బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారు. బంజారాహిల్స్‌లోని నందినగర్ ప్రాంతంలో డీఏవీ స్కూల్‌ పోలింగ్‌ స్టేషన్‌లో కవిత ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఆ తర్వాత కవిత మీడియాతో మాట్లాడారు. ప్రజలు అందరూ తమ బాధ్యతను నిర్వర్తించాలని అందరూ ఓటు వేయాలని పిలుపు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎలక్షన్ కోడ్‌ను ఉల్లంఘించేలా కవిత వ్యాఖ్యలు చేశారు. తమకు ఓటు వేయాలనే వ్యాఖ్యలు చేయకూడదనే నిబంధనలు ఉన్న సంగతి తెలిసిందే.


కవిత వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ దృష్టికి తీసుకెళ్లి నిబంధనల ప్రకారం కవితపై చర్యలు తీసుకోవాలని కోరారు.






పట్టణ ప్రాంతాల్లో దారుణంగా ఓటింగ్ - కవిత


అర్బన్ ఓటింగ్ చాలా దారుణంగా ఉంటోందని కల్వకుంట్ల కవిత అన్నారు. పట్టణ ఓటర్లు కచ్చితంగా పోలింగ్ బూత్ కు రావాలని పిలుపు ఇచ్చారు. గత ఎన్నికల్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ మెరుగ్గా ఉన్నప్పటికీ అర్బన్ ఏరియాల్లో చాలా దారుణంగా ఉందని అన్నారు.


దుర్గం చిన్నయ్య కూడా ఎన్నికల కోడ్ ఉల్లంఘన


బీఆర్ఎస్ కండువా వేసుకొని ఓటు వేయడానికి వెళ్ళి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నెన్నెల మండలం జెండా వెంకటాపూర్ 219 పోలింగ్ బూత్ లో దుర్గం చిన్నయ్య కుటుంబ సభ్యులు ఓటు వేశారు. ఆయన కోడ్‌ను ఉల్లంఘించడం పట్ల ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు.


కండువాతో వచ్చిన ఇంద్రకరణ్ రెడ్డి 


అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిర్మల్ బిఅర్ఎస్ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పోలింగ్ బూత్లోకి పార్టీ కండువాతో వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఆయన ఎల్లపల్లి గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ బూత్ కు కండువాతో వెళ్లడం ఏంటని, ఇది ఓటర్లను ప్రభావితం చేసినట్లు అవుతుందని విమర్శలు వస్తున్నాయి. మరి దీనిపై అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.