Election Commission Extends Polling Time In Telangana: తెలంగాణలో లోక్ సభ ఎన్నికల (Telangana Loksabha Elections) పోలింగ్ సమయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) పొడిగించింది. వేసవి తీవ్రత దృష్ట్యా ఇతర రాష్ట్రాల మాదిరిగానే పోలింగ్ సమయాన్ని పెంచాలని రాజకీయ పార్టీల అభ్యర్థులు ఈసీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పోలింగ్ టైం గంట పాటు పొడిగించాలని నిర్ణయించింది. సాధారణంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ నిర్వహించనుండగా.. సాయంత్రం 6 వరకూ పోలింగ్ సాగనుంది. ఆ సమయంలోపు క్యూలైన్లలో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తారు. అయితే, నక్సల్స్ ప్రభావిత 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 4 గంటల వరకూ మాత్రమే పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో ఇప్పటికే 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ కు అనుమతిస్తే ఓటింగ్ పై ప్రభావం చూపే అవకాశం ఉందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణ ప్రాంతాల్లోనూ ఓటింగ్ అనుకున్నంత స్థాయిలో లేకపోవడంతో పోలింగ్ సమయాన్ని పెంచాలని ఎన్నికల సంఘానికి వినతులు అందాయి. అన్ని రాష్ట్రాల్లోనూ గంట పాటు సమయం పెంచినందున తెలంగాణలో పోలింగ్ టైం గంట పాటు పెంచేందుకు సీఈసీ అనుమతిచ్చింది. కాగా, రాష్ట్రంలో ఈ నెల 13న పోలింగ్ ప్రక్రియ సాగనుంది.
ఇక్కడ సాయంత్రం 4 వరకే పోలింగ్
అసెంబ్లీ నియోజకవర్గం | లోక్ సభ నియోజకవర్గ పరిధి |
సిర్పూర్ | ఆదిలాబాద్ |
ఆసిఫాబాద్ | ఆదిలాబాద్ |
బెల్లంపల్లి | పెద్దపల్లి |
చెన్నూరు | పెద్దపల్లి |
మంచిర్యాల | పెద్దపల్లి |
మంథని | పెద్దపల్లి |
భూపాలపల్లి | వరంగల్ |
ములుగు | మహబూబాబాద్ |
భద్రాచలం | మహబూబాబాద్ |
పినపాక | మహబూబాబాద్ |
ఇల్లందు | మహబూబాబాద్ |
కొత్తగూడెం | ఖమ్మం |
అశ్వారావుపేట | ఖమ్మం |