TDP Candidates : తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఇప్పటికే ఖరారు చేసిన అభ్యర్థులకు సమాచారం ఇచ్చినట్లుగాచెబుతున్నారు. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. ఆయన నర్సాపురం ఎంపీ సీటు నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ కూటమి సీట్ల పంపకాల్లో భాగంగా.. ఎంపీ స్థానం బీజేపీకి వెళ్లింది. బీజేపీలో ఆయనకు టిక్కెట్ లభించలేదు. దీంతో ఆయన టీడీపీలో చేరారు. ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును ఉండి అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించిన టీడీపీ.. రఘురామ కోసం ఆయనకు నచ్చజెప్పి పోటీ నుంచి తప్పించింది. ఆయనకు పార్టీ పదవి ఇచ్చి బుజ్జగిస్తోంది.
బండారు సత్యనారాయణమూర్తికి మాడుగుల టిక్కెట్
మరోవైపు అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గ అభ్యర్థిని కూడా మార్చింది. మొదట పైలా ప్రసాదరావుకు టికెట్ కేటాయించింది. కానీ.. సర్వేలో ఆయన వెనకబడ్డారని తెలియడంతో.. ఆ టికెట్ ను మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి కేటాయించింది. బండారు సత్యనారాయణ మూర్తిని ప్రచారం చేసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. బండారు సత్యనారాయణమూర్తి పెందుర్తి మాజీ ఎమ్మెల్యే. అక్కడ్నుంచే పోటీ చేయాలనుకున్నారు. కానీ ఆ సీటు జనసేనకు కేటాయించారు. దీంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు. అనూహ్యంగా ఇప్పుడు మాడుగుల సీటు లభించింది.
దళిత విభాగ రాష్ట్ర అధ్యక్షుడైన ఎంఎస్ రాజుకు మడకశిర
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర లోనూ అభ్యర్థిని మార్చాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి వర్గం.. ప్రస్తుత అభ్యర్థి అయిన అనిల్ కుమార్ ను మార్చాలని డిమాండ్ చేస్తుంది. దాంతో ఆ టికెట్ ను దళిత విభాగ రాష్ట్ర అధ్యక్షుడైన ఎంఎస్ రాజును బరిలోకి నిలపాలనుకుంటున్నారు. ఎంఎస్ రాజుకు బాపట్ల ఎంపీ టిక్కెట్ ఇవ్వాలనుకున్నారు. కానీ చివరి క్షణంలో ఆ టిక్కెట్ ను మాజీ పోలీస్ అధికారి అయిన కృష్ణ ప్రసాద్ కు ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు ఎంఎస్ రాజు సొంత జిల్లా అయిన అనంతపురం నుంచే సీటు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.
తంబళ్లపల్లె అభ్యర్థిని మార్చే అవకాశం
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె అభ్యర్థి జయచంద్రారెడ్డిని కూడా టీడీపీ మార్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రచారంలో వెనుకబడటంతో పాటు.. ప్రత్యర్థితో వ్యాపార లావాదేవీలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ కారణాలతోనే జయచంద్రారెడ్డికి ప్రత్యామ్నాయంగా మదనపల్లె మాజీ ఎమ్మెల్యే దొమ్మాలపాటి రమేశ్ భార్య సరళారెడ్డి లేదా మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్, కొండా నరేంద్ర పేర్లు పరిశీలిస్తున్నారు. ఈ మార్పులపై టీడీపీ ఏ క్షణమైనా ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.