Lok Sabha Elections Phase 6 2024 Updates: 2024 లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఇవాళ ఆరో దశ పోలింగ్ ప్రారంభమైంది. ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో మొత్తం 58 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఆరో దశ కూడా ప్రశాంతంగా ఎలాంటి గడబిడ లేకుండా జరిపేందుకు ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది.  


ఆరో విడత ఎన్నికల పోలింగ్ బిహార్‌లో ఎనిమిది సీట్లకు, హరియాణాలో పది సీట్లకు, జమ్ముకశ్మీర్‌లో ఒక సీటుకు, జార్ఖండ్‌లో నాలుగు, ఢిల్లీలో ఏడు, ఒడిశాలో ఆరు, ఉత్తర్‌ప్రదేశ్‌లో 14 స్థానాలకు, పశ్చిమబెంగాల్‌లో 8 స్థానాలకు జరగనుంది. ఈ 58 స్థానాల్లో మొత్తం 889 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 
ఈ 58 లోక్‌సభ స్థానాలతోపాటు ఒడిశా అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ రాష్ట్రంలో ఆరు ఎంపీ స్థానాలతోపాటు 42 అసెంబ్లీ స్థానాలకి కూడా ఇవాళ పోలింగ్ నడుస్తోంది. 


ప్రస్తుతం ఇవాళ పోలింగ్ జరుగుతున్న సీట్లలో చాలా మంది ప్రముకులు పోటీలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ కర్నాల్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా, మరో మాజీ సీఎం మొహబూబా ముప్తీ అనంత్‌నాగ్‌ రాజౌరి నుంచి పీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, బీజేపీ సీనియర్ లీడర్‌ మాజీ మంత్రి మేనకా గాంధీ, బన్సూరి స్వరాజ్‌, సోమ్‌నాథ్‌ భారతీ, మనోజ్‌ తివారీ, కన్హయ్య కుమార్, దినేష్‌ లాల్ యాదవ్‌, ధర్మేంద్ర యాదవ్‌, అభిజిత్‌ గంగోపాధ్యాయ్‌, అగ్నిమిత్ర పాల్‌, నవీన్‌ జిందాల్‌, రాజ్‌ బబ్బర్‌, దీపేందర్‌ సింగ్‌ హుడా, కుమారీ షెల్జా, అపరజిత్‌ సరాంగియా ఇవాళ పోలింగ్‌ జరిగే సీట్లలో పోటీ పడుతున్నారు.  


ప్రస్తుతం చాలా కీలకమైన నియోజకవర్గాల్లో పోలింగ్ నడుస్తోంది. ఢిల్లీలోని నార్‌వెస్ట్‌ ఢిల్లీ, చాందినీ చౌక్‌, నార్త్ ఈస్ట్‌ ఢిల్లీ, యూపీలోని సుల్తాన్‌పూర్,్ అజంగఢ్‌, జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ రాజౌరీ, ఒడిశాలోని భువనేస్వర్, పూరి, సంబల్‌పూర్‌, హరియాణాలోని కర్నాల్‌, కురుక్షేత్ర, గుర్గావ్‌, రోహ్‌తక్‌, పశ్చిమబెంగాల్‌్లోని తమ్‌లుక్‌, మేదినీపూర్‌ చాలా కీలకమైన సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది.  


అన్నింటికంటే ఇప్పుడు అందరి దృష్టి ఢిల్లీపైనే ఉంది. అక్కడ అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు ఎలాంటి ప్రభావం చూపనుంది... ఎవరు పై చేయి సాధించనున్నారో అన్న ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ ఆమ్‌ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నాయి. ఢిల్లీలో ఉన్న ఏడు సీట్లలో ఆప్‌ నాలుగు స్థానాల్లో, కాంగ్రెస్ మూడు స్థానాల్లో పోటీలో ఉంది. 


ఇటు బీజేప, అటు ఆప్‌, కాంగ్రెస్ ప్రచారంలో ఢిల్లీ వీధులు దద్దరిల్లిపోయాయి. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు అయిన కేజ్రీవాల్‌ మధ్యంతర బెయిల్‌పై విడుదలై ప్రచారం చేస్తున్నారు. ఆయనే టార్గెట్‌గా ప్రధానమంత్రి మోదీ, అమిత్‌షా ఇతర లీడర్లు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కాంగ్రెస్ నుంచి రాహుల్, ప్రియాంక గాంధీ రోడ్‌షోలు నిర్వహించారు. 


హరియాణాలో కూడా కాంగ్రెస్‌, ఆప్‌ కలిసి పోటీ చేస్తున్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. అందుకే ఈసారి ఆ ఛాన్స్ ఇవ్వకూడదని ఇండీ కూటమి తీవ్రంగా శ్రమిస్తోంది. ఇక్కడ ఈ మూడు పార్టీలతోపాటు ఐఎన్‌ఎల్‌డీ, జననాయక్ జనతా పార్టీ కూడా పోటీలో ఉంది. లోక్‌సభ ఎన్నికలైన కొద్దిరోజుల్లోనే హరియాణాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందుకే ఈ ఎన్నికలను ఇక్కడ పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 


58 సీట్లలో చాలా సీట్లు చాలా కీలకమైన వేళ ఎన్నికల  సంఘం చాలా జాగ్రత్తలు తీసుకుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఓటు వేయడానికి వచ్చే వాళ్లు ఎండ వేడికి ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంది. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించింది. ఒక వేళ వర్షాలు పడినా ఇబ్బంది పడకుండా జాగ్రత్త పడినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. 


అన్ని జాగ్రత్తలు తీసుకున్నందున ప్రతి ఒక్కరూ వచ్చి ఓటు వేయాలని ఎన్నికల సంఘం పిలుపునిచ్చింది. ఓటు హక్కు అనేది బాధ్యతని గుర్తు చేస్తోంది. ముఖ్యంగా నగరాల్లో ఓటింగ్ శాతం మరింత పెంచేందుకు కూడా చర్యలు చేపట్టింది. ఈసారి కచ్చితంగా ఓటింగ్ శాతం పెరుగుతుందనే అంచనా వేస్తోంది. 
ఐదు విడతులుగా 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 428 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ పూర్తి అయింది. ఆరో విడతలో 11.13 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సాధారణ ఎన్నికల ప్రక్రియ జూన్‌ 2న జరిగే ఏడు విడత పోలింగ్‌తో ముగియనుంది. ఏడో విడతలో 57 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అనంతరం జూన్‌ 4 ఫలితాలు విడుదల చేయనున్నారు.