Varun Gandhi wrote an open letter to the people of Philibith :  పిలిభిత్‌ ఎంపీ వ‌రుణ్ గాంధీకి రానున్న‌ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ టికెట్ నిరాక‌రించింది. పిలిభిత్‌ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి వ‌రుణ్ గాంధీ లేఖ రాశారు. ఫిలిబిత్‌తో త‌న సంబంధం రాజ‌కీయాల‌కు అతీత‌మైంద‌ని, పిలిభిత్ బిడ్డ‌నైన తాను ప్ర‌జ‌ల కోసం ఎంత‌టి మూల్యాన్ని చెల్లించేందుకూ సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. సామాన్యుడి గొంతు వినిపించేందుకే తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని, ప్ర‌జ‌ల కోసం త‌న ఇంటి త‌లుపులు ఎప్పుడూ తెరిచేఉంటాయ‌ని స్ప‌ష్టం చేశారు. ఇవాళ తాను ప్ర‌జ‌ల కోసం చేసే ప‌నుల‌ను కొన‌సాగించేందుకు వారి ఆశీస్సులు కోరుతున్నాన‌ని అన్నారు. 1983లో మూడేండ్ల వ‌య‌సులో తాను త‌ల్లి వేలు ప‌ట్టుకుని పిలిభిత్  గ‌డ్డ‌పై అడుగుపెట్టాన‌ని, ఇప్పుడు ఇదే త‌న కార్య‌స్ధ‌ల‌మైంద‌ని, ఇక్క‌డి ప్ర‌జ‌లు త‌న కుటుంబంలో భాగ‌మ‌య్యార‌ని, ఈ విష‌యాల‌న్నీ త‌న‌కు గుర్తుకువ‌స్తున్నాయ‌ని లేఖ‌లో పేర్కొన్నారు.                       


మీ ప్ర‌తినిధిగా లోక్‌స‌భ కు ప్రాతినిధ్యం వ‌హించ‌డం త‌న జీవితంలో పొందిన అత్యున్న‌త గౌర‌వ‌మ‌ని అన్నారు. ఎంపీగా త‌న ప‌ద‌వీ కాలం ముగియ‌నున్నా, పిలిభిత్ ప్ర‌జ‌ల‌తో త‌న అనుబంధం తుదిశ్వాస వ‌ర‌కూ కొన‌సాగుతుంద‌ని పేర్కొన్నారు. ఎంపీగా కాకున్నా ఈ ప్రాంత ప్ర‌జ‌ల కోసం తాను జీవితాంతం ప‌నిచేస్తూనే ఉంటాన‌ని, మీ కోసం త‌న ఇంటి త‌లుపులు గ‌తంలో మాదిరిగా ఎప్పుడూ తెరిచేఉంటాయ‌ని అన్నారు.                                       


2009 లోక్‌సభ ఎన్నికల్లో వరుణ్ గాంధీ తొలిసారిగా పిలిభిత్ నుంచి ఎంపీ అయ్యారు. 2014లో బీజేపీ ఆయనను సుల్తాన్‌పూర్ నుంచి బరిలోకి దిపింది. అక్కడ ఆయన గెలుపొందారు. మళ్లీ 2019లో మళ్లీ పిలిభిత్ స్థానం నుంచి పోటీ చేసి మళ్లీ ఎంపీగా విజయం సాధించారు. వరుణ్‌ గాంధీ ఇటీవల గతంలో ఎన్నడూ లేనివిధంగా సొంత ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు లేవనెత్తారు. ఈ మధ్య విమర్శలు తగ్గించారు. ఈ క్రమంలో బీజేపీ టికెట్‌ ఇస్తుందా? లేదా ? అనే ఊహాగానాలున్నాయి. చివరకు అనుకున్నట్లుగానే కాషాయ పార్టీ వరుణ్‌ గాంధీకి టికెట్‌ నిరాకరిస్తూ జితిన్‌ ప్రసాద వైపు మొగ్గు చూపుతూ టికెట్‌ ఇచ్చింది.               
 
వ‌రుణ్ గాంధీని కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్నామ‌ని ఆ పార్టీ నేత అహిర్ రంజ‌న్ చౌధ‌రి సిట్టింగ్ ఎంపీని స్వాగ‌తించారు. ప్రస్తుతం వరుణ్‌ గాంధీ ఏం నిర్ణయం తీసుకుంటారనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా? లేదంటే ఎన్నికలకు దూరంగా ఉంటారా? అనే ఆస్తకికరంగా మారింది. ఇక జితిన్‌ ప్రసాద్‌ 2004 లోక్‌సభ ఎన్నికల్లో షాజహాన్‌పూర్‌ నుంచి కాంగ్రెస్‌ టికెట్‌పై గెలుపొందారు. 2009 ఎన్నికల్లో ధౌరహర స్థానం నుంచి విజయం సాధించి కేంద్రమంత్రిగా పని చేశారు. 2021లో ఆయన కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు.