Land Titiling Act Politics : ఆంధ్రప్రదేశ్ లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ చట్టంతో రైతుల ఆస్తులకు ఎసరు పెట్టారని ఎవరైనా భూమిని లిటిగేషన్ లో పెడితే కోర్టుకు కూడా వెళ్లే అవకాశం లేకుండా చట్టం తెచ్చారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకుని ఆన్ లైన్ లో పేర్లు మార్చి ఇష్టారీతిన రైతుల పొలాలు, ఆస్తులు దోచుకోవడానికి వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తన్నారు. ప్రస్తుతం ఎన్నికల సీజన్ కావడంతో ఇవి దుమారం రేపుతున్నాయి. ఈ అంశంపై సీఎం జగన్ పాయకరావుపేట ఎన్నికల ప్రచారంలో స్పందించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై విపక్షాలన్న దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.
ల్యాండ్ అండ్ టైటిల్ యాక్ట్ పై చంద్రబాబు అండ్ కో ప్రజల్లో దుష్ర్పచారం చేస్తున్నారని దీని ద్వారా ఎవరికీ ఎటువంటి ఇబ్బంది ఉండదని ప్రకటించారు. ఎవరి భూమిపై వారికే హక్కు ఉంటుందని తెలిపారు. వందేళ్ల కిందట సమగ్ర భూసర్వే చేశారని మళ్లీ ఇప్పటి వరకూ చేయలేదన్నారు. అందుకే ప్రతీ గ్రామంలో భూ వివాదాలు ఉన్నాయన్నారు. సమగ్ర సర్వే ద్వారా ఎవరి భూమి వారికి అచ్చేందుకు సమగ్ర సర్వే పథకాన్ని తెచ్చామన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఎవరి భూమిపై వారికి సంపూర్ణ హక్కులు వస్తాయన్నారు. ఈ చట్టం పేరు చెప్పుకుని జగన్ భూములు లాక్కుంటాడని ప్రచారం చేస్తున్నారని..జగన్ భూములు ఇచ్చే వాడే కానీ లాక్కునేవాడు కాదని ప్రజలకు తెలుసన్నారు.
ఈ చట్టంపై ప్రజలందరికీ కాల్స్ చేస్తూ మెసెజ్ పెడుతూ భయభ్రాంతాలకు గురి చేస్తున్నారని జగన్ విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాయాల్లో పదిహేను వేల మంది సర్వేయర్లను పెట్టామని గుర్తు చేశారు. ఈ సర్వే చేయక ముందు భూమి అమ్మాలన్నా.. కొనాలన్నా అనేక ఇబ్బందులు ఉండేవన్నారు. ఇప్పుడు ఎలాంటి సమస్యలు లేకుండా లావాదేవీలు జరుగుతున్నాయన్నారు. చంద్రబాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమేనని అన్నారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఆయన పేరు చెబితే ఒక్క మంచిపనైనా గుర్తుకు వస్తుందా అని ప్రశ్నించారు.
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను అమలు చేయడం లేదని మంత్రి ధర్మాన ప్రసాదరావు రెండు రోజుల కిందట ప్రకటించారు. అయితే ఇది చాలా మంచి పథకమని.. కొనసాగుతోంన్నట్లుగా సీఎం జగన్ ప్రసంగించడంతో అయోమయం ఏర్పడింది. భూమి సర్వే చేసి ఇస్తే ఓకే కానీ.. అసలు భూములపై వివాదాలు పుట్టించి.. అదికారులు, ప్రభుత్వంపై కుమ్మక్కయి భూములను లాగేసుకునే ముఠాలు ఉన్నాయని జరుగుతున్న ప్రచారంతోనే రైతులు ఆందోళన చెందుతున్నారు. ఓ సారి చట్టం అమలు కావడం లేదని మరోసారి అమలవుతోందని ప్రకటనలు చేయడం ద్వారా రైతుల్లో గందరగోళం ఏర్పడుతోంది.