Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 57 మందితో కూడిన జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. ఇందులో తెలంగాణకు చెందిన ఐదు నియోజకవర్గాలకు అభ్యర్థులను కాంగ్రెస్ అధినాయకత్వం ఖరారు చేసింది. ఇప్పటికే మొదటి జాబితాలో నాలుగు స్థానాలు ప్రకటించింది. ఇంకా 8 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. తాజాగా ప్రకటించిన జాబితాలో చోటు దక్కించుకున్న వాళ్లు ఎవరంటే...


పెద్దపల్లి- గెడ్డం వంశీ కృష్ణ


మల్కాజ్‌గిరి-సునీతా మహేందర్‌ రెడ్డి 


సికింద్రాబాద్‌- దానం నాగేందర్‌


చేవెళ్ల- రంజిత్‌ రెడ్డి


నాగర్‌కర్నూల్- మల్లు రవి



17 లోక్‌ సభ స్థానాలు ఉన్న తెలంగాణలో మొదటి లిస్ట్‌లో నాలుగు స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్‌ అధినాయకత్వం ఖరారు చేసింది. జహీరాబాద్‌ నుంచి సురేష్‌ షెట్కార్‌, నల్గొండ ఎంపీ స్థానం నుంచి జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి, మహబూబ్‌నగర్‌ స్థానం నుంచి వంశీచందర్ రెడ్డి, మహబూబాబాద్‌ నుంచి బలరాం నాయక్‌ పోటీ పడుతున్నారు. 


ఇప్పుడు కాంగ్రెస్‌ ఎంపిక చేసిన వారి ప్రొఫైల్ చూస్తే... 


మల్లు రవి, కాంగ్రెస్‌ సీనియర్ నేత 


విద్యార్థి నాయకుడిగా కాంగ్రెస్‌లో రాజకీయ ప్రయాణం ప్రారంభించిన మమల్లు రవి 1991, 1998,2008 నాగర్‌కర్నూలు నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. పార్టీ, ప్రభుత్వంలోని వివిధ కమిటీల్లో కీలక సభ్యుడిగా ఉన్నారు. 


దానం నాగేందర్‌, సీనియర్ నేత 


గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్‌ నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసి విజయం సాధించిన నేత. 1994, 99, 2004లో ఆసిఫ్‌నగర్‌ నుంచి విజయం సాధించిన దానం నాగేందర్‌...2009,2018లో మాత్రం ఖైరతాబాద్‌ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేశారు. మారిన రాజకీయ పరిణామాలతో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో హస్తం గూటికి చేరారు. ఇప్పుడు ఏకంగా ఎంపీగా పోటీ చేసే ఛాన్స్‌ కొట్టేశారు.