Munugode TDP : మునుగోడు ఉపఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అన్నదానిపై తెలుగుదేశం పార్టీ ఇంకా నిర్ణయించుకోలేదు. 13వ తేదీన ఫైనల్ చేద్దామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తమ పార్టీ నేతలకు హామీ ఇచ్చారు. చంద్రబాబు ఓకే అంటే తాము పోటీ చేయడానికి రెడీ అంటూ కొంత మంది నేతలు కూడా సిద్ధమయ్యారు. అయితే అనూహ్యంగా సోషల్ మీడియాలో మునుగోడులో టీడీపీ తరపున ఫలానా అభ్యర్థి అంటూ ప్రచారం ఊపందుకుంది. ఆయనెవరో సాదాసీదా నేత అయితే పెద్దగా ఎవరూ పట్టించుకునేవారు కాదు కానీ.. టీఆర్ఎస్ సీనియర్ నేత కావడంతో వైరల్ అయింది. టీడీపీ తరపున ప్రచారంలోకి వచ్చిన ఆ అభ్యర్థి పేరు బూర నర్సయ్య గౌడ్. భువనగిరి మాజీ ఎంపీ.
రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయగానే మునుగోడు ఉపఎన్నికల్లో పోటీకి బూర నర్సయ్య గౌడ్ ఆసక్తి చూపారు. టీఆర్ఎస్ హైకమాండ్‌కు కూడా తన ఆసక్తిని తెలిపారు. మునుగోడులో బీసీ ఓటర్లు అత్యధిక మంది ఉన్నారని అన్ని పార్టీలు రెడ్డి సామాజికవర్గానికి అవకాశం కల్పిస్తున్నాయని.. టీఆర్ఎస్ తరపున బీసీ అభ్యర్థినైన తనకు చాన్సిస్తే మంచి మెజార్టీతో గెలుస్తానని ఆయన ప్రతిపాదన పెట్టారు. ఓ దశలో బీసీకే టిక్కెట్ ఇవ్వాలన్న డిమాండ్ కూడా తీసుకు వచ్చారు. అయితే సర్వేల్లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే సానుకూలత వచ్చిందని కేసీఆర్ ఆయనకే టిక్కెట్ ఖరారు చేశారు. భవిష్యత్‌లో మంచి అవకాశాలు ఇస్తామని చెప్పి బూర నర్సయ్య గౌడ్‌ను బుజ్జగించారు.
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి బీఫాం ఇచ్చే సమయంలో బూర నర్సయ్య గౌడ్‌ను కూడా కేసీఆర్ పిలిపించి కలిసి పని చేయాలని సూచించారు. దానికి నర్సయ్య గౌడ్ కూడా అంగీకరించారు. ఆయన టీఆర్ఎస్ తరపున మునుగోడులో ప్రచారం చేస్తున్నారు కూడా. అయితే అనూహ్యంగా ఆయన పేరు టీడీపీ అభ్యర్థిగా ప్రచారంలోకి రావడంతో రాజకీయవర్గాలు ఉలిక్కి పడ్డాయి. ఈ అంశంపై రెండు రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం అంతకంతకూ పెరుగుతూండటంతో ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేయడం లేదని తేల్చిచెప్పారు. ఆ వార్తల్లో నిజం లేదన్నారు. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తాననే ప్రచారంలో నిజం లేదు.. అలాంటి వార్తలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో ప్రచారాన్ని పట్టించుకోవద్దని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన టీఆర్ఎస్ అభ్యర్థి కోసం చిత్తశుద్ధితో పని చేస్తానని స్పష్టం చేశారు. పదవులు, డబ్బుల కోసం పాకులాడే వ్యక్తిని కాదని బూర నర్సయ్య గౌడ్ తేల్చిచెప్పారు.
నర్సయ్య గౌడ్ క్లారిటీతో తెలుగుదేశం పార్టీ తరపున ఆయన అభ్యర్థి కాదని స్పష్టమయింది. అయితే అసలు ఈ ఉపఎన్నికలో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందో లేదో స్పష్టత లేదు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. మునుగోడులో తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి రాష్ట్రంలోనూ మెరుగైన ఫలితాలు సాధించలేదు. కానీ పొత్తుల ఉన్నప్పుడు కమ్యూనిస్టులు గెలిచారు. గురువారం చంద్రబాబు పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంటే అభ్యర్థిని కూడా అప్పుడే ఖరారు చేసే అవకాశం ఉంది.