IT Raids In Viveka Houses: చెన్నూరులో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి (Vivek Venkataswamy) ఇంట్లో ఈడీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. వేకువజాము నుంచి హైదరాబాద్ (Hyderabad) లోని సోమాజిగూడ, మంచిర్యాలలోని ఆయన నివాసాలతో పాటు బేగంపేట్ లోని వివేక్ కార్యాలయంలోనూ తనిఖీలు చేశారు. వివేక్ సంస్థల్లోకి రూ.8 కోట్లు చేరాయనే అంశంపై ఐటీ అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. సోదాల సంగతి తెలుసుకున్న కాంగ్రెస్ (Congress) కార్యకర్తలు భారీ సంఖ్యలో చెన్నూరులోని వివేక్ ఇంటి వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా, పోలీసులు వారిని అదుపు చేస్తున్నారు.  చెన్నూరు, బెల్లంపల్లిలో తనిఖీలు చేపట్టగా, మొత్తంగా 9 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఇటీవల వివేక్ కు సంబంధించిన విశాఖ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతా నుంచి విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఖాతాల్లోకి బదిలీ అయిన రూ.8 కోట్లు సైఫాబాద్ పోలీసులు ఫ్రీజ్ చేసిన సంగతి తెలిసిందే.


ఇటీవల చెన్నూరు బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్, వివేక్ పై ఎన్నికల సంఘం, ఈడీకి ఫిర్యాదు చేశారు. డబ్బు సంచులతో చెన్నూరుకు వస్తున్నారని.. నేతలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. తనను ఓడించేందుకు డబ్బులను తరలిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 


ఇటీవలే కాంగ్రెస్ లో చేరిక


అంతకు ముందు బీజేపీలో ఉన్న మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి.. నామినేషన్ల పర్వానికి ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీ తెలంగాణ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా వివేక్ కొనసాగారు. అనంతరం బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ నేతలతో చర్చల అనంతరం నవంబర్ 1న రాహుల్ గాంధీ సమక్షంలో వివేక్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అనంతరం కాంగ్రెస్ వెంటనే చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించింది.