Jubilee Hills by-election: తెలంగాణలో జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై అన్ని పార్టీలు గట్టిగా ఫోకస్ పెట్టాయి. అందుకు తగ్గట్టుగానే పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ముందే అభ్యర్థిని ప్రకటించిన బీఆర్‌ఎస్ ప్రచారంలో దూసుకెళ్తోంది. ఈ ఎన్నికల వ్యూహం కోసం ప్రత్యేకంగా వార్ రూంనుర్పాటు చేసింది. దీని కేంద్రంగానే ప్రచారాన్ని మరింత పరుగులు పెట్టించనున్నారు.
కాంగ్రెస్ కూడా బుధవారం రాత్రి తన అభ్యర్థిని ఫైనల్ చేసింది. గతంలో పోటీ చేసి ఓడిపోయిన నవీన్ యాదవ్‌ను బరిలోకి దింపుతున్నట్టు వెల్లడించింది. లోకల్‌గా పట్టున్న ఆయనైతే సీటు గెలవడం సులభం అవుతుందని ఎంత మంది పోటీలో ఉన్నా నవీన్ యాదవ్‌వైపు ముఖ్యమంత్రి, మిగతా పార్టీ నాయకులు నిలబడ్డారు. బీసీ నినాదంతో వెళ్తున్న కాంగ్రెస్ దీన్ని అస్త్రంగా మలుచుకోనుంది.
ఇప్పుడు బీజేపీలో అభ్యర్థి ఎవరనే ఆసక్తి నెలకొంది. రేపటికల్లా అభ్యర్థిని ఫైనల్ చేయనున్నట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ తెలంగాణ పార్టీ పగ్గాలు అందుకున్న రాంచంద్రర్‌రావు ఎదుర్కంటున్న తొలి ఎన్నిక ఇదే కావడంతో, ఆయన వ్యూహాలు ఎలా ఉంటాయి, అభ్యర్థి ఎంపికలో ఏం చేస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థి ఎంపికకు ప్రత్యేక కమిటీ వేశారు. ధర్మారావు, పోతుగంటి రాములు, అంజనేయలు చాలా మంది పేర్లు పరిశీలించారు. వీళ్లు వివిధ మార్గాల్లో పార్టీ వర్గాలతో మాట్లాడారు. పార్టీ శ్రేణుల అభిప్రాయాలు తెలుసుకున్నారు.
దీనిపై సమగ్ర నివేదిక రాష్ట్ర అధ్యక్షుడికి ఇచ్చారు. వీరు పంపించిన పేర్లను పరిశీలించిన తర్వాత వారిలో షార్ట్ లిస్ట్ చేసి ముగ్గురు పేర్లను అధిష్ఠానానికి పంపిస్తారు. దీన్ని ఇవాళ రాష్ట్ర బీజేపీ కీలక నేతలు పరిశీలించి ఈ లిస్ట్‌ను ఢిల్లీ పంపిస్తారు. శుక్రవారం వాటిని పరిశీలించనున్న అధిష్ఠానం ఒకరి పేరును ఫైనల్ చేస్తుంది.
కమిటీ పేర్కొన్న లిస్టులో చాలా పేర్లు ఉన్నప్పటికీ టాప్‌లో మాత్రం లంకల దీపక్ రెడ్డి, వీరపనేని పద్మ, కీర్తిరెడ్డి ఉన్నారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. వీరిలో దీపక్ రెడ్డి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అందుకే ఆయనకే ఈసారి కూడా మరో ఛాన్స్ ఇస్తారని ఆయన వర్గం గట్టిగానే ప్రచాంర చేస్తోంది. రాష్ట్ర, ఢిల్లీ స్థాయిలో కూడా కీలక నేతలతో ఉన్న సంబంధాలు ఆయనకు అక్కరకు వస్తాయని అంటున్నారు. మహిళకు ఇవ్వాలనుకుంటే మాత్రం కీర్తిరెడ్డికి లక్కీ ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు.