Telangana Home Voting From May 3 : తెలంగాణ ప్రజలు ఐదు నెలల వ్యవధిలో మరోసారి ఓటు వేయడానికి సిద్ధమయ్యారు. ఈ సారి లోక్ సభ సభ్యులను ఎన్నుకోనున్నారు. మే 13న లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో 525 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని సీఈవో వికాస్ రాజ్ ప్రకటించారు 285 మంది అభ్యర్థులు స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారని తెలిపారు. అత్యధికంగా సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి 45 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యల్పంగా ఆదిలాబాద్ స్థానంలో 12 మంది పోటీ చేస్తున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా ఓటరు స్లిప్పుల పంపిణీ ఇప్పటికే ప్రారంభమయింది. హైదరాబాద్ లో లోక్ సభ ఎన్నికల నిమిత్తం 3986 పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేశారు. కొన్ని ప్రాంతాల్లో 2-3 బ్యాలెట్లను వాడుతున్నారు. అభ్యర్థులు్ ఎక్కువగా బరిలో ఉన్నందున 7 స్థానాల్లో 3 ఈవీంలను వాడాల్సి ఉంటుంద. ఎన్నికల నిమిత్తం ఈసీతో మాట్లాడి అదనంగా ఈవీఎంలను తెప్పిస్తున్నారు. జిల్లాల్లో ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ల ప్రింటింగ్ ప్రక్రియ మొదలైంది. మే 3వ తేదీ నుంచి హోమ్ ఓటింగ్ ప్రారంభమవుతుందని సీఈఓ వికాస్ రాజ్ ప్రకటించారు.
వృద్ధులు, వికలాంగులు దీర్గాలిక వ్యాధిగ్రస్తులు, మంచానికే పరిమితమైన వాళ్ళు మానసిక వ్యాధులు ఉన్నవాళ్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెసులుబాటును కల్పించింది. ఈ విధానం కోసం దరఖాస్తు చేసుకున్న ఓటర్ల ఇంటికి ఎన్నికల అధికారులు సిబ్బందితో కలిసి వెళ్లి డైరెక్ట్ బాక్సులను పోలింగ్ స్థిప్పులను బ్యాలెట్ పేపర్లను తీసుకొని వెళ్లి వారి చేత రహస్యంగా ఓటు వేయిస్తారు. ఈసీ లెక్కల ప్రకారం ప్రస్తుతం తెలంగాణలో 80 ఏళ్లు దాటిన ఓటర్లు 4.87 లక్షల మంది ఉన్నారు. దరఖాస్తుదారుల ఇంటికి అధికారులే వెళ్లి ఓటు వేయిస్తారు. పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓట్ వేసేటప్పుడు ఎలా అయితే రహస్య ఓటింగ్ ఉంటుందో ఇంటి నుంచే ఓటు వేసేటప్పుడు కూడా ఓటర్ ఎవరికి ఓటేస్తున్నారో ఎవరికీ తెలిసే అవకాశం లేకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటారు.
కర్ణాటకతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓట్ ఫ్రం హోం సౌకర్యాన్ని కల్పించారు. లోక్ సభ ఎన్నికల్లో తొలిసారిగా ఓట్ ఫ్రమ్ హోమ్- ఇంటి నుంచే ఓటు వేసే వెసులుబాటును అందుబాటులోకి తెచ్చింది. దేశంలో 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు దేశంలో 88.4 లక్షల మంది ఓటు వేసేవారు ఉన్నారని ఈసీ ఇటీవలే తెలిపింది. 85 ఏళ్ల వయసుపై బడిన వారు 82 లక్షల మంది వృద్ధులు ఉన్నారని పేర్కొంది. వందేళ్లకుపై బడిన వారు 2.18 లక్షల మంది ఉన్నారని భారత ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది.