Gajuwaka Assembly Constituency: విశాఖ జిల్లాలోని మరో కీలక నియోజకవర్గం గాజువాక. ఈ నియోజకవర్గ 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పాటు అయింది. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో మూడు ఎన్నికలు మాత్రమే జరిగాయి. మూడుసార్లు మూడు విభిన్న పార్టీలు అభ్యర్థులు విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో అత్యధిక ఓటర్లు ఉన్నారు. మొత్తంగా 2,07,713 మంది ఓటర్లు ఉండగా, పురుషు ఓటర్లు 1,02,820 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు 1,04,883 మంది ఉన్నారు. 


ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల ఫలితాలు


2009లో ఈ నియోజకవర్గంలో తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన సిహెచ్ వెంకటరామయ్య విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన తిప్పల నాగిరెడ్డిపై 17,907 ఓట్ల తేడాతో ఆయన విజయాన్ని నమోదు చేశారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసిన పల్లా శ్రీనివాస్ ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్సిపి నుంచి పోటీ చేసిన తిప్పల నాగిరెడ్డిపై ఆయన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో పల్లా శ్రీనివాస్ 27,712 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు.


2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన తిప్పల నాగిరెడ్డి ఎక్కడ విజయాన్ని దక్కించుకున్నారు. ఈ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై విజయాన్ని దక్కించుకున్నారు. ఈ ఎన్నికల్లో 16,753 ఓట్ల తేడాతో తిప్పల నాగిరెడ్డి విజయం సాధించి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. గడిచిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గాల్లో గాజువాక ఒకటి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేయడంతో అందరి దృష్టి ఇక్కడ పడింది. అయితే, అనూహ్యంగా ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా పోటీ చేసిన నాగిరెడ్డి పవన్ కళ్యాణ్ పై విజయం సాధించారు.  


రానున్న ఎన్నికల్లో తీవ్రమైన పోటీ


రానున్న సార్వత్రిక ఎన్నికలకు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. వైసీపీ ఎక్కడ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందులో భాగంగానే గెలుపు గుర్రాలను బరిలోకి దించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న తిప్పల నాగిరెడ్డిని కాదని మరొకరికి అవకాశం కల్పించేందుకు వైసిపి అధిష్టానం సిద్ధపడుతుంది. ప్రస్తుతం ఇన్చార్జిగా కార్పొరేటర్ ఉరుకూటి రామచంద్రరావును వైసిపి నియమించింది. కానీ కొద్ది రోజుల్లో మరొకరికి ఈ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం విశాఖ నగర మేయర్ గా ఉన్న గొలగాని హరి వెంకట కుమారి ఈ బాధ్యతలను తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.


తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ విశాఖపట్నం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న పల్లా శ్రీనివాస్ మరోసారి బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. జనసేన కూడా ఈ స్థానాన్ని ఆశిస్తోంది. ఇక్కడ నుంచి ఆ పార్టీ నగర అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పోటీ చేయాలని భావిస్తున్నారు. వీరిద్దరిలో ఎవరు పోటీ చేస్తారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతానికి మూడు పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థుల స్పష్టత కొరవడింది. ఎవరు పోటీ చేసినా ఇక్కడ పోటీ రసవత్తరంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.