Telangana Panchayat Elections 2025: తెలంగాణలో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఒకట్రెండు ఘర్షణలు మినహా ప్రశాంతంగా ముగిసిందది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంటతో ముగిసింది. ఓటు వేసేందుకు ఉదయం ఆరు గంటల నుంచి పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరారు. హైదరాబాద్‌సహా వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన ప్రజలంతా ఓట్ల కోసం గ్రామాల బాటపట్టారు. అంతా ఓట్లు వేశారు. ఒంటి గంట వరకు వచ్చి క్యూలైన్‌లో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు ఎన్నికల అధికారులు.
పంచాయతీ పోలింగ్ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడింది. కాంగ్రెస్-బీజేపీ, కాంగ్రెస్- బీఆర్‌ఎస్ నేతలమధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని ఉరుమడ్ల పంచాయతీలో అమిత్‌రెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి మధ్య మాటల ఘర్షణ జరిగింది. సకాలంలో స్పందించిన పోలీసులు ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. అదే జిల్లాలోని కేతేపల్లి మండలం కొర్లపహాడ్‌లో రెండు వర్గాలు పరస్పర దాడుల దిగాయి. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కుప్పగండ్ల బ్యాలెట్ పేపర్‌లో వార్డు సభ్యుడి గుర్తు లేకపోవడతో గందరగోళం ఏర్పడింది. అధికారులు స్పందించి వేరే బ్యాలెట్ పేపర్ తీసుకొచ్చి పోలింగ్ జరిగేలా చేశారు. ఖమ్మంలో కూడా పలు ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరిగాయి.
వివిధ ప్రాంతాల నుంచి ఓటర్లు వచ్చి ఓట్లు వేయడంతో ప్రజాస్వామ్య స్ఫూర్తిని నింపారు. మరికొన్ని చోట్ల నడవ లేని స్థితిలో ఉన్న వృద్ధులను కూడా తీసుకొచ్చి ఓట్లు వేయించారు. అంబులెన్స్, వీల్‌చైర్‌లలో వచ్చిన దృశ్యాలు కూడా కనిపించాయి. యువత ఎక్కువగా పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరిన విషయం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 3,834 సర్పంచి పదవులకు, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు ఇప్పుడు పోలింగ్ జరిగింది. 37,562 పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు ఓటు వేశారు.