Election Commission Comments On Reserving For Glass Symbol To Janasena: జనసేన (Janasena) పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేయాలన్న విజ్ఞప్తిని ఎన్నికల సంఘం (Election Commission) తోసిపుచ్చింది. ఈ మేరకు గురువారం హైకోర్టుకు వివరణ ఇచ్చింది. ఇప్పటికే అభ్యర్థులకు కేటాయించిన సింబల్ మార్చలేమని తెలిపింది. గాజు గ్లాస్ గుర్తుపై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో టీడీపీ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేయగా.. దీనికి విచారణ అర్హత లేదని పేర్కొంది. ఇలా చేస్తే ఎన్నికలు జరిగే వరకూ పిటిషన్లు వస్తూనే ఉంటాయని వెల్లడించింది. జనసేన పిటిషన్ పై బుధవారం ఎన్నికల సంఘం కొన్ని నిర్ణయాలు వెలువరించింది. ఈ క్రమంలో పిటిషన్ పై తదుపరి విచారణను ఈ నెల 3 (శుక్రవారం)కు వాయిదా వేసింది.
ఈసీ ఏం చెప్పిందంటే.?
స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించడంపై జనసేన హైకోర్టును (Ap Highcourt) ఆశ్రయించగా.. బుధవారం విచారణ సందర్భంగా ఎన్నికల సంఘం హైకోర్టుకు ఈ అంశంపై వివరణ ఇచ్చింది. జనసేన (Janasena) పార్టీ పోటీ చేసే ఎంపీ స్థానాలు, అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ ఇతరులకు ఆ గుర్తు కేటాయించబోమని స్పష్టం చేసింది. 21 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఉన్న పార్లమెంట్ స్థానాల్లో గాజు గ్లాస్ గుర్తును ఎంపీ అభ్యర్థులకు ఇవ్వబోమని తెలిపింది. అలాగే, జనసేన పోటీ చేస్తోన్న 2 పార్లమెంట్ స్థానాల పరిధిలో పోటీ చేస్తోన్నఅసెంబ్లీ స్థానాల్లోనూ స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించమని కోర్టుకు నివేదించింది. గుర్తింపు పొందని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు ఇలా చేస్తామని ఈసీ పేర్కొంది. దీంతో.. జనసేనకు ఇబ్బందులు తొలగుతాయని అభిప్రాయపడింది. ఎన్నికల సంఘం ఇచ్చిన వివరాలను నమోదు చేసిన హైకోర్టు విచారణను ముగిస్తున్నట్లు ప్రకటించింది.
టీడీపీ పిటిషన్
అయితే, తాము పోటీ చేసే స్థానాల్లో మాత్రమే కాకుండా మిగతా ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో కూడా గాజు గ్లాస్ గుర్తును వేరే వారికి కేటాయించవద్దని జనసేన ఉన్నత న్యాయస్థానాన్ని కోరింది. కానీ, గాజు గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్ లో ఈసీ పెట్టిన నేపథ్యంలో అలా అన్ని చోట్ల ఇవ్వడం ఎలా సాధ్యమని న్యాయస్థానం ప్రశ్నించింది. ఈసీ నివేదిక మేరకు జనసేన పిటిషన్ ను డిస్పోజ్ చేసింది. ఎన్నికల కమిషన్ నిర్ణయంపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే వేరే పిటిషన్ వేసుకోవాలని సూచించింది. ఈ క్రమంలో జనసేనకు గాజు గ్లాస్ గుర్తు విషయంలో గందరగోళంపై టీడీపీ మరో పిటిషన్ వేసింది. గాజు గ్లాస్ గుర్తును మిగిలిన స్థానాల్లోనూ వేరే అభ్యర్థులకు కేటాయించకుండా చూడాలని కోరింది. దీనిపై విచారణ సందర్భంగా అలా రిజర్వ్ చేయలేమని ఎన్నికల సంఘం కోర్టుకు తెలిపింది. కాగా, గాజు గ్లాస్ గుర్తును ఈసీ ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చడంతో జనసేనకు కొత్త ఇబ్బందులు తెచ్చిపెట్టింది. దీనిపై కోర్టులో పిటిషన్ వేసినా ఆ పార్టీకి ఊరట లభించలేదు.
Also Read: Ys Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల మరో లేఖ - 'నవ సందేహాల' పేరుతో ప్రశ్నాస్త్రాలు