Elections 2024 :  నామినేషన్ సమయంలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాహనంపై దాడి చేసినందున తాము పులివర్తి నానిపై ప్రతిదాడి చేశామని అంతే కానీ ఆయనను చంపాలని కాదని ఈ దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న భానుకుమార్ రెడ్డి సతీమణి, జడ్పీటీసీ ఢిల్లీ రాణి అన్నారు. నిందితుల్ని అరెస్టు చేయడంతో ఆమె తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. 


ప్రతి దాడి చేశాం !


చంద్రగిరి ఎమ్యెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాహనం పై చేసిన దాడికి ప్రతిదాడిగా పులివర్తి నాని వాహనం పై దాడి చేశామని నానికి ప్రాణ హాని కలిగించే ఉద్దేశ్యం తమకు లేదని సి.రామాపురం జెడ్పిటిసి, వైసిపి నేత భానుకుమార్ రెడ్డి సతీమణి ఢిల్లీరాణి స్పష్టం చేశారు.  తిరుపతి ఆర్డిఓ కార్యాలయం వద్ద నామినేషన్ వేయడానికి వచ్చిన చెవిరెడ్డి వాహనం పై వేలాదిమంది టీడీపీ నాయకులు దాడికి దిగారని, అందుకనే తన భర్త ప్రతిదాడి చేశారని సమర్థించుకున్నారు. పద్మావతి వర్సిటీలో   కేవలం నాని వాహనం పై దాడి చేశారని, ఎక్కడా ఆస్తినష్టం చేయలేదని, ఎవరిని గాయపరచలేదని అన్నారు. 


కేసులో లేని వ్యక్తుల్ని అరెస్టు చేశారు !


 13 ఏళ్లుగా తాము రాజకీయాల్లో ఉన్నామని, ఏనాడు దౌర్జన్యాలకు దిగలేదని ఢిల్లీ రాణి చెప్పుకున్నారు.  మహిళా వర్శిటీ వద్ద జరిగిన ఘటనలో 5 మంది మాత్రమే పాల్గొన్నారని కానీ   150 మంది ఉన్నారని టీడీపీ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని  విమర్శించారు.  దాడితో సంబంధం లేని వ్యక్తులను పోలీసులు అరెస్టు చేయడం దారుణమన్నారు. ఐదేళ్ల వైసిపి ప్రభుత్వంలో చంద్రగిరి  నియోజకవర్గంలో ఎక్కడా దాడులు జరిగిన సందర్భాలు లేవని ఢిల్లీ రాణి తెలిపారు.  పులివర్తి నాని వచ్చాకే పల్లెల్లో రక్తపాతాలు మొదలైయ్యాయని ఆరోపించారు.  


పోలింగ్ ముగిసిన తర్వాత దాడులు చేశారు !


పోలింగ్ ముగిసిన తరువాత టీడీపీ నేతలు కూచువారి పల్లిలో తమ నేత చంద్రశేఖర్ రెడ్డి ఇల్లు  , స్కూటర్ దగ్ధం చేయడంతో పాటు మోహిత్ రెడ్డి పైనా దాడికి యత్నించారని ఆరోపించారు. నియోజకవర్గంలో వైసిపి కోసం పనిచేసే వారినే నాని టార్గెట్ చేసారని, గ్రామాల్లో గొడవలు లేకుండా ఉండాలన్నదే చెవిరెడ్డి లక్ష్యమన్నారు. తమకు ఎవరి పైనా వ్యక్తి గత కక్షలు లేవనన్నారు.  నాని రాజకీయ డ్రామాలు మానుకోవాలని అన్నారు. తమకు జరిగిన ఘటన పై సిట్ ను కలిసి తమ గోడును వెళ్లబోసుకుంటామని అన్నారు.  


పోలింగ్ ముగిసిన తర్వతా స్ట్రాంగ్ రూములను పరిశీలించేందుకు వెళ్లిన పులివర్తి నానిపై వైసీపీకి చెందిన వారు దాడులు చేశారు ఆ దాడుల దృశ్యాలు కారు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో భయంకరంగా ఉన్నాయి. నాని భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఆయన గాల్లోకి కాల్పులు జరపడంతో  నాని ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రి లో చేరారు. ఈ ఘటనలన్నింటిపై ఈసీ సీరియస్ అయి సిట్ నియమించడంతో  దర్యాప్తు బృందం విచారణ చేస్తోంది.