Telangana Assembly Election 2023: పుట్టుక నుంచి చివరి దాక చూసుకునేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ చెప్పారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ..  కేసీఆర్‌ మళ్లీ గెలవకపోతే హైదరాబాద్‌ అభివృద్ధి ఆగిపోతుందన్నారు. రాష్ట్రంలో సంపద పెంచాలి.. పేదలకు పంచాలి అన్నదే కేసీఆర్‌ సిద్ధాంతమని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్‌ విశ్వనగరంగా ఎదిగిందని, హైదరాబాద్‌లో ఉంటే అమెరికాలో ఉన్నట్లుందని రజినీకాంత్‌ చెప్పిన మాటలను ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్‌లోనే ఇల్లు కొనుక్కోవాలని అనిపిస్తోందని బీజేపీ ఎంపీ సన్ని దేవోల్‌ అన్నారని చెప్పారు.


హైదరాబాద్‌ అభివృద్ధి ఇప్పుడు అందరికి కనిపిస్తోందని, కానీ విపక్షాలకు కనిపించట్లేదని ఎద్దేవా చేశారు. తొమిదిన్నరేళ్లు అద్భుతంగా పరిపాలన చేసిన కేసీఆర్‌ను ఇంటికి పంపిస్తామని కొంతమంది మాట్లాడుతున్నారని, ప్రజలకు సేవ చేస్తున్న నాయకుడికి ప్రజలు ఎందుకు ఓటు వేయొద్దు? కేసీఆర్‌కు ఎందుకు ఓటు వేయొద్దంటున్నారో ప్రజలు ప్రశ్నించాలని కోరారు. ఎవరో వచ్చి ఏవేవో మాట్లాడుతారని, వారు చెప్పిన మాటలు విని ఆగమైతే.. ఎక్కడి అభివృద్ధి అక్కడే ఆగిపోతుందన్నారు. ఇదే జరిగితే కాంగ్రెస్‌ హయాంలో పడిన ఇబ్బందులు, సమస్యలు మళ్లీ మొదలవుతాయని చెప్పారు.


తెల్ల కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి దొడ్డు బియ్యం బదులు అన్నపూర్ణ పథకం కింద సన్నబియ్యం అందిస్తామన్నారు. రూ.400కే సిలిండర్ ఇస్తామని చెప్పారు. ఆడబిడ్డల కోసం సౌభాగ్య లక్ష్మి పథకం కింద 18 నిండిన ఆడబిడ్డలకు నెలకు రూ.3000 వేలు ఇస్తామన్నారు. ఆసరా పింఛన్లను ఐదు వేలకు పెంచబోతున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో మరో లక్ష డబుల్  బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించనున్నట్లు తెలిపారు. అలాగే ప్రతి రోజు నల్లాలో నీరు ఇచ్చేలా  చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మెట్రో దూరాన్ని 400 కిలోమీటర్లకు పెంచాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు చెప్పారు.


తెల్లకార్డు ఉన్న వారికి భూమి ఉన్నా లేకపోయినా రూ.5 లక్షల జీవిత బీమా అమలు చేస్తామన్నారు. ఆడపిల్లల పెళ్లి కోసం కల్యాణ లక్ష్మి, ప్రసూతికి వెళ్లిన అక్క చెల్లెమ్మలకు కేసీఆర్ కిట్, మగ పిల్లాడు పుడితే 12 వేలు, ఆడ పిల్ల పుడితే 13 వేలు ఇస్తున్నట్లు చెప్పారు. పుట్టుక నుంచి చావు వరకు అందరి కోసం ఆలోచించే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం పూట టిఫిన్, మధ్యాహ్నం సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ వస్తే కొట్టుకుంటారనే స్థాయి నుంచి తొమ్మిదిన్నరేళ్లలో ఒక్క చిన్న గొడవ, ఘర్షణ లేకుండా పాలన అందించారని అన్నారు. ఒక్క రోజు కూడా కర్ఫ్యూ పెట్టే అవసరం లేకుండా కేసీఆర్ పాలన సాగిందన్నారు.


హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే క్రమంలో కొత్త వసతులు, కొత్త కార్యక్రమాలు చేపట్టినట్లు కేటీఆర్ చెప్పారు. రోడ్లు, పార్కులు బాగు చేసుకుంటున్నామని తెలిపారు. కేసీఆర్ పాలనలో ప్రజలంతా అన్నదమ్ములా కలిసి ఉన్నారని కేటీఆర్ అన్నారు. బ్రతుకు దెరుకు హైదరాబాద్ వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం కళ్లలో పెట్టుకుని చూస్తోందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం 24 గంటల విద్యుత్, తాగునీరు  అందిస్తోందని చెప్పారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే తెలంగాణ పరిస్థితి అధోగతి పాలవుతుందన్నారు. కేసీఆర్ లాంటి నాయకుడిని మరో సారి ముఖ్యమంత్రిని చేసుకుంటే  పేదల సంక్షేమానికి మరిన్ని పథకాలు ప్రవేశ పెడతారని తెలిపారు.