Exit Polls On June 1 :   రాజకీయ పార్టీలన్నీ రెడీ అయిపోయాయి. చివరి విడత పోలింగ్ ఒకటో తేదీన జరగనుంది. పోలింగ్ గడువు ముగిసిన అరగంట తర్వాత ఎగ్జిట్ పోల్స్ ప్రకటించడానికి అవకాశం ఉంది. అన్ని ప్రముఖ సంస్థలు అప్పుడే తమ ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించనున్నాయి. ఇందు కోసం రాజకీయ పార్టీలతో పాటు సాధారణ ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 


ఎన్నికల ఫలితాలను ముందుగా తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రజలకు ఉంటుంది. అందుకే పోల్ స్ట్రాటజీల కోసం ఇప్పుడు ప్రత్యేక కంపెనీలు పుట్టుకు వచ్చాయి. వారు సర్వేలు చేసి.. ఎగ్జిట్ పోల్స్ నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తున్నారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ వెల్లడించకూదు. చివరి విడత పోలింగ్ అయిపోయిన తర్వాత మాత్రమే ప్రకటించాలి. అందుకే జూన్ ఒకటో తేదీన ఎగ్జిట్ పోల్ అంచనాలను వెల్లడిస్తారు. 


సాధారణంగా  పోలింగ్  ముందు నిర్వహించే అభిప్రాయసేకరణ ద్వారా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ , మూడ్ ఆఫ్ ది నేషన్ వంటి పేర్లతో తమ అంచనాలను పోల్ స్ట్రాటజీ సంస్థలు వెల్లడిస్తాయి. కానీ ఓటింగ్ అయిపోయిన తర్వాత పోలింగ్ సరళని విశ్లేషించి.. ఓట్లేసిన వారి అభిప్రాయాన్ని తెలుసుకుని ప్రకటించే అంచనాలే ఎగ్జిట్ పోల్స్.                    


ఎగ్జిట్ పోల్స్ ను చాలా సంస్థలు ప్రకటిస్తాయి కానీ.. వాటిలో అత్యంత విశ్వసమైనవి అతి తక్కువగా ఉన్నాయి. చాలా సంస్థలు ఫీల్డ్ వర్క్ చేయకుండానే అంచనాలను ప్రకటిస్తూ ఉంటాయి. కానీ విస్తృతమైన నెట్ వర్క్ ఏర్పాటు చేసుకుని ప్రజానాడిని పట్టుకునే సంస్థలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిలో సీఓటర్ సంస్థ ఒకటి. ఏబీపీ గ్రూప్ తో కలిసి సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించనుంది. తుది విడత పోలింగ్ ముగిసిన తర్వాత ప్రకటన ఉంటుంది.                


ఏబీపీ - సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ కు దేశవ్యాప్తంగా మంచి విశ్వసనీయత ఉంది. క్రమం తప్పకుండా ప్రకటించే ఫలితాల్లో 90 శాతానికిపైగా యాక్యురసీతో ఇస్తుంది ఏబీపీ - సీఓటర్. ఈ సారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కూడా దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అందుకే ఎగ్జిట్ పోల్స్ పై .. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది.                 


ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అన్నీ ఏకపక్షంగా ఇస్తే.. ఫలితాలు కూడా దాదాపుగా అంతే ఉంటాయని అనుకోవచ్చు. కొన్ని సంస్థలు..కొన్ని సంస్థలు ఇటూ ఇస్తే.. పోరు హోరాహోరీగా సాగిందని అనుకోవచ్చు. అయితే ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఫలితాలకు ఎంతో సమయం ఉండదు. కేవలం రెండు రోజులే. అందుకే రెండు రోజుల పాటు ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై చర్చలు జరుగుతాయి. నాలుగో తేదీ ఉదయం పది గంటల కల్లా దేశవ్యాప్త ట్రెండ్స్ తెలిసిపోతాయి.