ఎవరి నోట విన్నా కోట్ల మాటే. నువ్వు ఇంత తిన్నావ్‌ అంటే నువ్వు ఇంత తిన్నావ్‌ అని విమర్శలు. మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా రోజుకో పార్టీ రోజుకో పొలిటికల్‌ లీడర్‌ కోట్ల బాగోతం వెలుగులోకి వస్తోంది. ఈ ఆరోపణల్లో నిజమెంత.. ఆధారాలున్నప్పుడు ఎందుకు నేతలు వెనకడుగు వేస్తున్నారు. ఇంతకుముందు గుర్తుకురాని కోట్ల స్కాంలు ఉపఎన్నిక సందర్భంగా ఎందుకు బయటకు వస్తున్నాయి? ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని ప్రశ్నలకు రాజకీయనేతలు, పార్టీలు సమాధానం చెప్పాల్సి ఉంటుందంటున్నారు ప్రజలు.


మునుగోడు ఉపఎన్నిక మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఫలితంగా రోజుకో విషయం బయటపడుతోంది. అదే కోట్లరూపాయల అవినీతి. అధికారపక్షం టీఆర్‌ఎస్‌పై విపక్షాలు అవినీతి ఆరోపణలు చేయడం కొత్తకాదు. ఎప్పటి నుంచో కాళేశ్వరం ప్రాజెక్టు, రైతుబంధు తదితర విషయాల్లో కెసిఆర్‌ ఆయన కుటుంబం కోట్లలో అవినీతికి పాల్పడిందని విపక్షాలు ఆరోపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కెటిఆర్‌పై బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో ఆ పార్టీ నేతలు మరోసారి తాడిచర్ల కాంట్రాక్ట్‌పై ఆరోపణలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.


మునుగోడు ఉపఎన్నికకు కారణమైన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తన వ్యాపారం కోసమే బీజేపీలోకి చేరారని టీఆర్ఎస్ ఆరోపణలు చేసింది. కాంగ్రెస్ కూడా దానికి వంత పాడింది. 22వేల కోట్లపైగా కాంట్రాక్టులను బీజేపీ ఇవ్వడం వల్లే ఆయన పార్టీ మారారని అందుకు సంబంధించిన ఓ వీడియోని కూడా బయటపెట్టింది. దీనికి రివెంజ్‌గా బీజేపీ, కోమటిరెడ్డి కూడా కెటిఆర్‌ తాడిచర్ల కాంట్రాక్ట్‌ని తెర మీదకు తెచ్చింది. అనూహ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ, స్టార్ క్యాంపెనీయర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తాడిచర్ల కాంట్రిక్ట్‌పై కేటిఆర్‌ను కార్నర్ చేశారు. 






ఏఎంఆర్‌ సంస్థకు అధిక ధరకు కాంట్రాక్ట్‌ ని కట్టబెట్టడం వల్ల సదరు సంస్థ కెటిఆర్‌ రూ.15 వేల కోట్లు కమీషన్‌ రూపంలో ముట్టజెప్పిందని ఆరోపించారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా తన దగ్గర ఉన్నాయని తెలిపారు. కోవర్ట్‌ అని తనపై ఆరోపణలు చేసిన కెటిఆర్‌ తాడిచర్ల గనుల కేటాయింపుల్లో జరిగిన అవినీతిపై చర్చకు రావాలని సవాల్‌ చేశారు. అంతేకాదు తనజోలికి వస్తే కెటిఆర్‌ అవినీతి బాగోతాన్నంతా బయటపెడతానని హెచ్చరించారు కోమటిరెడ్డి.


రాజగోపాల్ రెడ్డి తాజాగా ట్విటర్ వేదికగా మరోస్కాం అంటూ చెప్పుకోచ్చారు. కెసిఆర్ కుటుంబం ధరణి పోర్టల్ తీసుకొచ్చి హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో 18 లక్షల కోట్ల రూపాయిల భూములు ఆక్రమించారన్నారు. ఇది దేశంలోనే అతి పెద్ద భూస్కాంగా అభివర్ణించారు. ధరణి పోర్టల్‌పై తెలంగాణ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు తనపై ఆరోపణలు చేస్తున్న టీఆర్ఎస్ నేతలకు సవాల్ కూడా విసిరారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ సాక్షిగా తాను స్నానం చేసి తడి బట్టలతో లక్ష్మీనరసింహ సాక్షిగా బిజెపికి అమ్ముడు పోలేదని ప్రమాణం చేసేందుకు సిద్ధమనీ, కెసిఆర్, కేటీఆర్ తడి బట్టలతో వచ్చి ప్రమాణం చేయడానికి సిద్ధమా? అని రాజగోపాల్ సవాల్ చేస్తున్నారు. 






మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జేజిక్కించుకున్న కాంట్రాక్ట్ డబ్బులు  మునుగోడు నియోజకవర్గానికి కేటాయించేలా మోదీ, అమిత్ షా ఒప్పిస్తే తాము పోటీ నుంచి తప్పుకుంటామని కేటిఆర్‌తోపాటు మంత్రులు కూడా అంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఆ 18,000కోట్లు మంజూరు చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రాధేయపడి ఒప్పించి పోటీ నుంచి టీఆర్ఎస్ తప్పుకుంటుందని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. 






అయితే ఎన్నికల సమయంలోనే రాజకీయనేతలు ఇలా ఆరోపణలు చేయడంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. తప్పు చేసినప్పుడే ఆ ఆధారాలు బయటపెడితే అవినీతికి ఆస్కారం ఉండదు కదా అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇంకోవైపు మునుగోడు నియోజకవర్గంలో కూడా గెలుపుకోసం ఒక్కో ఓటర్‌ కి వేలల్లో డబ్బు, మద్యాన్ని ఎరవేస్తున్నారని అధికార-విపక్షాలు విమర్శించుకుంటున్నాయి. ఈ క్రమంలో తనిఖీలు చేస్తోన్న పోలీసులకు ఇప్పటివరకు దాదాపు రూ.10 కోట్ల వరకు హవాలా సొమ్ము దొరికింది. బంజారాహిల్స్‌ , గాంధీనగర్‌ -సైదాబాద్‌లో జరిపిన తనిఖీల్లో లెక్క తేలని రూ.7.5 కోట్ల డబ్బును పోలీసులు సీజ్‌ చేశారు.