Telangana Elections News: నవంబర్ 29న మంత్రి కేటీఆర్ రాష్ట్ర దీక్షా దివాస్ నిర్వహిస్తుండడం పట్ల తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఎన్నికల ప్రచారం ముగిసి.. పోలింగ్ కు మరికొద్ది గంటలు మాత్రమే సమయం ఉన్నందున ఈ టైంలో దీక్షా దివాస్ నిర్వహించడం పట్ల కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉన్న వేళ ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికే వస్తుందని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. వెంటనే దీక్షా దివస్‌ను నిలిపివేయాలని డిమాండ్ చేసింది. 


కాంగ్రెస్ ఫిర్యాదుతో తెలంగాణ భవన్‌కు ఎన్నికల కమిషన్‌ స్వ్కాడ్‌ టీమ్‌ చేరుకుని.. కార్యక్రమాన్ని నిలిపివేయాలని కోరింది. అయితే, ఇది కొత్త కార్యక్రమం కాదని ఎప్పటి నుంచో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా బీఆర్‌ఎస్‌ నేతలు, లీగల్‌ టీమ్‌  సూచించారు. దీంతో, ఈ కార్యక్రమాన్ని బహిరంగంగా కాకుండా తెలంగాణ భవన్‌ లోపల నిర్వహించుకోవాలని వారికి పోలీసులు సూచించారు. దీంతో తెలంగాణ భవన్‌ లోపలే బీఆర్‌ఎస్‌ నేతలు ఈ కార్యక్రమం చేస్తున్నారు. వేడుకల్లో పాల్గొనడం కోసం కేటీఆర్‌ తెలంగాణ భవన్‌కు కూడా వెళ్లారు. దీక్ష దివాస్‌ సందర్భంగా కేటీఆర్‌ రక్తదానం కూడా చేశారు. 


ఏటా నవంబర్ 29న బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివాస్ ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే తెలంగాణ భవన్‌లో నేడు దీక్షా దివస్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాకపోతే ఈసారి రేపే ఎన్నికలు జరగనున్నందున కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సమయంలో ఎలాంటి వేడుకలు, కార్యక్రమాలు నిర్వహించకూడదని ఎన్నికల సంఘం ఆదేశాలు ఉన్న సంగతి తెలిసిందే.