Jubilee Hills by-election :జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున రేసులో ముందంజలో ఉన్న కాంగ్రెస్ లీడరర్ నవీన్ యాదవ్ చిక్కుల్లో పడ్డారు. రూల్స్‌కు వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొన్నారని ఆయనపై కేసు నమోదు అయింది. దీనిపై ప్రతిపక్షాలు కూడా విమర్శలు ఎక్కుపెట్టాయి. ఆయన ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఓటర్లు ఓట్లు వేయాలంటే కచ్చితంగా ఎన్నికల సంఘం ఇచ్చే గుర్తింపు కార్డు చేతిలో ఉండాలి. అలాంటి గుర్తింపు కార్డును అధికారులు మాత్రమే ఆయా పౌరులకు అందజేస్తారు. కానీ కాంగ్రెస్‌కు చెందిన నాయకుడు నవీన్ యాదవ్ మాత్రం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఓటర్ గుర్తింపు కార్డులు పంపిణీ చేయడం చర్చనీయాంశమైంది. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన వెంటనే అధికారులు చర్యలు ప్రారంభించారు. ఆయనపై కేసు నమోదు చేశారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారి, యూసుఫ్‌గూడ సర్కిల్, డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ రజినీకాంత్‌రెడ్డి కాంగ్రెస్ నేత నవీక్ యాదవ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్ రూల్స్‌కు వ్యతిరేకంగా ఓటర్లకు ఓటర్ కార్డులు పంపిణీ చేశారని మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950, సెక్షన్ 23 ప్రకారం ఇది చట్టవిరుద్ధమై చర్యగా ఆయన పేర్కొన్నారు. ఇలా చట్టవిరుద్ధంగా వ్యవహరించిన నవీన్‌పై కేసు పెట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
రజినీకాంత్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఎలక్షన్ కమిషన్ రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరించినందుకు బీఎన్‌ఎస్ 170, 171, 174తో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల మేరకు కేసులు పెట్టారు. అక్టోబర్ నాల్గో తేదీన యూసఫ్‌గూడలోని కాంగ్రెస్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి స్థానిక ప్రజలకు ఓటర్ కార్డులు పంపిణీ చేశారు. దీనిపైనే ఈసీ సీరియస్ అయ్యింది.
నవీన్ యాదవ్‌పై కేసు నమోదు చేయడమే కాదు ఆయన ఓటు హక్కు రద్దు చేయాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తోంది. ఓట్ చోరీ అంటూ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తూ తెలంగాణలో మాత్రం చట్టవిరుద్ధమైన పనులు చేస్తోందని మండిపడుతున్నారు ఆ పార్టీ నాయకులు. చట్టాన్నే కాకుండా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న వారి గుర్తింపును రద్దు చేయాలని వారు పోటీ చేయకుండా నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో అనుముల రాజ్యాంగం అమలు అవుతుందని అందుకే కాంగ్రెస్ నాయకులు ఇష్టం వచ్చినట్టు ప్రవరిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సంఘం కఠినంగా వ్యవహరించినట్టు అయితే నవీన్ యాదవ్ ఓటు హక్కు రద్దు చేయాలని అప్పుడే ప్రజలకు నమ్మం కలుగుతుందన్నారు. భవిష్యత్‌లో కూడా ఆయన ఎక్కడా పోటీ చేయడనికి వీలు లేకుండా చేయాలన్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున టికెట్ కోసం పోటీ పడుతున్న వారిలో నవీన్ యాదవ్ కూడా ఉన్నారు. గతంలో పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు కచ్చితంగా తనకు సీటు ఇస్తే గెలిపించుకొని వస్తానని అధినాయకత్వం వద్ద లాబీయింగ్ చేస్తున్నారు. అందుకే ఉపఎన్నికలు వస్తాయని ప్రచారం మొదలైనప్పటి నుంచి ప్రజల్లో ఉండే ప్రయత్నం చేశారు. సీటుపై ఓ నిర్ణయం రానున్న వేళ నవీన్‌పై కేసు నమోదు కీలకంగా మారింది.
బిహార్ అసెంబ్లీ ఎన్నిలతోపాటే తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉపఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 11 పోలింగ్ జరగనుంది. ఈ సీటు ఎలాగైన దక్కించుకోవాలని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ ఎత్తుకుపైఎత్తులు వేస్తున్నాయి. ఇప్పటికే బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ భార్య సునీత పేరు ఖరారు అయింది. తమ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ కసరత్తు ముమ్మరం చేశాయి. 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి విజయం సాధించిన మాగంటి గోపీనాథ్ అకాల మృతితో ఈ ఉపఎన్నికలు వచ్చాయి.