Buy Rating For Reliance Shares: దేశంలోని అతి పెద్ద లిస్టెడ్‌ కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు కొన్ని రోజులుగా స్పీడ్‌ ట్రాక్‌ మీద ఉన్నాయి. నిన్నటి (బుధవారం, 27 మార్చి 2024) సెషన్‌లో అద్భుతంగా రాణించాయి, ఈ రోజు కూడా గ్రీన్‌ జోన్‌లో కదులుతున్నాయి. ఈ పెరుగుదలకు కారణం విదేశీ బ్రోకరేజ్ హౌస్ గోల్డ్‌మన్ సాక్స్ ఈక్విటీ రీసెర్చ్ రిలీజ్‌ చేసిన నివేదిక. 


రిలయన్స్ స్టాక్‌ బుల్ కేసులో 54%, బేస్ కేసులో 17.9% పెరుగుతుందని బ్రోకరేజ్ హౌస్ అంచనా వేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లను కొనుగోలు చేయాలని ఇన్వెస్టర్లకు సలహా ఇస్తూనే.. రానున్న 12 నెలల్లో రూ. 3400 స్థాయిని అవి తాకవచ్చని గోల్డ్‌మన్ శాక్స్ తన నివేదికలో వెల్లడించింది. 


టెలికాం, రిటైల్ వ్యాపారాల లిస్టింగ్‌ ద్వారా వాల్యూ అన్‌లాక్
జియో, రిలయన్స్ రిటైల్ వంటి కొత్త వ్యాపారాల్లో వాటాలను విక్రయించడం ద్వారా.. రాబడిలో పెరుగుదల & విలువలో మెరుగుదల సాధ్యమవుతుందని, ఈ రెండు విషయాల కారణంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ మార్కెట్‌ను ఔట్‌పెర్ఫార్మ్‌ చేస్తుందని గోల్డ్‌మన్ సాచ్స్ వివరించింది. ఆ నివేదిక ప్రకారం, రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ పనితీరు తక్కువగా ఉన్న కారణంగా గత రెండేళ్లుగా ఈ రెండు డ్రైవర్స్‌ నెమ్మదించాయి. రాబోయే రోజుల్లో, వినియోగదార్ల వ్యాపారం లిస్టింగ్‌తో రాబడి పెరిగి, విలువను అన్‌లాక్ చేయడంలో సాయపడుతుందని అంచనా వేసింది.


రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్ల టార్గెట్‌ ధర (Target Price of Reliance Industries Shares)
రాబోయే 12 నెలల్లో, బేస్ కేసులో, రిలయన్స్‌ షేర్లు 17.9% ర్యాలీ చేస్తాయని చెప్పిన గోల్డ్‌మన్ సాచ్స్, దాని ప్రకారం టార్గెట్‌ ధరను రూ. 3,400 కు చేర్చింది. బుల్ కేసులో, వచ్చే 12 నెలల్లో రిలయన్స్ స్టాక్ 54% జంప్‌ చేస్తుందని వెల్లడించిన బ్రోకరేజ్‌, టార్గెట్‌ ధరను రూ. 4442 గా మార్చింది. ఈ స్టాక్‌కు "బయ్‌" రేటింగ్‌ కొనసాగించింది.


జియో ఫైనాన్షియల్‌ డీమెర్జింగ్ తర్వాత పెరిగిన విలువ
గత సంవత్సరం, రిలయన్స్ గ్రూప్, తన ఫైనాన్స్ కంపెనీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి వేరు చేసింది, విడిగా స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్‌ చేసింది. రిలయన్స్ వాటాదార్లకు జియో ఫైనాన్షియల్ షేర్లు అందాయి. 2023 ఆగస్ట్ నెలలో లిస్ట్‌ అయినప్పటి నుంచి, జియో ఫైనాన్షియల్ షేర్లు పెట్టుబడిదార్లకు బలమైన రాబడిని అందించాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: ఏప్రిల్‌లో పెద్ద పండుగలు, నెలలో సగం రోజులు బ్యాంక్‌లు బంద్‌