Jeevan Reddy About PM Modis Comments: ప్రధాని నరేంద్ర మోదీ మతవిశ్వాసాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే అయోధ్య రామాలయాన్ని బుల్డోజర్‌తో కూల్చేస్తారంటూ మోదీ వ్యాఖ్యలు చేయడం దారుణమని జీవన్‌ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో జీవన్‌ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అయోధ్య రామాలయంపై చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్‌ ఇచ్చారు.


ప్రధాని ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు. బుల్డోజర్‌తో అయోద్య రామాలయాన్ని కూల్చేస్తామంటూ ప్రధాని వ్యాఖ్యలు చేయడం దారుణమన్న జీవన్‌ రెడ్డి.. ఈ తరహా వ్యాఖ్యలు మత విశ్వాసాలను రెచ్చగొట్టడమేనని పేర్కొన్నారు. ప్రధాని మోదీ వెంటనే ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. బుల్డోజర్‌ను తెరపైకి తీసుకువచ్చింది కాంగ్రెస్‌ పార్టీయే అన్న జీవన్‌ రెడ్డి.. ఎన్నికల వేళ రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రధాని ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ విమర్శించారు. అయోధ్యలో రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్‌ పార్టీ అని, రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిన విషయాన్ని జీవన్‌రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాజీవ్‌ గాంధీ బతికి ఉంటే రామాలయ నిర్మాణం ఎప్పుడో పూర్తయ్యేదని స్పష్టం చేశారు. 


ఎన్నికల కోసం దేవుడిని వాడొద్దు


ఎన్నికల వచ్చిన ప్రతిసారి దేవుడిని వాడుకోవడం బీజేపీకి పరిపాటిగా మారిందని, ఇది మంచి పద్ధతి కాదని జీవన్‌ రెడ్డి పేర్కొన్నారు. మత సామరస్యానికి కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందన్న జీవన్‌ రెడ్డి.. ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఎప్పుడూ కాంగ్రెస్‌ పార్టీ ఈ తరహా వ్యాఖ్యలు చేయలేదన్నారు. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు దూరదర్శన్‌లో రామాయణ, మహాభారతాలు ప్రసారం చేశారని, ఈ విషయాన్ని బీజేపీ నేతలు గుర్తించుకోవాలని సూచించారు. ప్రధానిగా నరేంద్ర మోదీ వచ్చిన తరువాతే రామాలయ నిర్మాణానికి అంకురార్పణ జరిగినట్టు ప్రచారం చేసుకోవడం తగదన్న జీవన్‌ రెడ్డి.. కోర్టు తీర్పు ప్రకారమే ఆలయ నిర్మాణం జరిగిన విషయాన్ని గుర్తించాలన్నారు.


మతం పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోందని, ఇంకా ఎన్నాళ్లు ఈ తరహా రాజకీయాలు చేస్తారంటూ జీవన్‌ రెడ్డి ప్రశ్నించారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాలు కోసం బీజేపీ దేశాన్ని నాశనం చేస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా చేసిన అభివృద్ధి, ఇతర అంశాలతో రాజకీయాలు చేయాలని, మత ప్రాతిపదిక రాజకీయాలకు బీజేపీ స్వస్తి పలకాలని జీవన్‌రెడ్డి సూచించారు.