TDP asked EC to extend election time in AP :  ఆంధ్రప్రదేశ్ లో ఓటింగ్ సమయాన్ని  సాయంత్రం ఆరు గంటల వరకూ పొడగించాలని తెలుగుదేశం పార్టీ ఎన్నికల సంఘాన్ని విజ్ఞప్తి చేసింది. ఏపీలో జమిలీ ఎన్నికలు జరుగుతున్నాయని అదే సమయంలో ఎండలు మండిపోతున్నాయని గుర్తు చేశారు. ఈ కారణంగా ఎండల్లో ఓటు వేసేందుకు వచ్చే వారి సంఖ్య తగ్గుతుందని చల్లబడిన తర్వాత ఎక్కువ మంది వస్తారని.. అందుకే సాయంత్రం ఆరు గంటల వరకూ పొడిగించాలని టీడీపీ నేత, మాజీ ఎంపీ కనకమేడర రవీంద్రకుమార్ ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. 


మామూలుగా అయితే ఉదయం ఏడు  గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ పోలింగ్ సమయం ఉంటుంది. ఈ సమయంలోనే పోలింగ్ నిర్వహిస్తారు. ఐదు గంటల వరకూ క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. గత ఎన్నికల సమయంలో కొన్ని చోట్ల పోలింగ్ రాత్రి పదకొండు గంటల వరకూ సాగింది. ఎండలు మండిపోవడం వల్ల చాలా మంది చల్లబడిన తర్వాత పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. అందరూ క్యూ లైన్లలో ఉండటంతో చివరికి అది చీకటి పడిన తర్వాత కూడా పోలింగ్ జరగడానికి కారణం అయింది.   ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ సారి ఎక్కువ మంది నిరీక్షించకుండా ఎప్పటికప్పుడు ఓటు వేసి వెళ్లి పోయేలా .. సమయాన్ని పెంచాలని టీడీపీ కోరుతోంది. 


తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు మాత్రమే జరుగుతున్నాయి. అయినా  తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ సమయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం  పొడిగించింది. వేసవి తీవ్రత దృష్ట్యా  పోలింగ్ సమయాన్ని పెంచాలని రాజకీయ పార్టీల అభ్యర్థులు ఈసీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పోలింగ్ టైం గంట పాటు పొడిగించాలని నిర్ణయించింది. సాధారణంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ నిర్వహించనుండగా.. సాయంత్రం 6 వరకూ పోలింగ్ సాగనుంది. ఆ సమయంలోపు క్యూలైన్లలో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తారు.                                     


తెలంగాణలో  నక్సల్స్ ప్రభావిత 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 4 గంటల వరకూ మాత్రమే పోలింగ్ జరగనుంది. ఏపీలోనూ నక్సల్ ప్రభావిత నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు వరకే పోలింగ్ జరుగుతుంది.  తెలుగు రాష్ట్రాల్లో  ఇప్పటికే 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ కు అనుమతిస్తే ఓటింగ్ పై ప్రభావం చూపే అవకాశం ఉందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణ ప్రాంతాల్లోనూ ఓటింగ్ అనుకున్నంత స్థాయిలో లేకపోవడంతో పోలింగ్ సమయాన్ని పెంచాలని ఎన్నికల సంఘానికి వినతులు అందాయి. ఏపీలోనూ వినతులు రావడంతో సమయం పెంపుపై ఈసీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.