Election Commission Of India Appointed Three Officers: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission Of India) ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించింది. సాధారణ ఎన్నికల అబ్జర్వర్ గా రామ్ మోహన్ మిశ్రా, స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ గా రిటైర్డ్ ఐపీఎస్ దీపక్ మిశ్రా, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి నీనా నిగమ్ ను ఎన్నికల వ్యయ పరిశీలకుడిగా నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రామ్మోహన్ మిశ్రా 1987వ బ్యాచ్ కు చెందిన అధికారి కాగా.. దీపక్ మిశ్రా 1984 బ్యాచ్, నీనా నిగమ్ 1983 బ్యాచ్ కు చెందిన అధికారులు. ఈ ముగ్గురు అధికారులు వచ్చే వారం ఏపీలో పర్యటించనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో ఏర్పాట్లను వీరు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ మార్గదర్శకాలను పటిష్టంగా అమలు జరిగేలా చర్యలు చేపట్టనున్నారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాలతో పాటు ఓటర్లను ఆకర్షించే గిఫ్ట్స్, తాయిలాల నియంత్రణపై వీరు దృష్టి సారిస్తారు. ఎపీలో ఎక్కడెక్కడ పొరపాట్లు జరుగుతున్నాయనే అంశాలపై వీరు కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించనున్నారు.


'అనుమతి తప్పనిసరి'


అటు, ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాజకీయ పార్టీలకు చెందిన నేతల వ్యవహారశైలి, ప్రచారం వంటి అంశాలపై ఈసీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే రాజకీయ పార్టీల ప్రచారానికి సంబంధించి అనేక నిబంధనలు విధించిన ఎన్నికల కమిషన్‌.. తాజాగా ఇంటింటి ప్రచారానికి సంబంధించి కొన్ని షరతులను విధించింది. ఈ మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సచివాలయంలోని ఈసీ కార్యాలయంలో సీఈవో ముఖేష్ కుమార్ మీనా ఇటీవల సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిబంధనలు, ప్రచార అనుమతులకు సంబంధించి కీలక సూచనలు చేశారు. సభలు, సమావేశాలు, ఎన్నికల ప్రచార కార్యక్రమాల అనుమతులకు రాజకీయ పార్టీలు 'suvidha.eci.gov.in' పోర్టల్‌ వినియోగించాలని సూచించారు. ఇంటింటి ప్రచారం, సభలు, సమావేశాలు, ర్యాలీల నిర్వహణకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. 


'అవగాహన తప్పనిసరి'


రాజకీయ పార్టీల నాయకులు సభలు, ర్యాలీలు, ఇతర ప్రచారానికి సంబంధించి 48 గంటలు ముందుగానే సువిధ యాప్‌, పోర్టల్‌ నుంచి సంబంధిత రిటర్నింగ్‌ అధికారికి దరఖాస్తు చేసుకోవాలని సీఈవో సూచించారు. దరఖాస్తు చేసిన 24 గంటల్లోగా ప్రచారానికి సంబంధించిన అన్ని అనుమతులు జారీ అవుతాయని స్పష్టం చేశారు. ఆన్‌లైన్‌ నామినేషన్లు, అఫిడవిట్‌ దాఖలు, సభలు, సమావేశాలు, ర్యాలీలు, ప్రచార కార్యక్రమాలు కోసమే ప్రత్యేకంగా పోర్టల్‌ను రూపొందించినట్టు వివరించారు. ఎన్నికల కోడ్‌ దృష్ట్యా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు అనుసరించాల్సిన విధి విధానాలు, తీసుకోవాల్సిన అనుమతులపైనా అవగాహన ఉండాలని వెల్లడించారు. కోడ్ అమల్లో భాగంగా నేతల కదలికలను ఈసీ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఈసీ సూచన మేరకు పోలీసులు ప్రధాన నగరాల్లో క్షేత్రస్థాయిలో కవాతు నిర్వహిస్తూ.. కోడ్, నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నారు. అటు, రాజకీయ నేతల వాహనాలను సైతం క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.


Also Read: Election Staff Remuneration: ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?