BRS Legislative Party leader: సీఎం అభ్యర్థిని కాంగ్రెస్ తేల్చేసింది. ఇప్పుడు తేలాల్సింది ప్రతిపక్ష నేత ఎవరు..? బీఆర్ఎస్ లేజిస్లేటివ్ పార్టీ నాయకుడిగా ఎవరిని ఎన్నుకుంటారు. వాస్తవానికి ఇప్పటి వరకూ సీఎంగా ఉన్న కేసీఆర్ ఇకపై ప్రతిపక్షనేతగా తెలంగాణ అసెంబ్లీలో ఉండాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే కేసీఆర్ ప్రతిపక్షనేతగా కొనసాగే అవకాశం లేదని తెలుస్తోంది. ఆ మాటకొస్తే ఆయన అసెంబ్లీకి కూడా మునుపటిలా హాజరవ్వకపోవచ్చని బీఆర్ఎస్ నేతలే అంటున్నారు. ప్రస్తుతం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోనే మకాం మార్చిన కేసీఆర్.. నాయకులందర్నీ అక్కడే కలుస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణ రచిస్తున్నారు. 


కేసీఆర్ ఏం చేస్తారు..?
ఇప్పటికే టీఆర్ఎస్‌ని బీఆర్ఎస్ చేసి జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టారు కేసీఆర్. తెలంగాణలో బీఆర్ఎస్ విజయం సాధించి ఉంటే.. మరింత బలంగా ఆయన మిగతా రాష్ట్రాలపై దృష్టిపెట్టి ఉండేవారు. కానీ అనూహ్య ఓటమితో ఆయనలో అంతర్మథనం మొదలైంది. అయితే ఏ పని మొదలు పెట్టినా, మధ్యలో వెనకడుగు వేయడం అయనకు అలవాటు లేదంటారు ఆయన గురించి తెలిసినవారు. అందుకే బీఆర్ఎస్ ని జాతీయ స్థాయిలో నిలబెట్టేందుకు కేసీఆర్ వ్యూహ రచన చేస్తున్నారని అంటున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ మెదక్ నుంచి పోటీ చేస్తారనే వాదన వినపడుతోంది. అదే నిజమైతే.. ఆయన జాతీయ రాజకీయాలకు పరిమితం అవుతారు, అదే సమయంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ పునర్వైభవానికి కూడా కృషి చేస్తారు. కేసీఆర్ ఎంపీగా ఢిల్లీకి వెళ్తే.. తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతగా ఉండేది ఎవరు..? అందుకే ముందుగానే బీఆర్ఎస్ లేజిస్లేటివ్ పార్టీ రేసు నుంచి కేసీఆర్ తప్పుకుంటున్నారు. తన స్థానంలో మరొకరికి అవకాశం ఇవ్వబోతున్నారు. 


కేటీఆర్..? హరీష్..?
బీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత ఎవరు అంటే అందరూ కేటీఆర్ పేరే చెబుతుంటారు. లేకపోతే హరీష్ రావు పేరు కూడా వినపడుతుంది. ప్రస్తుతానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ కి పదవి ఉంది. ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే.. కేటీఆర్ కి కూడా సీఎం అయ్యే అవకాశం ఉండేది. అనూహ్య ఓటమితో కేటీఆర్ కూడా డీలా పడ్డారు. ఇక హరీష్ రావుకి కూడా ప్రతిపక్ష నేతగా అవకాశం ఉంది. కానీ అనూహ్యంగా మరో పేరు తెరపైకి వస్తోంది. 


కడియం శ్రీహరి..
తెలంగాణలో ప్రతిపక్షనేతగా కొత్త పేరు ఇప్పుడు వినపడుతోంది. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ఆ అవకాశం దక్కుతుందంటున్నారు. ప్రతిపక్ష నేత హోదాను దళితులకు ఇస్తే పార్టీకి కూడా ఆ క్రెడిట్ ఉంటుందనే ఆలోచన కూడా బీఆర్ఎస్ లో ఉంది. గతంలో కూడా విజయరామారావు, ఈటల రాజేందర్ అసెంబ్లీలో టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్లుగా వ్యవహరించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక బీఆర్ఎస్ కి ఆ అవకాశం రాలేదు. సీఎంగా కేసీఆర్ ఉండటంతో ఆయనే అన్నీ అయ్యారు. ఇప్పుడు తొలిసారి బీఆర్ఎస్ కి విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. 


కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం గ్యారెంటీ అనే వార్తలు వినపడుతున్న నేపథ్యంలో ఆయన తరపున ఇక్కడ వ్యవహారాలన్నీ కేటీఆర్ చక్కబెడతారు. ఇప్పటికే ఆయన ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ఎల్పీ నేత అనేది నామమాత్రమే. అందుకే ఆ పదవిని కడియం శ్రీహరికి ఇస్తారని తెలుస్తోంది. అప్పుడు హరీష్ రావు సహా ఇతర నేతలకు కూడా పెద్ద ప్రాధాన్యం ఇవ్వాల్సిన పని ఉండదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ హవా ఎప్పటిలాగే ఉంటుంది. అందుకే ఈ మధ్యే మార్గాన్ని కేసీఆర్ అమలులో పెడతారని అంటున్నారు.