2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ 5000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని ఆరోపించారు ఈటల రాజేందర్. మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండల కేంద్రంలో మాట్లాడిన ఈటల.. టీఆర్‌ఎస్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు.
2006లో కరీంనగర్‌లో జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్కో మండలానికి ఒక్కో మంత్రిని వేసి, డబ్బు సంచులతో నాయకులను కార్యకర్తలను కొన్నారని గుర్తు చేశారు. ఆనాడు డబ్బుల్లేని కెసిఆర్... మన సొమ్మే తీసుకునేంత తీసుకోండి, వేసుకొనే దిక్కు వేయండి అని ప్రోత్సహించారన్నారు. 2004 నుంచి 2014 వరకు తెలంగాణ నినాదంతో గెలిసినం తప్ప డబ్బులు పెట్టలేదని గుర్తు చేశారు ఈటల.
2014 తరువాత మొదటసారిగా వరంగల్ ఉపఎన్నికలో డబ్బులు ఖర్చు పెట్టినట్టు తెలిపారు ఈటల. నారాయణ్ ఖేడ్ నుంచి హుజూరాబాద్ వరకు డబ్బులతోనే కేసీఆర్ ఎన్నికల్లో కొట్లడారన్నారు. పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడ డబ్బులు ఇచ్చి గెలిచారని విమర్శించారు. ఆనాడు ఆంధ్ర నాయకులు మన పొట్టగొట్టి సంపాదించారు తీసుకోండి అని చెప్పిన కేసీఆర్‌కు ఇప్పుడు ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.
బీ ఫామ్ తాను ఇస్తాను.. డబ్బులు కూడా తానే ఇస్తానని 2018లో అందరికీ చెప్పిన కేసీఆర్.... గెలవండి బానిసలుగా ఉండండి అని చెప్పిన అహంకారాన్ని చాటారని ధ్వజమెత్తారు హుజూరాబాద్ ఎమ్మెల్యే. పరకాల, వరంగల్ బై ఎలక్షన్, ఎమ్మెల్సీ, జీహెచ్‌ఎంసీ అన్ని ఎన్నికలకి డబ్బులు ఖర్చు పెట్టినట్టు తానే సాక్ష్యమన్ననారు ఈటల. 2014 నుంచి ఇప్పటివరకు దాదాపు
5000 కోట్ల రూపాయలు ఎన్నికల కోసం ఖర్చు పెట్టారని ఆరోపించారు.
టీఆర్‌ఎస్ తీసి బీఆర్‌ఎస్ పెట్టి ఏం చెప్తారు
గుడిసెలో ఉండే వాడికి బంగ్లాలో ఉండే వాడికి ఒకే ఓటు అంబేడ్కర్ ఇచ్చారని... ఆత్మ గౌరవ ప్రతీకగా ఉండే ఓటుకు, ఆ మనిషికి వెలకట్టిన నీచపు చరిత్ర కెసిఆర్‌ది అని ఈటల ధ్వజమెత్తారు. ఆ చరిత్రను బీఆర్‌ఎస్ పెట్టి దేశానికి అందిస్తావా అని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు ఏనాడూ పాటించని వ్యక్తి కెసిఆర్ అని విమర్శించారు. తెలంగాణ ప్రజల నుంచి దోచుకున్న సొమ్ము పక్క రాష్ట్రాలకు పంపుతున్నారన్నారు. కర్ణాటకకు పంపిన నాడు తానే ప్రత్యక్ష సాక్షి అని తెలిపారు.
పార్టీ ఖాతాలో 870 కోట్లు ఉన్నాయని సగర్వంగా చెప్పిన కేసీఆర్... ఆ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందని ఈటల ప్రశ్నించారు. ఒకప్పుడు కేసీఆర్‌కు ఎన్ని ఎకరాలు ఉండేదని నేడు ఎన్ని ఎకరాలు ఉందో చెప్పాలన్నారు. కేసీఆర్‌కు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తెలంగాణ ప్రజలు ఆలోచించాలని పిలుపునిచ్చారు. ఆంధ్రా ఎన్నికల్లో 5 కోట్లు పెడుతున్నారు అని తామంతా నోరెళ్లబెట్టేవాళ్లమని ఇప్పుడు ఇక్కడా అదే పరిస్థితి వచ్చిందన్నారు. కేసీఆర్‌కు సొంత విమానం కొనడానికి వందలంకొట్లు ఎక్కడ నుంచి వచ్చాయో సమాధానం చెప్పాలన్నారు.
ఫార్మా కంపెనీలు, కాంట్రాక్టర్స్ ఎందుకు ఇంత డబ్బు ఇస్తున్నారని... వాళ్లకు ఏ లాభం చేకూర్చకుండా ఎందుకు ఇస్తారని ఈటల ప్రశ్నించారు. ఆ డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందో సమాధానం చెప్పాలన్నారు. ధరణీ తెచ్చి భూములను కెసిఆర్ కుటుంబం కబ్జా పెడుతున్నారని ఆరోపించారు. దేవాలయాల, వక్ఫ్,అసైన్మెంట్ ఆన్ ఐడెంటిఫికేషన్ భూములు వేల ఎకరాలు కబ్జా పెట్టారన్నారు.
24 లక్షల మంది రైతులు గగ్గోలు పెడితే 6 లక్షలే పరిష్కారం అయ్యాయన్నారు. ఇంకా 18 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్టు ఈటల తెలిపారు. హైటెక్ సిటీ దగ్గర 2000 ఎకరాలు మాయం చేసి లక్ష కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు. బినామీల పేరిట రాసుకుంటున్నారన్నారు.
హైదరాబాద్‌లో నాగార్జున సర్కిల్ నుంచి కేబీఆర్‌పార్క్ వరకు కుడి వైపు ఉన్న భూములు అన్నీ ఖాళీగా ఉండేవని లిటిగేషన్ ఉన్న భూములు క్లియర్ చేసి కెసిఆర్ డబ్బులు దండుకున్నారన్నారు ఈటల. వేల ఎకరాలు జోన్ మార్చి 10శాతం భూమి,
పార్టీ బిలో చేర్చి 30శాతం వాటా తీసుకొని క్లియర్ చేస్తున్నారన్నారు. సీఎం ఆఫీస్‌లో ఉన్న రాజ్యసభ సభ్యుడు సీఎంకి చెప్తే సీఎం సీఎస్‌కి చెప్తే, సీఎస్ కలెక్టర్‌కి చెప్తే వెంటనే ఆ భూమి క్లియర్ అవుతుందన్నారు. ఈ తతంగమంతా చిన్న ఉద్యోగులకు తెలవద్దు అని వారిని తొలగించారన్నారు.
హైదరాబాద్ చుట్టూ ఉన్న కలెక్టర్లకు కలెక్షన్‌కి కెసిఆర్ టార్గెట్ పెట్టారని ఆరోపించారు ఈటల. ఆ దుర్మార్గపు సంపాదనతో మునుగోడుకి వస్తున్నారన్నారు. నిజంగా గొప్ప నాయకులు అయితే... ఓట్ల కోసం ఇంత మంది ఇక్కడికి ఎందుకు రావాలని ప్రశ్నించారు. మంత్రులు సచివాలయంలో ఉండాలి కానీ ఎమ్మెల్యేల, మంత్రులు ఊళ్లలోకి వెళ్లి మందు పోస్తున్నారని ఎద్దేవా చేశారు. తాగితే తప్పు ఏంటి ఒక మంత్రి అడుగుతున్నారని... ప్రజలకు ఏ నేర్పిస్తున్నారని ప్రశ్నించారు. తాగించి మహిళల కొంపలు ముంచుతారా అని నిలదీశారు. ఇదేనా బీఆర్‌ఎస్‌తో దేశానికి నేర్పించేది అని అన్నారు.
వాళ్లు ఇచ్చే డబ్బులు, అభివృద్ధి పనులు చేయించుకోండి కానీ... ధర్మం, న్యాయం, ప్రజాస్వామ్యం గెలిపించండని మునుగోడు ప్రజలను కోరారు ఈటల. ఇక్కడ సిద్ధాంతాల మధ్య పోరాటం కాదని... కెసిఆర్ అహంకారానికి... తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవానికి మధ్య పోరాటమన్నారు. పోలింగ్ బూత్‌లో పని చేసే పంతులు, పోలీస్, రెవెన్యూ ఉద్యోగి అందరూ మనుషులు మాత్రమే అక్కడ ఉన్నారని... మనసు మాత్రం బీజేపీతో ఉందన్నారు. మునుగోడులో బీజేపీ విజయం ఖాయమని.. ప్రజలెవరూ భయపడాల్సిన పని లేదని... లక్షల మంది మద్దతుగా వస్తున్నారన్నారు.