BRS defeat : బీఆర్ఎస్ ( BRS Leaders ) నేతలు తమ పార్టీ పరాజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అన్ని విధాలుగా నష్టం జరుగుతూండటంతో వారు నిరాశకు గురవుతున్నారు. ముఖ్యంగా ఎన్నికలకు ముందు పార్టీలో చేరి నామినేటెడ్ పదవులు పొందిన వారు , టిక్కెట్ ఇవ్వలేదని బుజ్జగించడానికి పదవులు పొందిన అందుకున్న వారు ఇప్పుడు రాజీనామాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారంతా తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితికి వెళ్లిపోతున్నారు.
వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ గెలిచిన రెండు సీట్లను త్యాగం చేసిన వారికి షాకే
అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్‌ఎస్ పార్టీ దాదాపు అందరు సిట్టింగ్‌లకు మరోసారి ఛాన్స్ ఇచ్చినా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు మాత్రం టికెట్ దక్కలేదు. వారి స్థానంలో జనగామలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, స్టేషన్ ఘన్‌పూర్‌లో మరో ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. దీంతో ముత్తిరెడ్డి, తాటికొండ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వారికి ఇతర పార్టీల నుంచి అవకాశాలు వచ్చాయి. రాజయ్యకు కాంగ్రెస్ హైకమాండ్ టికెట్ ఆఫర్ ఇచ్చింది. అయితే ఎలక్షన్లకు ( Telangana Elections ) కొన్ని రోజుల ముందు యాదగిరిరెడ్డికి ఆర్టీసీ చైర్మన్ తాటికొండ రాజయ్యకు రైతుబంధు సంస్థ చైర్మన్ పదవులు కట్టబెట్టారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో వారు ఇంకా ఆయా సంస్థలో సరిగ్గా అడుగే పెట్టలేదు. ఇంతలోనే బీఆర్‍ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోవడంతో ఇద్దరూ తమ చైర్మన్ పదవులకు దూరం అయ్యారు. కాగా ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తంలో ముత్తిరెడ్డి, తాటికొండ రాజయ్య నియోజకవర్గాల్లోనే బీఆర్‌ఎస్ విజయం సాధించింది. దీంతో వారిద్దరూ అటు ఎమ్మెల్యేలు కాలేక, ఇటు కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో కొనసాగలేకపోతున్నారు. వేములవాడ మాజీ ఎమ్మెల్యేకూ కేసీఆర్ ఓ పదవి ఇచ్చారు. దానికీ కాలం తీరిపోయింది.
కాంగ్రెస్ నుంచి చేరిన నేతలకూ ఇబ్బందికరమే
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో టిక్కెట్లు దక్కని వారు బీఆర్ఎస్ లోచేరారు. అయితే వారికి ఆషామాషీగా కాకుండా పదవులు ఇచ్చి తీసుకున్నారు. మైనంపల్లి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో తలెత్తిన రాజకీయ పరిణామాలతో మల్కాజిగిరి నియోజవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత నందికంటీ శ్రీధర్ కారెక్కారు. ఎక్కడమే ఆలస్యం అనట్లు మూడు రోజులలోనే ఎంబీసీ చైర్మన్ గా నియమితులు అయినారు. ఇప్పుడా పది మూడు నాళ్ల ముచ్చట అయింది. మైనంపల్లిని పార్టీలో చేర్చుకున్నప్పుడు రేవంత్ రెడ్డి.. నందికంటి శ్రీధర్ ను రాహుల్ గాంధీ వద్దకు తీసుకెళ్లి భవిష్యత్ కు భరోసా ఇప్పించారు. కానీ ఆయన పదవికి ఆశపడి పార్టీ మారారు. ఇప్పుడు మరోసారి ప్రతిపక్ష పార్టీలో పదవి లేకుండా ఉండాల్సి వస్తోంది.
కాంగ్రెస్ నుంచి వెళ్లిన వారంతా దురదృష్టవంతులు
కాంగ్రెస్ లో చాలా కాలం పాటు పని చేసి.. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ఆఫర్ రావడంతో పార్టీలో చేరిపోయిన వారు దురదృష్టవంతులుగా మిగిలారు. నర్సాపూర్ నేత గాలి అనిల్ కుమార్.. కాంగ్రెస్ కోసం చాలా ఖర్చు పెట్టుకున్నారు. టిక్కెట్ ఇవ్వలేకపోతే మరో అవకాశం ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది. ముందు ఒప్పుకున్న ఆయన తర్వాత బీఆర్ఎస్ లో చేరిపోయారు. ఇలా దాదాపుగా ఇరవై, ముఫ్పై మంది కీలక కాంగ్రెస్ నేతలు.. తమకు పదవులు దూరమైపోతున్నాయని బాధపడుతున్నారు. వారు మళ్లీ పార్టీలోకి వచ్చినా పదవులు ఇవ్వరన్న వాదన వినిపిస్తోంది.