Kotha Prabhakar Reddy wins in Dubbaka: కొనసాగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ లో ఒక్కొక్కరి భవితవ్యం తేలుతోంది. తాజాగా సిద్దిపేట జిల్లా దుబ్బాకను కారు పార్టీ కైవసం చేసుకుంది. ఇక్కడ కొత్త ప్రభాకర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి అయిన రఘునందన్ రావుపై భారీ మెజారిటీతో గెలుపొందారు. 14వ రౌండ్‌ ముగిసేసరికే బీఆర్‌ఎస్‌ 5253 ఓట్ల లీడింగ్‌లో కొనసాగింది. ఆ సమయానికి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌ రెడ్డి మొత్తం 44218 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు.


2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత దుబ్బాకలో ఉప ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణించడంతో ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలిచారు. ఆ సమయంలో బీజేపీ రాష్ట్రమంతా బాగా స్వింగ్ లో ఉండడంతో ఆయన గెలుపు సాధ్యం అయింది. బీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతా రెడ్డి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ఉప ఎన్నికలో 1500 ఓట్ల లోపు తేడాతోనే రఘునందన్ రావు మెజారిటీ సాధించారు. 


తాజాగా ప్రస్తుతం మెదక్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా దుబ్బాక నుంచి పోటీ చేసి గెలిచారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయనపై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఒక ఎంపీపై ఇలా కత్తిపోటుతో ఆగంతుకుడు దాడికి పాల్పడడం సంచలనం రేపింది. గాయాలతో ఆస్పత్రి పాలై కోలుకొని మళ్లీ ప్రచారంలో కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. బహుశా ఈ ఘటనతో ఆయనకు సానుభూతి వచ్చి ఉంటుందని కూడా కొందరు భావిస్తున్నారు.