల్లిలోని నారా చంద్రబాబు నాయుడు నివాసంలో సమావేశం అయ్యారు.  దాదాపు 2 గంటలకుపైగా కొనసాగిన ఈ సమావేశంలో చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, మాజీమంత్రి సిద్ధార్థ నాథ్ సింగ్ పాల్గొన్నారు.


రాష్ట్రంలో ఉమ్మడి ప్రచారంతో పాటు, సీట్ల సర్దుబాటు వ్యవహారంపై నేతలు చర్చించారు.   ఉమ్మడిగా నిర్వహించే సభలకు రూట్ మ్యాప్‌ను సిద్ధం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఎన్నికల సమీపిస్తుండడంతో ప్రచారానికి పలువురు స్టార్ క్యాంపెయినర్లను కూడా ఎన్డీయే కూటమి ఎంపిక చేసింది.  ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య సమన్వయం కోసం బూత్ లెవల్, అసెంబ్లీ లెవల్ నుంచి పార్లమెంట్ స్థాయి వరకు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాలని ఈ భేటీలో నిర్ణయించారు. ప్రచారం, ఎన్నికల నిర్వహణ వ్యవహారాలను పరిశీలించేందుకు, వ్యూహాలను సిద్ధం చేసేందుకు రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని సమావేశంలో ఖరారు చేశారు.


ఓట్ల బదిలీపై క్షేత్ర స్థాయిలో ఫలితాలు సాధించేలా తీసుకోవాల్సిన చర్యలపై కూడా నేతలు చర్చించారు.   చాలా ప్రాంతాల్లో నేతలు మంచి సమన్వయంతో వెళ్తున్నారని, ఇది మంచి పరిణామమని నేతలు అభిప్రాయపడ్డారు. సాధ్యమైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో ఇదే తరహా ఉమ్మడి ప్రచార సభలు నిర్వహించాలని ఎన్డీఏ నేతలు నిర్ణయించారు. ప్రభుత్వం చేస్తున్న అధికార దుర్వినియోగంపై ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్‌కు ఉమ్మడిగా ఫిర్యాదులు చేసి చర్యలు తీసుకునే వరకు పోరాడాలని నిర్ణయించారు. ఎన్నికల కోడ్ పక్కాగా అమలు చేసేలా... ఎన్నికల సంఘంతో నిరంతరం మాట్లాడుతూ రియల్ టైంలో సమస్యలను ఈసీ దృష్టికి తీసుకువెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేయాలని నిర్ణయించారు.                                  


కూటమి తరుపున ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీతో సహా బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, నడ్డా, రాజ్‌నాథ్ సింగ్ వంటి అగ్రనేతలు పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం కానున్నాయి. మరో వైపు కొన్ని సీట్ల విషయంలో ఏర్పడిన గందరగోళాన్ని తెరదించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆనపర్తి అభ్యర్థిని  మార్చి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భార్యను బీజేపీ తరపున బరిలోకి దించేందుకు అంగీకరించినట్లుగా తెలుస్తోంది. నల్లమిల్లి పార్టీ మారేందుకు నిరాకరిస్తున్నారు. ఒక వేళ ఆనపర్తి టీడీపీ తీసుకున్నట్లయితే ఇతర చోట్ల సీటు కేటాయించడం అంత సులువు కాదు కాబట్టి.. ఈ అంశంలో అభ్యర్థి మార్పునే పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.