Pawan Kalyan Meeting With Nda Alliance Leaders: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే వివిధ వర్గాలు, ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఆదివారం పిఠాపురం ఎన్డీయే కూటమి కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. వైసీపీ కుట్రలు, కుతంత్రాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్ధేశం చేశారు. పోలింగ్ ముగిసే వరకు క్షేత్రస్థాయిలో పని చేయాలని సూచించిన ఆయన.. విబేదాలను వీడి కలిసి పని చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే వర్మ త్యాగం గొప్పదని.. ఆయన ఉన్నత స్థానంలో ఉండేలా చూసుకుంటానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రజల కోసమే తాను తలొగ్గానన్న జనసేనాని.. వైసీపీ దుర్మార్గ పాలనను అంతమొందించాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు చాలా అనుభవజ్ఞుడని.. రాష్ట్రాన్ని అంతా కలిసి కాపాడుకోవాల్సిన అవసరముందన్నారు. చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు తెలుగు తమ్ముళ్ల బాధ తనను కదిలించిందని, తెలుగుదేశం పార్టీ ఎంతో సమర్థవంతమైన పార్టీ అని వెల్లడించారు. స్ట్రక్చర్ కలిగిన పార్టీని నడపడం అంత సులభం కాదని, జనసేన దగ్గర బలం ఉందన్నారు. ఆ బలం, స్ట్రక్చర్ కలిసి ముందుకు వెళ్తేనే రాష్ట్రాన్ని కాపాడుకోగలమని పవన్ స్పష్టం చేశారు.
'ఆ బాధ్యత ప్రతి ఒక్కరిదీ'
ఎన్‌డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించే బాధ్యత ప్రతి ఒక్కరిదీ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తన కోసం పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తన సీటు త్యాగం చేశారని, ఆయనకు తాను అండగా ఉంటానన్నారు. తన గెలుపునకు వర్మ సహకరిస్తాననడం శుభ పరిణామమన్న పవన్.. చంద్రబాబు మాటకు ఆయన కట్టుబడి ఉన్నారన్నారు. రాష్ట్రం బాగుపడాలనే మంచి ఉద్ధేశంతో ఆయన సీటు త్యాగం చేయడం గొప్ప విషమన్నారు. టీడీపీ, బీజేపీ హక్కులకు, రాజకీయ మనుగడకు ఇబ్బంది లేకుండా పని చేస్తామని పవన్ స్పష్టం చేశారు. ఎన్‌డీఏ కూటమి అభ్యర్థులు పోటీ చేసే చోట.. మిగిలిన పార్టీలకు చెందిన కేడర్ కష్టపడి పని చేయాలని సూచించారు. భవిష్యత్‌లో మిగిలిన నాయకులకు మేలు చేసేలా తగిన నిర్ణయాలు తీసుకుంటామన్నారు. జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య ఏమైనా ఇబ్బందులు ఉంటే సర్ధుకుపోవాలని చెప్పారు. పిఠాపురంలో తన గెలుపు చరిత్రలో నిలిచిపోవాలని కోరిన పవన్.. ఆ బాధ్యతను వర్మకు అప్పగిస్తున్నట్టు పేర్కొన్నారు.
రాష్ట్ర ఎన్నికల పర్యవేక్షణ కమిటీ నియామకం
సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తున్న అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో ఎన్నికల పర్యవేక్షణకు ఐదుగురు సభ్యులతో రాష్ట్ర స్థాయి కమిటీని పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఆదివారం నియమించారు. ఈ కమిటీలో పార్టీ ఉపాధ్యక్షుడు బి.మహేందర్ రెడ్డి, పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్, పార్టీ అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్, అనపర్తి ఇన్‌చార్జ్ మరెడ్డి శ్రీనివాస్, పార్టీ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ కె.శరత్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. మర్రెడ్డి శ్రీనివాస్ పిఠాపురం నియోజకవర్గం సమన్వయ బాధ్యతలను చూస్తారు. జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో కేడర్‌ను సమాయత్తం చేయడం, సమన్వయం చేయడం, ప్రచార వ్యవహారాలు నుంచి పోల్, బూత్ మేనేజ్‌మెంట్ తదితర అంశాలను ఈ కమిటీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. ఈ కమిటీ సభ్యులతో పిఠాపురంలో సమావేశమైన పవన్ కల్యాణ్.. వారికి దిశా నిర్ధేశం చేశారు.