Jagan Must Be Defeated In The Next Elections Says Rajendra Prasad : సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవిబి రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 12,918 గ్రామాల్లోని 3.50 కోట్ల ప్రజల కోసం ఢిల్లీ వరకు ఉద్యమం చేస్తున్నామని, ఆయినా ప్రభుత్వ మొండి వైఖరి వీడడం లేదు రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు.
16 న్యాయమైన డిమాండ్ల సాధనకు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామన్న రాజేంద్రప్రసాద్.. జిల్లా కలెక్టర్ల కార్యాలయాల వద్ద నిరసన చేస్తున్నట్టు ప్రకటించారు. అన్ని పార్టీల ఎంపిటిసి, జెడ్పిటిసి, కౌన్సిలర్ల, కార్పొరేటర్ల ద్వారా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీని ఓడించాలని పిలుపునిచ్చామని, వైసీపీ ఓటమితోనే గ్రామాల అభివృద్ధి సాధ్యపడుతుందని రాజేంద్రప్రసాద్ స్పష్టం చేశారు. పంచాయతీల నిధుల కోసం ఎన్ని పోరాటాలు చేసినా సర్కారు స్పందించడం లేదని, ఇంటింటి ప్రచారం చేసి జగన్ చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తామన్న వైవిబి.. కేంద్రం ఇచ్చిన 6,848 కోట్ల నిధులను దారి మళ్లించారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఉపాధి హామీ నిధులు కూడా పక్క దారి పట్టించి ప్రజలకు ఆ న్యాయం చేశారని, వైసీపీ ప్రభుత్వం సుమారుగా 50 వేల కోట్ల నిధులను పంచాయతీలకు ఇవ్వకుండా సొంత పథకాలకు వినియోగించారని దుయ్యబట్టారు.
రెండు రత్నాలకు గ్రామాల నిధులు
నవరత్నాల్లోని రెండు రత్నాలకు గ్రామ పంచాయతీల నిధులను మళ్ళించారని సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఆరోపించారు. గ్రామాల్లో తాగు నీరు, సాగునీరు, కాలువలు, రోడ్లు, వీధి లైట్లు వేయడం లేదని, సర్పంచులకి గౌరవ వేతనం ముష్టి మూడు వేలు ఇస్తున్నారని, వాలంటీర్లకు ఐదు వేల వేతనం ఇస్తున్నారన్నారు. సర్పంచులు, వాలంటీర్స్ ఎవరు కావాలో జగన్ తేల్చుకోవాలని, నిధుల మళ్లింపు మీద హైకోర్టులో కేసు వేసినా హియరింగ్ రాకుండా కుట్ర చేస్తున్నారని రాజేంద్రప్రసాద్ ఆరోపణలు చేశారు.
సీఎం జగన్ దించడానికి తాము కూడా సిద్దంగా ఉన్నామన్న ఆయన.. అందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని కోరారు. ఇటువంటి పాలనను తాను ఎప్పుడూ చూడలేదని, ప్రజలతో ఎన్నికైన గ్రామస్థాయి ప్రజాప్రతినిధులను డమ్మీలుగా మార్చారని విమర్శించారు. కోట్లాది రూపాయల పంచాయతీ నిధులను దుర్వినియోగం చేస్తూ, గ్రామపంచాయతీలను అధోగతి పాలు చేశారని ఆరోపించారు. ఈ తరహా పాలనకు చెక్ చెప్పాల్సిన అవసరం వచ్చిందని రాజేంద్రప్రసాద్ స్పష్టం చేశారు. రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మీ మాట్లాడుతూ మూడేళ్లుగా ఉద్యమాలు నడుస్తున్నాయని, రెండో దశ కింద అసెంబ్లీ ముట్టదించామన్నారు.