Minister Dharmana Sensational Comments On Kadapa Subbareddy: ఎవరో, ఎక్కడి నుంచో వచ్చి ఈ ప్రాంతంలో అజమాయిషీ చెలాయిస్తానంటే తాను అవమానంగా భావిస్తానని మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళంలో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు. కడప నుంచి ఎవడో సుబ్బారెడ్డి వచ్చి శ్రీకాకుళంలోని భూమి తనదంటూ ఆక్రమించే ప్రయత్నం చేశాడని, ఎవడ్రా నువ్వు తంతానంటే పోయాడంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఎవడో సుబ్బారెడ్డి కడప నుంచి వచ్చి ఈ భూమి ఆక్రమిస్తానంటే ఊరుకోనని, ఈ ప్రాంతంపై ఎవడో అజమాయిషీని  అవమానంగా భావిస్తానని స్పష్టం చేశారు. శ్రీకాకుళం ప్రాంతాన్ని తాను తప్ప ఎవరూ అభివృద్ధి చేయలేదని, తనను ఓడిస్తే మీకే నష్టమంటూ తనను కలిసిన పలు సంఘాలకు చెందిన నేతలకు వెల్లడించారు. శ్రీకాకుళంలో పది ఇల్లు ఉంటే అందులో అత్యధికం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారేనని, జిల్లాలో ప్రశాంతమైన వాతావరణం ఉండాలని తాను ఎల్లప్పుడూ ఆకాంక్షించే వ్యక్తినని అన్నారు. తాను ఎప్పుడూ బలహీనవర్గాల వారి వైపే ఉంటానని, ఆ మధ్యకాలంలో కడప సుబ్బారెడ్డి వచ్చి ఈ భూమి నాదే అంటూ వ్యాఖ్యానించాడని, దానికి తాను బదులిస్తూ ఎవడ్రా నువ్వు అని ప్రశ్నించడంతో పాటు.. తంతానన్నానని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని సీఎంకు చెప్పేశానని, దానికి సీఎం అంగీకరించలేదని, పోటీ చేయడంతో పాటు పార్టీ పనులు కూడా చూసుకోవాలంటూ ఆదేశించారని ధర్మాన వెల్లడించారు. తప్పనిసరి అయి తాను అంగీకరించారని చెప్పారు. తనకు శత్రువులు కూడా ఎక్కువ మంది ఉన్నారని, తాను ఎల్లప్పుడూ బలహీనులు వైపే ఉంటానని, నిజాయితీ గల అధికారులను తెచ్చుకుంటానని.. ప్రజలు తనకు అండగా ఉండాలని కోరారు.


రాజకీయంగా దుమారం 


వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. కడప నుంచి వచ్చిన సుబ్బారెడ్డి అంటూ ప్రసాదరావు వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు రాజకీయంగా అలజడికి కారణమయ్యాయి. ధర్మాన ప్రసాదరావు ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉన్నప్పటికీ.. తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం ఈ వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ పాలనలో భూ ఆక్రమణలకు ధర్మాన చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని మండిపడుతున్నారు. అధికార పార్టీలోనూ మంత్రి వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. పార్టీలోని వ్యక్తులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారా..? లేక బయట వ్యక్తుల గురించి ఇలా మాట్లాడారా అని జోరుగా చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా సీనియర్ మంత్రిగా వ్యవహరిస్తున్న ధర్మాన ప్రసాదరావు చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయంగా అలజడికి కారణమయ్యాయి.


ప్రజా ప్రతినిధులు అవినీతికి దూరంగా ఉండాలని, ఒకరి ఆస్తి కోసం కక్కుర్తి పడే మనస్తత్వం ఉండకూడదని మంత్రి ధర్మాన వ్యాఖ్యానించారు. నాయకుడు అవినీతికి పాల్పడకూడదన్న దర్మాన.. ఎవరు చేస్తామన్నా చేయనివ్వకూడదని సూచించారు. ఈ విధానాన్ని కచ్చితంగా తాను పాటిస్తానని తెలిపారు.  భూమి ఆక్రమణకు వచ్చిన సుబ్బారెడ్డిని.. నీ అబ్బ సొమ్ముకాదని, పోవాలంటూ హెచ్చరించానని స్పష్టం చేశారు. వచ్చిన వాడు ఏ పార్టీ అనేది చూడనని, అక్కడ నుంచి వచ్చి ఇక్కడ అజమాయిషీ చేస్తామనుకుంటారని పేర్కొన్నారు. ఈ తరహా చర్యలను అవమానంగా భావిస్తానని, శ్రీకాకుళంలో వనరులున్నాయనే పక్క జిల్లాల నుంచి వచ్చేస్తున్నారని పేర్కొన్నారు. ఇలానే వదిలేస్తే రౌడీలమయం అయిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిన ప్రాంతాలు ఇలానే పాడై పోతున్నాయని, ప్రశాంతంగా పట్టణాలు ఉండాలని ఆకాంక్షించారు.  దశాబ్దాలుగా శ్రీకాకుళం ప్రశాంతంగా ఉండాలనే చూస్తున్నా అని, ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలని కోరారు. ప్రజల అభిమానంతోనే గెలుస్తూ వస్తున్నానని, జిల్లాలో ఎక్కడైనా తాను గెలుస్తానని, కానీ శ్రీకాకుళంలో వేరే వారు గెలవరని పేర్కొన్నారు. ఈ ప్రాంతాన్ని మిగిలిన వారు కనీసం అభివృద్ధి కూడా చేయలేరని, గెలిస్తే శక్తివంతంగా ఉంటానని, ఓడితే స్నేహితుడిగా ఉంటానని తనను కలిసిన పలు సంఘాల నేతలకు ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు.