ఉమ్మడి అనంతపురం(Anathapur) జిల్లా....ఒకప్పుడు కాంగ్రెస్(Congress) పార్టీకి కంచుకోట. కాకలు తీరిన రాజకీయ ఉద్దండులతో రాష్ట్ర రాజకీయాలపై బలమైన ప్రభావం చూపేవారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి( Ys Rajashekar Reddy) హయంలో జిల్లాలో పార్టీ ఓ వెలుగు వెలిగింది. రాష్ట్ర విభజన పాపం మూటగట్టుకున్న కాంగ్రెస్.... అనంతరం ఆంధ్ర ప్రదేశ్ లో అడ్రస్ లేకుండా పోయింది. ఏపీ కాంగ్రెస్ ఇక బతకడం కష్టమేనన్నారు.కానీ దశాబ్దాలపాటు తిరుగులేని రాజకీయం చేసిన కాంగ్రెస్ కు గ్రామస్థాయి నుంచి బలమైన కేడర్ ఉంది. కానీ వారికి మార్గనిర్దేశం చేసే నాయకుడే లేకపోవడంతో నిస్తేజంగా ఉన్న వారందరికీ షర్మిల(Ap Pcc Chief Sharmila) రాక నూతనోత్సాహం వచ్చింది. రాజశేఖర్ రెడ్డి బిడ్డగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన షర్మిల...పీసీసీ బాధ్యతలు తీసుకున్న వెంటనే రాష్ట్రవ్యాప్తంగా పర్యటనకు శ్రీకారం చుట్టింది. పాతతరం నాయకులను కలుస్తూ...పార్టీలోకి ఆహ్వానిస్తోంది. తన తండ్రితో సన్నిహితంగా మెలిగిన వాళ్లను కలిసి తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతోంది.
షర్మిల రాకతో నూతనోత్సాహం
రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించిన షర్మిల( Sharmila)....అనంతపురం జిల్లాలోనూ అడుగుపెట్టింది. రాజన్న బిడ్డ రాకతో కాంగ్రెస్ నాయకుల్లో ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. పెద్దఎత్తున ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆ ఊపు కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. కీలకమైన నేతలు తిరిగి రెగ్యూలర్ రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడంతోపాటు...కొత్తగా పార్టీలో చేరే వారితో కాంగ్రెస్ ఫుల్ జోష్ మీదు ఉంది. రానున్న ఎన్నికల్లో తప్పకుండా ప్రధాన పార్టీలకు దీటుగా సమాధానం ఇస్తామని ఇప్పటికే ప్రకటించిన షర్మిల...అందుకు అనుగుణంగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఈనెల 11వ తేదీ సత్యసాయి జిల్లా మడకశిర(Madakasira) నియోజకవర్గం లో వైఎస్ షర్మిల బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి...మళ్లీ పార్టీకి జవసత్వాలు అందించాలని భావిస్తున్న సీనియర్ నేతలు మాజీమంత్రులు రఘువీరారెడ్డి(Raghuveera Reddy),శైలజానాథ్(Sailajanath)...ఏర్పాట్లను ఘనంగా నిర్వహిస్తున్నారు. పదేళ్లపాటు పిలచి టిక్కెట్ ఇస్తామని బ్రతిమాలినా ముందుకు రాని నేతలు....షర్మిల రాకతో పార్టీ టిక్కెట్ల కోసం ఎవరి ప్రయత్నాలు వారు ఉన్నారు. వైసీపీలో టిక్కెట్లు రాని వారు...సీఎం జగన్(Jagan) పై గుర్రుగా ఉన్నా తెలుగుదేశం(Tdp)లోకి వెళ్లలేని వారికి కాంగ్రెస్ మంచి ప్రత్యామ్నాయ వేదిక.అలాంటి అసంతృప్తి నేతలంతా ఇప్పుడు కాంగ్రెస్ నేతలతో టచ్ లోకి వచ్చారు.
సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి పోటీకి సై
ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా వైసిపి అధిష్టానం నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు లేవని ఇప్పటికే స్పష్టం చేసింది. వీరిలో సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి(Jonnalagadda Padmavathi), రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి(kaapu Ramachandra Reddy), కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి ఉన్నారు. ముఖ్యంగా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వైసీపీలో టికెట్ కేటాయించకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై వైసీపీకి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం కాపు రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలుస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి(Sidha Reddy) కాంగ్రెస్ నుంచి పోటీ పోటీ చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి సైతం హస్తం గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. అదే బాటలో సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సైతం షర్మిలకు ఆపన్న హస్తం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మారిన రాజకీయ పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా షర్మిలకు కలిసొచ్చేలా ఉన్నాయి. వైసీపీ, తెలుగుదేశం నుంచి టిక్కెట్లు రాని నేతలంతా కాంగ్రెస్ కు క్యూ కట్టే అవకాశం ఉంది.