Jubilee Hills By-election : తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. సిట్టింగ్ బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ అకాల మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది. త్వరలో నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలలో ఎమ్మెల్యే సీటు కోసం పోటీ పీక్స్ కు చేరుకుంది. తాజాగా బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్దిగా సిట్టింగ్ ఎమ్మెల్యే, దివంగత నేత మాగంటి గోపీనాథ్‌ భార్య సునీతకు టిక్కెక్ ఖారారు చేసింది బిఆర్‌ఎస్. ఇక మిగిలింది కాంగ్రెస్ , బిజెపి వంతు.

Continues below advertisement

ఇప్పటికే బిసి అజెండాతో ముందుకెళ్తున్నట్లు ప్రకటించిన అధికార కాంగ్రెస్ పార్టీ, బిసి అభ్యర్దినే జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే బరిలో దింపేందుకు సిద్దమైంది. ముందస్దు వ్యూహంలో భాగంగా మైనర్టీలను బుజ్జగించే మాస్టర్ ప్లాన్‌తో అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ ఇచ్చింది. అంతకు ముందు వరకూ తనకే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టిక్కెట్ అంటూ పబ్లిక్‌గా ప్రకటనలు చేసే అజారుద్దీన్‌ను అలా కట్టడి చేయగలిగింది కాంగ్రెస్ అధిష్టానం. ఇప్పుడు మిగిలింది బిసి అభ్యర్దిని ప్రకటించడం మాత్రమే. అయితే ఇక్కడే కాంగ్రెస్ కు అస్సలు కష్టాలు మొదలయ్యాయి. జూబ్లీహిల్స్ సీటు కోసం కాంగ్రెస్‌లో ఇప్పటికే స్దానిక నేత నవీన్ యాదవ్ పోటీపడుతుంటే, తాజాగా తెరపైకి మాజీ ఎంపీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ నేను సైతం అంటూ పోటీలోకి దూసుకొచ్చారు. వీరిద్దరికీ తోడు గౌడ సామాజికవర్గం నుంచి మురళీ గౌడ్ పోటీపడుతున్నారు.

జూబ్లీహిల్స్ నియోజవర్గంలో మొత్తం ఓటర్లు 3,92,669 మంది ఉండగా వారిలో యాదవులు, మున్నూరు కాపు, పద్మశాలి, గౌడ ఇలా మొత్తంగా 11 బిసి ఉపకులాల ఓట్లన్నీ కలిపి 1,41,726 మంది ఓటర్లున్నారు. ఈ మొత్తం ఉపకులాల్లో అధికంగా మున్నూరు కాపుల ఓట్లు 20,803 మంది ఉండగా, ఎమ్మెల్యే సీటు కోసం ప్రధాన పోటీలో ఉన్న అభ్యర్థులు మాత్రం యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం ఇక్కడ ప్రధాన ట్విస్ట్ గా చెప్పవచ్చు. మున్నూరు కాపుల నుంచి దానం నాగేందర్ పేరు మొదట్లో వినిపించినప్పటికీ, పార్టీ ఫిరాయింపు చిక్కుల్లో ఉన్న దానం జూబ్లీహిల్స్ వైపు చూసే అవకాశాలు దాదాపు లేనట్టే. ఈ నియోజవర్గంలో బిసి ఓటర్లలో యాదవ సమాజిక వర్గం ఓట్లు 15వేలకుపైగా ఉంటాయి. కానీ ఇతర కులాలో జనాకార్షక నేతలు లేకపోవడంతో బిసిలో ఈసారి సీటు యాదవ సEమాజిక వర్గాన్ని వరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పొలిటికల్ టాక్ నడుస్తోంది. 

Continues below advertisement

కమ్మ, రెడ్డి, ఆంధ్రా కాపు, వెలమ ఇలా వివిధ ఓసీ ఉప కులాలతో కలిపి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓసీ ఓటర్లు మొత్తం 67,480 మంది ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపీనాథ్‌ సైతం ఓసీ సామాజిక వర్గానికి చెందిన నేత, ఈయన మూడుసార్లు ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అంతకు ముందు ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన విష్ణువర్ధన్ రెడ్డి సైతం ఓసీ సామాజిక వర్గానికి చెందిన వాడే కావడంతో వరుసగా నాలుగు సార్లు ఈ నియోజవర్గం నుంచి ఓసీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాజాగా అధికార కాంగ్రెస్ పార్టీ బిసి అభ్యర్దిని పోటీలోకి దించడంతో బిసి వర్సెస్ ఓసీ కులాల మధ్య గట్టి పోటీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.  

బిసిల తరువాత ఇక్కడ ముస్లిం మైనార్టీ ఓట్లు 96,546మందితో రెండో స్థానంలో ఉన్నప్పటికీ ఈసారి బరిలో ఓసీ అభ్యర్థి పేరు తెరపైకి రాకపోవడంతో మైనార్టీ ఓటర్లే అభ్యర్థుల గెలుపోటములు డిసైడ్ చేసే ఫ్యాక్టర్ గా చెప్పవచ్చు. బిజెపి సైతం తామేం తక్కువ కాదంటూ జూబ్లీహిల్స్ సీటు సొంతం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. అభ్యర్థి ఎవరు అనేది ఓ క్లారిటీ రానప్పటికీ బిజెపి మాత్రం మా లెక్కలు మాకున్నాయంటూ దూసుకుపోతోంది. ఇలా సింపథీ వర్కవుట్ అవుతుందనే ఆశతో బిఆర్‌ఎస్ ఉంటే, బిసి నినాదం గెలుపు తెచ్చిపెడుతుందనే ధీమాతో కాంగ్రెస్ ఉంది. ఈ నేపధ్యంలో రెండు దశాబ్ధాల తరువాత జూబ్లీహిల్స్ నియోజవకర్గంలో బిసి వర్సెస్ ఓసీ కులాల మధ్య హోరాహోరీ పోరు రసవత్తరంగా మారింది.