Elections 2024 :  కౌంటింగ్ దగ్గర పడే కొద్దీ ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ పెరిగిపోతోంది. ఏ ఇద్దరి మధ్య లేదా.. ఏ వాట్సాప్ గ్రూపులో రాజకీయ చర్చ వచ్చినా చివరికి అది బెట్టింగ్ దగ్గరే ముగుస్తుంది. ఇది ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకూ అతీతం కాదు. ఎప్పుడూ లేని విధంగా ఈ సారి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎన్నికలపై ఆసక్తితో ఉన్నారు. వారి వాట్సాప్  గ్రూపుల్లో  మూడు రాజకీయ చర్చలు .. ఆరు బెట్టింగులు అన్నట్లుగా యాక్టివ్ గా ఉంటున్నాయి. 


రేషియోలతో  సాగుతున్న బెట్టింగులు - వాట్సాప్ గ్రూపులు బిజీ                                    


ఆంధ్రప్రదేశ్ సచివాయ ఉద్యోగుల్లో ప్రభుత్వ మార్పుపై విస్తృత చర్చ జరుగుతోంది. అత్యధిక మంది ప్రభుత్వం మారుతుందని పందేలు కాస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వమే ఉంటుందని మరికొంత మంది బెట్లు వేస్తున్నారు. మొదట్లో వందకు వంద తరహాలో సాగిన పందేలు రాను రాను రేషియాల్లోకి మారాయి. ఇప్పుడు  1:2 అంతకు మించి అన్నట్లుగా రేషియోల్లో పందేలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ అధికార పార్టీ కి  మరో అవకాశం వస్తుందని గట్టిగా చెప్పలేకపోతున్నారు ఉద్యోగులు. 


ప్రభుత్వంపై  ఉద్యోగుల్లో వ్యతిరేకత సూచనలు - అధికార పార్టీకి వ్యతిరేకంగా ఎక్కువ బెట్టింగులు                                              


వస్తే వెయ్యి .. పోతే వంద అని లాటరీ వేసే వాళ్లు ఇప్పుడు ఎక్కువగా బెట్టింగులు కాస్తున్నట్లుగా ఓ ఉద్యోగి చెబుతున్నారు. ఒక్క సెక్రటేరియట్ మాత్రమే కాకుండా.. అన్ని  ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఇదే ట్రెండ్ నడుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు సహజంగానే ప్రభుత్వ మార్పు కోసం చూస్తున్నారన్న ప్రచారం ఉంది. గత ఐదేళ్ల కాలంలో పీఆర్సీ పేరుతో మోసం చేశారని..డీఎలను కూడా ఇవ్వకుండా .. సర్దుబాటు చేశారని.. దీని వల్ల ప్రతి ఉద్యోగి లక్షల్లో నష్టపోయారని అంటున్నారు. ఈ సారి కూడా ఇదే ప్రభుత్వం కొనసాగితే పీఆర్సీ కాదు కదా.. కనీసం డీఏలు కూడా ఇవ్వరని అనుకుంటున్నారు. అందుకే వీరిలో ఎక్కువ మంది ప్రభుత్వం మారాలని కోరుకుంటున్నారు. 


మధ్యవర్తి ద్వారా పందేలు                


ఉద్యోగుల మధ్య జరుగుతున్న బెట్టింగుల్లో ఈ ట్రెండ్ కనిపిస్తోంది. అయితే కొంత మంది ఉద్యోగులు వివిధ కారణాలతో ఇదే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. వస్తుందని ఆశపడుతున్నారు. వారిలో కూడా చాలా మంది బెట్టింగులు పెట్టేందుకు ఆసక్తి చూపించడం లేదు. అత్యధిక రేషియో ఆఫర్ చేస్తే.. కొంత మంది  బెట్టింగ్‌లకు వస్తున్నారని అంటున్నారు. ఉద్యోగులే తమలో తాము ఓ మధ్యవర్తిని ఎంపిక చేసుకుని వారి వద్ద నగదు ఉంచుతున్నారు. ఫలితాలను బట్టి  ఆ వ్యక్తి కమిషన్ తీసుకుని పలితాల తర్వాత డబ్బులు పంపిణీ చేస్తారు.