Andhra Pradesh Politics : తెలుగు రాజకీయాల్లో నగరి (Nagari Assembly)ఎమ్మెల్యే ఆర్కే రోజా (Rk Roja) అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  రోజా అంటే ఫైర్...ఫైర్ అంటే రోజా. అంతలా పాలిటిక్స్ లో పేరు సంపాదించుకున్నారు. ఏ అంశంలోనైనా ప్రత్యర్థుల్ని ఏకిపారేయడంలో ఆర్కే రోజా ముందువరుసలో ఉంటారు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరపున (Ycp) వరుసగా రెండుసార్లు గెలిచారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో అలకపాన్ను ఎక్కారు. దీంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి...రోజాకు ఏపీఐఐసీ చైర్మన్‌ పదవి కట్టబెట్టారు. 


పార్టీలోనే రోజాకు వ్యతిరేకంగా గ్రూపులు
నామినేటెడ్ పోస్టు వచ్చిన తర్వాత ఆర్కే రోజా మరింత రెచ్చిపోయారు. చంద్రబాబు నుంచి పవన్ కళ్యాణ్ వరకు విపక్ష నేతలందరిపై తీవ్ర విమర్శలు చేశారు. సందర్బంగా వచ్చినపుడల్లా మాటల తూటాలు పేల్చారు. దీంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి...రెండోసారి మంత్రి విస్తరణలో రోజాకు ఛాన్స్ ఇచ్చారు. మంత్రి పదవి చేపట్టి తర్వాత రోజా మరింత రెచ్చిపోయారు. ప్రత్యర్థులపై విమర్శలు చేయడంలో డోసు పెంచారు. ప్రత్యర్థులను రోజా చెడుగుడు ఆడుతుంటే... సొంత నియోజకవర్గంలో మాత్రం ఆమె పప్పులు ఉడకడం లేదు. ఆమెకు వ్యతిరేకంగా సొంత పార్టీలోనే గ్రూపులు తయారయ్యాయి. నగరిలో వైసీపీ ముక్కలైపోయింది. గత రెండు ఎన్నికల్లో రోజాను గెలిపించడానికి కృషి చేసినవారే....ఇప్పుడు ఆమెకు వ్యతిరేకంగా తిరుగుబాటు జెండా ఎగురవేశారు. 


ఎవరికి వారే సొంత కార్యక్రమాలు
శ్రీశైలం ఆలయ చైర్మన్‌ చక్రపాణి రెడ్డి నిరంతరం రోజాకు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సిఎం జగన్ సైతం నగరి సభలో... కేజీ శాంతి, రోజా కలసి పని చేయాలని సూచించినా...ఫలితం శూన్యం. పుత్తూరు మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవి ఇప్పిస్తామంటూ...రోజా సోదరుడు 70 లక్షలు తీసుకున్నారంటూ 17వ వార్డు కౌన్సిలర్‌ భువనేశ్వరి ఆరోపించారు. ఇలా నియోజకవర్గంలోని ప్రతి మండలంలోనూ సొంత పార్టీ నుంచే రోజాకు బలమైన ప్రత్యర్థులు తయారవుతున్నారు. వీరంతా గత రెండు,మూడేళ్ళుగా రోజాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలతో వీరి మధ్య వైరం మరింత పెరిగింది. రోజాకు మరోసారి టిక్కెట్ రాకుండా చేయడానికి...మంత్రి పెద్దిరెడ్డి ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో అధినేత జగన్ సైతం పనితీరు బాగుంటేనే సీటు అని చెప్పడంతో తమ పంతా నెగ్గుతుందని భావించారు.


గాలి జగదీష్ కు టచ్ లోకి రోజా వ్యతిరేక వర్గం
ఇంత వ్యతిరేకత ఉన్నా...ఆమెను ఎందుకు మార్చడం లేదనే చర్చ  ప్రత్యర్థుల గ్రూపులో జరుగుతోంది. అయితే రోజా అనుచరవర్గం లెక్క మాత్రం మరోలా ఉంది. వ్యతిరేక వర్గం నేతలు సీటు ఇవ్వాలని చేసిన విజ్ఞప్తికి...పార్టీ స్పందించి అంతర్గత సర్వేతో పాటు పలు సర్వేలు చేయించింది. వీటిలో వారికి రివర్స్‌లో ఫలితాలు వచ్చినట్లు తెలుస్తోంది. లాభం లేదని భావించిన రోజా వ్యతిరేకవర్గం...టీడీపీ నేత గాలి జగదీష్‌కు టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. గాలి జగదీష్‌ గెలుపు కోసం పని చేస్తామని... వచ్చే ఎన్నికల్లో రోజాకు సీటు ఇస్తే ఓడించి తీరుతామని ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. నగరిలో రోజాను మారిస్తే...లేదంటే పరాభవం తప్పదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.