Andhra Election News : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల అనంతర హింస పెరిగిపోవడంతో కట్టడి కోసం పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా పెట్రో బాటిళ్లలో పెట్రోల్ అమ్మకాలను నిషేధించారు. అలా అమ్మితే పెట్రోల్ బంకుల యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇటీవల పల్నాడులో జరిగిన గొడవల్లో పెట్రో బాంబులతో ఇరు వర్గాలు దాడులు చేసుకున్నాయి. తర్వాత మాచర్ల ఎమ్మెల్యే స్వగ్రామంలో జరిపిన సోదాల్లో పెద్ద ఎత్తున పెట్రో బాంబులు దొరికాయి. దీంతో బాటిళ్లలో పెట్రోలు అమ్మకాల్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
బాటిళ్లలో పెట్రోల్ అమ్మకాన్ని చాలా కాలంగా పరిమితం చేసిన పెట్రోల్ బంకులు
చాలా కాలంగా బాటిళ్లలో పెట్రోల్ అమ్మకాలను బంకులు ప్రోత్సహించడం లేదు. బాగా తెలిసిన వారు వస్తేనే అమ్ముతున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పెట్రోల్ వాడుతూండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఇలా బాటిళ్లలో పెట్రోల్ కొనుక్కెళ్లి మనుషులపై పోసి తగులబెట్టిన సందర్భాలు ఉన్నాయి. రేపల్లెలో అమర్నాథ్ గౌడ్ అనే కుర్రాడ్ని కూడా అలా కాల్చిచంపారు. అయితే.. దారి మధ్యలో ఆటోలు, బైక్‌లు ఆగిపోయిన వారు ..వాహనాలను అక్కడే వదిలేసి వెళ్లి బాటిళ్లతో పట్టుకుని మళ్లీ వాహనాలను తీసుకెళ్తూంటారు. అలాంటి వారికి సమస్యలు ఎదురవుతున్నాయి.
బాంబుల తయారీ కోసం బాటిళ్లలో పెట్రోల్ కొంటారా ?
అయితే పెట్రోలు ఉపయోగించి దాడులు చేయాలనుకునేవారు బాటిళ్లలోనే కొంటారని నమ్మకం ఏమిటన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. బైక్ లేదా కారు ట్యాంకు నిండా కొట్టించుకుని వెళ్లి దాన్ని బాటిళ్లలో నింపుకోలేరా అని కొంత మంది ప్రశ్నిస్తున్నారు. బాటిళ్లలో పెట్రోల్ తీసుకెళ్లి బాంబులు తయారు చేసే వారు ఉండరని.. పెద్ద ఎత్తున కొనుక్కుని వెళ్లి తయారు చేస్తారని అంటున్నారు. ఇలాంటి నిబంధనలు పెట్టడం వల్ల ఉపయోగం ఉండదని కూడా వాదించే వారు ఉన్నారు. అయితే కొన్ని చర్యలు తప్పవని పోలీసులు ఈ దిశగా నిర్ణయం తీసుకున్నారు.
పల్నాడులో పలు చోట్ల పెట్రోల్ బాంబుల పట్టివేత
పల్నాడులో ఎప్పుడూ లేనంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలింగ్ రోజు మధ్యాహ్నం ప్రారంభమైన ఘర్షణలు మూడు రోజుల పాటు సాగాయి. పల్నాడు మత్రమే కాదు తాడపత్రి, తిరుపతిలోనూ సాగాయి. ఇవి తీవ్రమైన దాడులు, బాంబుదాడులు వంటివి కావడంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ విషయంలో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలన్న సూచనలు వస్తున్నాయి. గత మూడు రోజుల నుంచి భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. దీంతో అల్లర్లు తగ్గాయి. ఇప్పుడు నిందితుల్ని అరెస్ట్ చేసే ప్రయత్నంలో సిట్ అధికారులు ఉన్నారు.