Gudivada MLA Kodali Nani : గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికలే తనకి చివరివి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలను కొడాలి నాని చేశారు. ఆయన ఏమన్నారంటే.. తనకు ఇప్పుడు 53 ఏళ్లు వచ్చాయని, వచ్చే ఎన్నికల్లో గెలిస్తే 58 ఏళ్ల వరకు పదవిలో ఉంటానన్నారు. 58 ఏళ్ల తర్వాత రాజకీయాలు చేయలేమని, అందుకే 2029 ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు కొడాలి నాని చెప్పారు. తన ఇద్దరు కుమార్తెలకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదన్నారు. తన తమ్ముడి కుమారుడికి ఆసక్తి ఉంటే వస్తాడని ఈ సందర్భంగా నాని వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తే నియోజకవర్గం లో చేయాల్సిన అభివృద్ధి పనులుపైనే దృష్టి సారిస్తానని స్పష్టం చేశారు.
గుడివాడ నియోజకవర్గంలో 500-600 కోట్ల రూపాయలు వెచ్చించి కాలువలు, రోడ్లు వేయాల్సి ఉందన్నారు. రానున్న ప్రభుత్వంలో తనకు మంత్రి పదవి అవసరం లేదని, ఈ పనులు పూర్తి చేసుకుంటే చాలని ఈ సందర్భంగా కొడాలి నాని వెల్లడించారు. నియోజకవర్గంలో చేయాల్సిన అభివృద్ధి పనులు ఉన్నాయని, వాటిపైనే దృష్టి సారిస్తానన్నారు. ఈ పనులన్నీ పూర్తయితే తాను పోటీ చేయనని, ఎవరికో ఒకరికి అవకాశం కల్పిస్తానని స్పష్టం చేశారు. కొత్త కుర్రాళ్ళకు అవకాశం ఇస్తే వాళ్ళే గెలుచుకుంటారని ఈ సందర్భంగా కొడాలి నాని స్పష్టం చేశారు. తాజాగా కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటివరకు నాలుగు సార్లు గెలుస్తూ వచ్చిన కొడాలి నాని.. తాజాగా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఆయన అభిమానులతో పాటు వైసిపి శ్రేణులను కొంత ఆందోళనకు గురి చేస్తున్నాయి. టిడిపి నేతలు మాత్రం ఓటమి భయంతోనే ఈ తరహా వ్యాఖ్యలు కొడాలి నాని చేస్తున్నాడంటూ విమర్శలు గుర్తిస్తున్నారు. వైసీపీలో ఫైర్ బ్రాండ్ నాతగా పేరుగాంచిన కొడాలి నాని చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.