Tdp Bjp Alliance :   ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు విస్తృతంగా జరుగుతున్న చర్చ పొత్తులు. ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ చేరుతుందంటూ ఢిల్లీ స్థాయి నుంచి ప్రచారం జరుగుతోంది. గతంలో చంద్రబాబునాయుడు మోదీని కలిశారని.. లోకేష్ అమిత్ షాను కలిశారని చెబుతున్నారు. ప్రధాని మోదీని ఓ సమావేశంలో చంద్రబాబు కలిసింది నిజమే కానీ రాజకీయాలు మాట్లాడారో లేదో స్పష్టత లేదు. అలాగే హోంమంత్రి అమిత్ షాను లోకేష్ కలిశారన్నది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. ఈ విషయాన్ని టీడీపీ ఖండించలేదు. బీజేపీ కూడా పట్టించుకోలేదు. అయితే ఈ అంశంపై టీడీపీలో కూడా చర్చ జరుగుతోంది. పొత్తులపై రెండు పార్టీల అగ్రనేతల మధ్య మాటలు జరుగుతున్నాయో లేదో కానీ టీడీపీ లీడర్స్, క్యాడర్స్‌లో మాత్రం జోరుగా చర్చ జరుగుతోంది. ఎక్కువ మంది పొత్తులెందుకన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 


పొత్తులపై సానుకూలంగా టీడీపీ నేతలు !


గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒంటరిగా వెళ్లి పరాజయం చవిచూసింది. టీడీపీ ఒంటరిగా గెలవలేదని  ఇతర పార్టీలు చేసిన విమర్శలు ఆ ఎన్నికలతో నిజం అయ్యాయి. అయితే తాము ఎంతో జన రంజక పాలన అందించామని భావించిన టీడీపీ నేతలు ఇంత దారుణమైన ఓటమి ఎదురవుతుందని ఊహించలేదు. పూర్తిగా కుల సమీకరణాలతోనే తాము ఓడిపోయామని నమ్ముతున్నారు. అందుకే ఈ సారి పొత్తుల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. బీజేపీ, జనసేనతో పొత్తు ఉండాలని కోరుకుంటున్నారు. జనసేనతో పొత్తు వల్ల చాలా నియోజకవర్గాల్లో ఏకపక్ష ఫలితం వస్తుందని అంటున్నారు. అదే సమయంలో బీజేపీతో పొత్తు వల్ల ఓటింగ్ పరంగా లాభం ఉండదు కానీ కేంద్రంలో ఉన్న  అధికార పార్టీ కావడంతో..  ఏపీ అధికార పార్టీ ఎన్నికల్లో అక్రమాలు చేయకుండా అడ్డుకోవచ్చని ఈ కారణంగా బీజేపీతో పొత్తు అవసరమని వారు వాదిస్తున్నారు. తమ అభిప్రాయాలను హైకమాండ్‌కు చెబుతున్నారు.  


పొత్తులు వద్దేవద్దంటున్న క్యాడర్ !


అయితే తెలుగుదేశం పార్టీ క్యాడర్ అభిప్రాయాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. పొత్తులు వద్దే వద్దని ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అటు సోషల్ మీడియాలో కానీ ఇటు బహిరంగంగా కానీ ఇతర పార్టీలతో పొత్తులు అనే మాటను అంగీకరించడం లేదు. దానికి వారు చెప్పే కారణాలు వారు చెబుతున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల నష్టమే జరుగుతుందని విశ్లేషిస్తున్నారు. ఆ పార్టీకి ఒక్క శాతం కూడా ఓటు బ్యాంక్ లేదని గత కొన్నాళ్లుగా జరుగుతున్న ఎన్నికల్లో తేలిపోయిందని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల మైనార్టీలు, ఇతరులు దూరమవుతారని..దాని వల్ల నష్టమే జరుగుతుంది కానీ ప్రయోజనం ఉండదంటున్నారు. అదే సమయంలో జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల కొన్ని ప్రాంతాల్లో కలసి వచ్చే అవకాశం ఉన్నా... ప్రజలు ప్రభుత్వాన్ని మార్చాలనుకుని... టీడీపీ ప్రభుత్వమే రావాలనుకుంటే ఏకపక్షంగా మద్దతిస్తారని ఓట్ల చీలిక అనే సమస్య రాదని గుర్తు చేస్తున్నారు. 


పొత్తులు పెట్టుకుంటే టీడీపీపై సవారీ చేస్తారని క్యాడర్ భయం !


తెలుగుదేశం పార్టీపై బీజేపీ నేతలు చేసే విమర్శలు చాలా దూకుడుగా ఉంటాయి.  తామే కొన్ని సీట్లు ఇస్తామని బీజేపీ నేతలు గతంలో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అసలు ప్రభావం చూపని పార్టీతో పొత్తులు పెట్టుకుని ఎందుకు ఇన్ని మాటలు పడాలనేది వారి అభిప్రాయం. ఇక జనసేన పార్టీ వైపు నుంచి కూడా ఇలాంటి మాటలే వినిపిస్తున్నాయంటున్నారు. గతంలో చంద్రబాబు కలసి పోరాటం చేయాలని పిలుపునిచ్చినప్పుడు జనసేన నేతలు సోషల్ మీడియాలో సీఎం పీఠం పవన్ కల్యాణ్‌కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇలా టీడీపీ మీద ఇతర పార్టీలు సవారీ చేస్తాయని.. అందుకే పొత్తులు వద్దని అంటున్నారు. 


ప్రజలు గెలిపిస్తే సరే లేదంటే లేదంటున్న క్యాడర్ !


ప్రజలు ప్రత్యామ్నాయ ప్రభుత్వంగా టీడీపీ కావాలనుకుంటే మద్దతిస్తారని.. పొత్తులు పెట్టుకున్నారా లేదా అనేది చూడరని టీడీపీ వర్గాలంటున్నాయి. ఇటీవలి పంజాబ్ ఎన్నికల్లో భారీగా ఓట్లు చీలిపోతాయని అనుకున్నా  ప్రజలు ఏకపక్షంగా ఆమ్ ఆద్మీకి మద్దతు తెలిపారని గుర్తు చేస్తున్నారు. టీడీపీ గెలవకపోతే టీడీపీకి మాత్రమే నష్టం కాదని.. ఏపీకే నష్టమని ప్రజలు గుర్తిస్తే తప్పకుండా గెలిపిస్తారని అంటున్నారు. ప్రస్తుతం పొత్తులపై టీడీపీ లీడర్స్, క్యాడర్స్ మధ్య ఇలాంటి చర్చలే ఎక్కువగా జరుగుతున్నాయి.