Elections 2024 :  వైసీపీ ఫైర్ బ్రాండ్  లీడర్ రోజా పోటీ చేస్తున్న నగరి నియోజకవర్గంలో ఆ పార్టీకి పెద్ద షాక్ తగిలిదింది. నగరి నియోజకవర్గంలోని ఐదుమండలాల వైసిపి ఇన్చార్జ్  లు పార్టీకి రాజీనామా చేశారు.  రోజాకు సీటు కేటాయించడాన్ని నిరసిస్తూ వైసిపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తిరుపతి లో శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వీరిలో మాజీ శ్రీశైలం పాలకమండలి ఛైర్మన్  రెడ్డి వారి చక్రపాణి రెడ్డి కూడా ఉన్నారు. పార్టీ కోసం ఎంతో కష్టపడి చేశామని..  పార్టీకి పనిచేసిన వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లోను రోజా బి.ఫాంలు కూడా ఇవ్వలేదన్నారు. 


వైసీపీ కార్యకర్తలను రోజా హింసించారని రెడ్డి వారి చక్రపాణి రెడ్డి ఆరోపించారు. ఐదుగురం ఇంచార్జులం త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరుతామని ప్రకటించారు.  రోజాలో మార్పు ఏ మాత్రం రాలేదని.  పార్టీ కోసం తాము కష్టపడినా రోజాకు సిఎం ప్రాధాన్యత ఇచ్చారని లక్ష్మిపతి రాజు అనే ఎంపీటీసీ ఆవేదన వ్యక్తం చేశారు.  అభ్యర్థిని మార్చమని పదే పదే చెప్పినా ఉపయోగం లేకుండా పోయిందన్నారు. ఇటీవల జడ్పీటీసీ మురళీధర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తనను  పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.  ఎపిఐఐసి భూముల్లో అవినీతిపై విచారణ జరిపించాలన్నారు. 


వడమాలపేట టోల్ గేట్ వద్ద స్థలాలను రోజా కబ్జా చేయడాన్ని తాను ప్రశ్నించానని అందుకే పార్టీ నుంచి సస్పెండ్ చేశారని మురళీధర్ రెడ్డి ఆరోపించారు.  సిఎం రిలీఫ్ ఫండ్‌లో కూడా  మంత్రి కమిషన్లు దండుకున్నారని విమర్శించారు.  రోజా అవినీతిపై కాణిపాకంలో ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.  నగరి రోజాకు ఒక పెద్ద చంద్రముఖి ..రోజాను నగరి నుంచి తరిమికొట్టాలని పిలుపునచ్చారు.  రోజాను నగరి నుంచి తరిమేయకుంటే ప్రజలు ప్రశాంతంగా బతికే అవకాశం లేదని..  అందరి ఆస్తులను రోజా కాజేస్తుందని ఆరోపించారు. 


రోజా నగరి నుంచి వరుసగా రెండు సార్లు గెలిచారు. ఓ సారి వెయ్యి లోపు, మరోసారి రెండు వేల లోపు ఓట్ల తేడాతోనే గెలిచారు. పార్టీ నేతలందరూ కలసి కట్టుగా పని చేయడంతోనే ఈ విజయం సాధ్యమయింది. అయితే రెండో సారి గెలిచిన తర్వాత ఆమెతో పార్టీ నేతలకు వివాదాలం ప్రారంభమయ్యాయి. వైసీపీకి చెందిన ముఖ్యమైన ద్వితీయ శ్రేణి నేతలందరూ ఆమెను వ్యతిరేకిస్తున్నారు. ఏ కార్యక్రమంలోనూ రోజాతో కలిసి పని చేయరు. ఎన్నికల సమయంలో ఈ అసంతృప్త నేతలందర్నీ సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ ఆఫీసుకు పిలిపించుకుని మాట్లాడారు. అన్నీ సర్దుబాటు చేస్తాం.. రోజాను మరోసారి గెలిపించాలని చెప్పి పంపించారు. అయిేత ఎన్నికల ప్రచారంలో రోజా కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేయకపోవడంతో రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. వీరి రాజీనామాతో  రోజా గెలుపు క్లిష్టంగా మారుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.