Telangana MLC election : వరంగల్ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు గురువారంతో ముగుస్తుంది. గత ఎన్నికల్లో ఎమ్మెల్సీగా విజయం సాధించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి గతేడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి డిసెంబర్ 9న రాజీనామా చేయగా.. ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. 2021 మార్చిలో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికవగా.. 2027, మార్చి వరకూ పదవీకాలం ఉంది. ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినప్పటి నుంచి ఆరు నెలల్లోగా ఉప ఎన్నిక నిర్వహించాలన్న నిబంధన మేరకు ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. ఈ 27న ఉప ఎన్నికకు పోలింగ్ నిర్వహించనుంది.
కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న
వరంగల్-ఖమ్మ-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన ఆ స్థానంలో వస్తున్న ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి తీరాలని తీన్మార్ మల్లన్న గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. సాధారణ రాజకీయ నేతలతో పోలిస్తే ఆయనది భిన్నమైన శైలి. నామినేషన్ వేయగానే తనతో పాటు తన కుటుంబానికి ఉన్న ఆస్తులన్నింటినీ ప్రభుత్వానికి రాసిచ్చేశారు. తీన్మార్ మల్లన్న పబ్లిసిటీ స్టంట్ చేశారని అనుకున్నారు. కానీ ఆయన పత్రాలు రిజిస్టర్ కూడా చేసేశారు. పనితీరు ఆధారంగా తనపై తానే రీకాల్ సిస్టమ్ కూడా పెట్టుకుంటానని చెబుతున్నారు. కేసీయార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యూట్యూబ్ ఛానల్లో చేసిన వీడియోలతో తీన్మార్ మల్లన్న పాపులర్ అయ్యారు. క్యూ న్యూస్ పేరుతో ఉన్న ఆయన చానల్ కు యువతలో మంచి క్రేజ్ ఉంది. ఓ టీవీ చానల్లో ‘తీన్మార్ మల్లన్న’ కార్యక్రమంతో చింతపండు నవీన్ కుమార్ కు తీన్మార్ మల్లన్న అన్న పేరు స్ధిరపడిపోయింది. దాన్ని ఆయన క్రమబద్దంగా ఉపయోగించుకుంటూ వస్తున్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి
అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన రాకేష్ రెడ్డికి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ చాన్సిచ్చారు. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన రాకేశ్ రెడ్డి.. బిట్స్ పిలానీలో మాస్టర్ మేనేజ్‌మెంట్ స్టడీస్, మాస్టర్స్ ఇన్ ఫైనాన్స్ పూర్తి చేశారు. బెంగళూరు, అమెరికాలలో ఏడేళ్ల పాటు ఉద్యోగాలు చేసిన ఆయన రాజకీయాలపై ఆసక్తితో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2013లో బీజేపీలో చేరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అంచెలంచెలుగా ఎదుగుతూ బీజేపీలో బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శిగా, రెండు పర్యాయాలు రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేశారు. బీజేపీలో వరంగల్ పశ్చిమ టికెట్ ఆశించిన రాకేష్ రెడ్డి వ టికెట్ కేటాయించకపోవడంతో 2023, నవంబర్‌లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. యువతలో, విద్యావంతులలో మంచి పట్టున్న రాకేష్ రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు, ఫాలోయింగ్ ఉండటంతో కేసీఆర్ అభ్యర్థిగా చాన్సిచ్చారు.
బీజేపీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి
నల్గొండ - వరంగల్ - ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిని బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పేరును ఖరారు చేసింది. గత ఎన్నికల్లోనూ ఆయన పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేసి ఓటమి చవి చూశారు. కాసం వెంకటేశ్వర్లు, ప్రకాశ్‌రెడ్డి కూడా టిక్కెట్ కోసం ప్రయత్నించారు. సాధారణంగా గ్రాడ్యూయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక అంటే.. రాజకీయ పార్టీలు ముందుగా తమ శక్తి మేర సానుభూతిపరుల్ని ఓటర్లుగా చేర్పిస్తాయి. ఈ సారి అలాంటి కసరత్తు ఏ పార్టీ చేయలేదు. అందుకే ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మూడేళ్ల కిందట జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ మద్దతు లేకపోయినప్పటికీ తీన్మార్ మల్లన్న రెండో స్థానంలో నిలిచారు.