అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి రాజీనాామా చేస్తున్నట్టు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. త్వరలోనే ఆయన మళ్లీ కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు ప్రకటించారు. పార్టీ మార్పుపై స్పష్టత ఇస్తూ కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఓ లేఖను విడుదల చేశారు. కేసీఆర్ దుర్మార్గపు పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలనే లక్ష్యంతోనే పార్టీ మారుతున్నట్టు వెల్లడించారు. 


తెలంగాణ ఎన్నికల సందర్భంగా పొలిటికల్ హీట్ విపరీతంగా పెరిగింది.  ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఆయా పార్టీలు విడుదల చేసిన జాబితాల్లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు తమ అసంతృప్తి తెలియజేస్తున్నారు. కొందరు ఏకంగా పార్టీకి రాజీనామా చేసి ప్రత్యర్థులతో చేతులు కలుపుతున్నారు. అదే బాటులో పయనించారు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆయన బీజేపీకి రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు ప్రకటించారు. 


27న ఢిల్లీలో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. ఆయన  మునుగోడు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలుస్తారని ప్రచారం సాగుతోంది. గతంలో మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి, ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆ తర్వాత ఉపఎన్నికలో ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన బీజేపీలోనే కొనసాగుతున్నా, పార్టీ కార్యక్రమాల్లో అంత చురుగ్గా పాల్గొనడం లేదు. 


రాజగోపాల్ రెడ్డి తిరిగి పార్టీలో చేరితే తమకు ప్లస్ అవుతుందని కాంగ్రెస్ అంచనా వేసింది. ఎన్నికల్లో మునుగోడు లేదా ఎల్బీనగర్ నుంచి పోటీ చేయడానికి ఆయన ఆసక్తి చూపిస్తున్నారని, అందుకు కాంగ్రెస్ నుంచి మంచి వాతావరణం ఉండడంతోనే పార్టీ మారుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఆయన తన అనుచరులు, ముఖ్య కార్యకర్తలతో కొన్ని రోజులుగా సమాలోచనలు జరుపుతున్నారు. చివరకు బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు ప్రకటించారు. 


ప్రజాభిష్టం మేరకే బీజేపీకి బైబై చెప్పి కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ మాత్రమే ఉందని ప్రజలు అలానే ఆలోచిస్తున్నారని చెప్పారు. అందుకే వారి ఆలోచనలు అనుగుణంగానే కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతూ వచ్చాయని తాను విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. అనుకున్న స్థాయిలో బీజేపీ ఎదగలేకపోయిందన్నారు. 


రాజగోపాల్ రెడ్డి విడుదల చేసిన లెటర్‌లో ఏముందంటే...." కేసీఆర్ కుటుంబ పాలన నుంచి తెలంగాణను విముక్తి చేయాలనే నా ఆశయం  మరో ఐదు వారాల్లో నెరవేరుతుందని భావిస్తున్నాను. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది. ప్రజలు మార్పును కోరుకుంటున్నట్టు స్పష్టమవుతోంది. ఏడాదిన్నర క్రితం తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదిగిన బిజెపి,  ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో కొంత డీలా పడింది.


ఇప్పుడు తెలంగాణ ప్రజలు అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ను భావిస్తున్నారు. అందుకే నేను కూడా తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా  వ్యవహరించాలని నిర్ణయించుకున్నాను. తెలంగాణలో అవినీతి అరాచక నియంతృత్వ కుటుంబ  పాలనకు చరమగీతం పాడే శక్తి భారతీయ జనతా పార్టీకే ఉందని భావించి 15 నెలల క్రితం నేను మునుగోడు ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరిన విషయం అందరికి తెలిసిందే. గత ఏడాది అక్టోబర్ నెలాఖరున మునుగోడు అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమీషా, బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆశీస్సులతో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి అధికార బీఆర్ఎస్‌ను ఓడించినంత పని చేశాను. 


ఒక రాజకీయ యుద్ధం మాదిరిగా జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ 100 మంది ఎమ్మెల్యేలు మరో వంద మంది ఇతర సీనియర్  నేతలను ప్రచారంలోకి దింపి వందల కోట్లు ఖర్చు చేసి, భారీ స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడినప్పటికీ
స్వల్ప తేడాతో నెగ్గి, నైతికంగా ఓడింది. మునుగోడు ఉప ఎన్నికల్లో నా విజయం కోసం ప్రయత్నించిన బిజెపి నేతలు కార్యకర్తలు శ్రేయోభిలాషులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను.


అవినీతిలో మునిగిన కేసీఆర్ సర్కారుపై కేంద్రం చర్యలు తీసుకుంటుందన్న తెలంగాణ ప్రజల కోరిక నెరవేరకపోవడంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతూ వచ్చాయి. అధికార బి.ఆర్.ఎస్ కు ప్రత్యామ్నాయంగా బిజెపి ఎదగలేక పోవడంతో ఆ స్థానంలోకి కాంగ్రెస్ వచ్చింది. సకల జనుల పోరాటంతో సాకారమైన ప్రత్యేక తెలంగాణ పదేళ్ల  కెసిఆర్ సర్కారు అరాచక పాలనతో గాడి తప్పింది. అధికార మార్పును కోరుకుంటున్న తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే నేను కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నాను. తప్పనిసరి పరిస్థితుల్లోనే బిజెపికి రాజీనామా చేస్తున్నాను. మునుగోడు ఉపఎన్నిక ద్వారా నాకు నియంతృత్వ కేసీఆర్ సర్కారుపై యుద్ధం చేసే అవకాశం కల్పించిన బిజెపికి ధన్యవాదాలు. కెసిఆర్ సర్కారుపై యుద్ధం చేయాలని ప్రోత్సహించిన కేంద్ర మంత్రి అమిత్ షాకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. తెలంగాణ ప్రజల ఆలోచనల మేరకు పార్టీ మారాలని నేను తీసుకున్న నిర్ణయాన్ని బిజెపి పెద్దలు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను." అని వివరించారు. 


బీజేపీ విడుదల చేసిన తెలంగాణ అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంతో రాజగోపాల్‌ రెడ్డి అలిగినట్టు ప్రచారం నడుస్తోంది. అందుకే ఆయన కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారనే ప్రత్యర్థులు చెబుతున్నారు. రాజగోపాల్ రెడ్డి గతేడాది ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 2022, నవంబరులో జరిగిన మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ తరఫున పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచీ బీజేపీలోనే కొనసాగుతున్నా పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా లేరు. అప్పుడప్పుడూ మాత్రమే బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.