రేవంత్‌రెడ్డి పిలిచినా... ఎవరు పిలిచినా మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి వెళ్లడం లేదని తేల్చేశారు వెంకట్‌రెడ్డి. ఆ ఉపఎన్నిక తనకు సంబంధం లేదనేశారు. పీసీసీ చీఫ్‌ను మార్చే వరకు పార్టీ భవిష్యత్‌ చెప్పలేమంటూ ప్రత్యర్థులపై బాంబులు వేశారు. 


దిల్లీ నుంచి హైదరాబాద్‌ వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి పీసీసీ చీఫ్‌ రేవంత్‌, మాణికం ఠాగూర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కచ్చితంగా హుజూరాబాద్‌లో వచ్చినట్టుగానే కాంగ్రెస్‌కు మూడు నుంచి నాలుగు వేల ఓట్లు వస్తాయని ఎద్దేవా చేశారు. సుదీర్ఘ కాలంలో పార్టీలో పని చేస్తున్నప్పటికీ తనకు గుర్తింపు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు కోమటిరెడ్డి.


నాలుగు పార్టీలు మారిన వచ్చిన వ్యక్తికి పీసీసీ పదవి కట్టబెట్టారని రేవంత్‌ను ఉద్దేశించి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. దీనిపై ఎవరి అభిప్రాయం తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. అందరితో మాట్లాడినట్టు మాణికం ఠాగూర్ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. 


పార్టీని ఎప్పటి నుంచో నమ్మకున్న వాళ్లకు అన్యాయం చేస్తూ పార్టకీ ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. పార్టీని సర్వనాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్రతిఫలంగానే తెలంగాణలో పార్టీకి ఈ దుస్థితి వచ్చిందని నిట్టూర్చారు. 


పీసీసీ చీఫ్ మారితే తప్ప తెలంగాణలో కాంగ్రెస్‌ పరిస్థితి మారదని అభిప్రాయపడ్డారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. మాణికం ఠాగూర్‌కు అనుభవం లేదన్నారు. కమల్‌నాథ్‌ లాంటి అనుభవం ఉన్న వాళ్లను తెలంగాణ ఇంఛార్జ్‌గా పెడితే మారు ఖాయమని అభిప్రాయపడ్డారు. అలాంటి వ్యక్తిని నియమించి కార్యకర్తల అభిప్రాయ సేకరణ చేసి కొత్త పీసీసీ చీప్‌ను నియమించాలని డిమాండ్ చేశారు. తాను పార్టీ మారబోనని స్పష్టం చేశారు వెంకట్‌ రెడ్డి. 


ఇదే విషయాలతో సోనియాగాంధీకి ఓ లేఖ కూడా రాశారు వెంకట్‌రెడ్డి. దిల్లీలో ప్రియాంకాగాంధీతో జరిగిన మునుగోడు సమీక్షకు వెళ్లకపోవడానికి కారణాలు వివరిస్తూ పార్టీలోని ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. మునుగుడు ఉపఎన్నిక వేళ అడుగడుగునా తనను అవమానించారని వాపోయారు. అందుకే ఆ ఉపఎన్నికకు దూరంగా ఉంటున్నట్టు స్పష్టం చేశారు. ప్రచారానికి కూడా వెళ్లబోనుంటూ తేల్చి చెప్పారు. 


కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్న వెంకటరెడ్డి నల్లగొండ రాజకీయాల్లోనే పట్టున్న నేత. ఆయన అండతోనే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎంపీ సీటు దక్కించుకుని నేతగా ఎదిగారు. అయితే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. కానీ వెంకటరెడ్డి మాత్రం కాంగ్రెస్‌లోనే ఉన్నారు. కాంగ్రెస్‌పై తన నిబద్ధతను చాటుకోవడానికి సిద్ధంగా ఉన్నానని మునుగోడులో కాంగ్రెస్‌కు అనుకూలంగా ప్రచారం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నాను కానీ తనను కొందరు కించపరిచారని వారి నుంచి క్షమాపణ కావాలని పట్టుబట్టారు. అయితే దీనిపై పెద్దగా చర్చ జరగకుండానే ఆయన కోరినట్లుగా టీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో పాటు అద్దంకి దయాకర్ కూడా క్షమాపణ చెప్పారు. అయితే  క్షమాపణ చాలదలని మళ్లీ కోమటిరెడ్డి రివర్స్ అయ్యారు. 


వెంకట్‌రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని చాలా క్లియర్‌గా చెప్పారు రేవంత్‌రెడ్డి. ఇద్దరం కలిసే మునుగోడు ప్రచారంలో పాల్గొంటామని కూడా చెప్పారు. కానీ వెంకట్‌ రెడ్డి మాత్రం రివర్స్ అయ్యారు. ప్రచారంలో పాల్గొనడం లేదని... అసలు పీసీసీ చీఫ్‌నే మార్చాలంటూ డిల్లీలో తిరుగుతున్నారు.