Tadipatri Counting : ఆంధ్రప్రదేశ్ లో హైవోల్టేజ్ రాజకీయం జరిగే నియోజకవర్గాల్లో ఒకటి తాడిపత్రి. పోలింగ్ రోజు అభ్యర్థులు ఒకరి ఇళ్లను మరొకరు ఆక్రమించుకుని చేసిన రాజకీయం చూసిన తర్వాత ఇలా కూడా జరుగుతుందా అని అందరూ ఆశ్చర్యపోయారు. కౌంటింగ్త తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అంచనా వేయలేకపోతున్నారు. అభ్యర్థులు ఎవరూ తాడిపత్రిలో ఉండే పరిస్థితి లేదు. అందరూ ఔటాఫ్ స్టేషనే. కీలక నేతలంతా ముందస్తు బెయిల్స్ పై ఉన్నారు. ఈ కారణంగా అందరూ కౌంటింగ్ సెంటర్‌లోకి మాత్రమే రానున్నారు.
తాడపత్రి పట్టణంలో పోలింగ్ రోజు జరిగిన అల్లర్లు మరోసారి పునరావృతం కాకుండా పోలీసులు గట్టి పద్ధతిని ఏర్పాటు చేశారు పోలింగ్ రోజు జరిగిన అల్లరిలో భాగంగా ఇప్పటికే ఏడుగురుపైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుల్లో తాడపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి టిడిపి అభ్యర్థి జెసి అస్మిత్ రెడ్డికి కూడా ముందస్తు మంజూరు చేశారు. ఇందులో భాగంగా తాడపత్రి మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డికి కూడా షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు అయింది. తాడపత్రి అల్లర్ల ఘటనలో ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నంలో పోలీసులు భాష్పవాయు గోళాలను ప్రయోగించారు ఈ క్రమంలో భాష్పవాయువు పొగను జేసీ ప్రభాకర్ రెడ్డి పిల్చుకోవడంతో తీవ్ర అస్వస్థకు గురై హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆరోగ్యరీత్యా పోలీసులు తనపైన ఎటువంటి చర్యలు తీసుకోకూడదని చెప్పి కూడా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కోర్టును ఆశ్రయించి ఉపశమనం పొందారు.
ఇప్పటికేపెద్ద ఎత్తున అల్లర్లలో పాల్గొన్న వారిని అరెస్టు చేశారు. నేర చరిత్ర ఉన్నవారిని బైండోవర్ చేస్తున్నారు. ఫలితం ఎలా ఉన్నా అల్లర్లకు పాల్పడితే మాత్రం ఊరుకునేది లేదని ఇప్పటికే పోలీసులు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ప్రత్యేక భద్రతా బలగాలను మోహరించారు. కౌంటింగ్ రోజు మాత్రమే కాదు మరో పదిహేను రోజుల పాటు తాడిపత్రిలో బలగాలు ఉంటాయి. కౌంటింగ్ అనంతరం ఏ పార్టీ అధికారంలో వచ్చినా కొన్ని కీలకమైన ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం మారితే జేసీ వర్గాలు... వైసీపీ మళ్లీ అధికారం చేపడితే మరో విధంగా స్పందించే అవకాశం ఉంది .
ఫలితం ఎలా వచ్చినా గొడవలు జరుగుతాయని.. ఆస్తుల విధ్వంసం ఉంటుందని ఇంటలిజెన్స్ రిపోర్టులు ఉండటంతో పెద్ద ఎత్తున ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాడిపత్రి సమస్యాత్మక ప్రాంతం అయినప్పటికీ గతంలో ఇలాంటి పరిస్థితులు లేవని.. గత ఐదేళ్ల కాలంలో ఏర్పడిన పోటా పోటీ రాజకీయాల వల్లనే ఈ సమస్య వచ్చిందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.