Telangana Politics  : అమిత్ షా ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు దూకుడుగా ఉన్నారు. మరోసారి హైదరాబాద్ కు ఓ బృందం వచ్చింది.  గురువారం గాంధీ భవన్ కి వచ్చిన ఢిల్లీ పోలీసులు.. లీగల్ సెల్ రామచంద్రారెడ్డి కోసం ఆరా తీశారు. పీసీసీ లీగల్ సెల్ నాయకులు అందుబాటులో లేకపోవడంతో మళ్ళీ వస్తామని తిరిగి వెళ్లిపోయారు.  ఇప్పటికే అమిత్ షా ఫేక్ వీడియో కేసులో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరో ముగ్గురికి ఢిల్లీ పోలీసులు సోమవారం నోటీసులు ఇచ్చారు. బుధవారం విచారణకి హాజరవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే రేవంత్ స్టార్ క్యాంపెయినర్ గా ఉండడంతో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు.  


రేవంత్  తరపున టీపీసీసీ లీగల్ సెల్ లాయర్ సౌమ్య గుప్తా ఢిల్లీ పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఫేక్ వీడియో పోస్ట్ అయిన సోషల్ మీడియా అకౌంట్స్ తో సీఎం రేవంత్ కి ఎలాంటి సంబంధం లేదని ఆమె విచారణ అధికారులకు వివరించారు. అలాగే సీఎం విచారణకి హాజరు కాలేరని, మరో నాలుగు వారాలపాటుగడువు కోరారు. కాగా, అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసు దర్యాప్తులో భాగంగా ఢిల్లీ పోలీసులు నాలుగు రోజులుగా హైదరాబాద్ లోనే మకాం వేశారు. కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్ ఇళ్లపై నిఘా ఉంచారు.  బుధవారం గీత అనే సోషల్ మీడియా వారియర్ ఫోన్ ని ఢిల్లీ పోలీసులు సీజ్ చేశారు.


మరో వైపు తెలంగాణ పోలీసులు  ఈ కేసులో ఐదుగురు కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్ ని గురువారం హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అమిత్ షాపై ఫేక్ వీడియో చేశారని బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంఛార్జ్ మన్నే సతీష్‌తో పాటు విష్ణు, వంశీ, నవీన్, గీత, ఆస్మా తస్లీమ్, శివలను హైదరాబాద్ పోలీసులు నేడు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ పోలీసులు అరెస్టు చేస్తారన్న ఉద్దేశంతో ముందుగానే వీరిని తెలంగాణ పోలీసులు అరెస్టు చూపించినట్లుగా భావిస్తున్నారు. 


ఈ అంశంపై ఢిల్లీ పోలీసులు సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. ఆ వీడియోను షేర్ చేసిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలందరికీ నోటీసులు జారీ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నేతలకూ ఇవి ఇస్తున్నారు. ఇప్పటికే ఉత్తరాదికి చెందిన నలుగుర్ని అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు తెలంగాణ నుంచి అరెస్టు చేసే వారిని ఢిల్లీ తరలించే అవకాశం ఉంది. ఇంకా  ఎలాంటి అరెస్టులు చేయలేదు.  కొంత మంది ఫోన్లు సీజ్ చేశారు. ఇచ్చిన నోటీసుల గడువు పూర్తయింది. కానీ లేఖలు మాత్రమే రాసినందున అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసుల నమోదు చేసిన కేసుతో వారిని ఇక్కడే అరెస్టు చేయడంతో.. ఢిల్లీ పోలీసులకు కౌంటర్ గా తెలంగాణ పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారన్న భావన వ్యక్తమవుతోంది.