Andhra Pradesh Elections 2024: రానున్న సార్వత్రిక ఎన్నికలకు తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలకు కలిసి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. ఒకటి, రెండు రోజుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎన్‌డీఏలో చేరడానికి ముందు టీడీపీ నేతలతో మాట్లాడిన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తులో భాగంగా సీట్లు రాని నాయకులు ఆందోళన చెందవద్దని, అధికారంలోకి వచ్చిన తరువాత వారికి అండగా ఉంటానని చెప్పారు. ఇప్పుడు ఈ మాటలు ఉమ్మడి విశాఖలోని సీనియర్ టీడీపీ నేతలను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
ఎందుకంటే ఇక్కడి నుంచి జనసేన, బీజేపీ తరపున పోటీ చేయాలని భావిస్తున్న ఆశావహ అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉంది. వీరంతా ఇప్పుడు అధినేత వ్యాఖ్యలతో తీవ్ర మథనపడుతున్నారు. తమ సీట్లకు ఎక్కడ గండి పోతుందో అన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. పొత్తులో తమ సీట్లు పోకుండా ఉండేందుకు అనుగుణంగా కీలక నేతలను కలిసేందుకు ఆయా నియోజకవర్గాల నేతలు సిద్ధమవుతున్నారు.
ఆందోళన చెందుతున్న నేతలు ఎక్కువే!
ఇప్పటి వరకు టీడీపీ, జనసేన మాత్రమే కూటమిగా వెళతాయని భావించారు. కానీ, అనూహ్యంగా బీజేపీ కూడా కూటమిలో చేరడంతో ఉమ్మడి జిల్లాలో టీడీపీ మరికొన్ని సీట్లు వదులుకోవాల్సి వస్తోంది. బీజేపీ, జనసేన కోరుతున్న సీట్ల సంఖ్య కూడా ఎక్కువగా ఉన్నట్టు చెబుతున్నారు. బీజేపీ విశాఖ పార్లమెంట్ స్థానంతోపాటు మరో రెండు సీట్లను కోరుతున్నట్టు చెబుతున్నారు. అదే జరిగితే టీడీపీ అభ్యర్థిగా ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్న నందమూరి బాలకృష్ణ చిన్న అల్లుడు శ్రీ భరత్‌తోపాటు మరో ఇద్దరు నేతల ఆశలపై నీళ్లు చల్లినట్టు అవుతుంది. మరోచోట భరత్ లాంటి వంటి నేతలకు అవకాశం కల్పిస్తారు. కానీ, ఇతర నేతల పరిస్థితి ఏమిటి అన్నది తెలియడం లేదు.
జనసేన కూడా ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి అధిక స్థానాలను కోరుతోంది. ఉత్తరాంధ్రలో జనసేన అడుగుతున్న సీట్లలో ఎక్కువగా ఇక్కడే ఉన్నాయి. విజయనగరంలో ఒక్క నెల్లిమర్ల సీటు తప్పా మరెక్కడా ఆశించడం లేదు. ఉమ్మడి విశాఖలో మాత్రం ఐదు వరకు సీట్లు జనసేన కోరుతున్నట్టు చెబుతున్నారు. ఈ మేరకు సీనియర్ నేతలు ఆ పార్టీకి ఉండడం కూడా గట్టిగా డిమాండ్ చేసేందుకు అవకాశాన్ని కల్పిస్తున్నాయి. జనసేన అడుగుతున్న సీట్ల జాబితాలో అనకాపల్లి పార్లమెంట్, అనకాపల్లి అసెంబ్లీ, పెందుర్తి అసెంబ్లీ, గాజువాక అసెంబ్లీ, యలమంచిలి అసెంబ్లీ స్థానాలు ఉన్నట్టు చెబుతున్నారు. వీటితోపాటు భీమిలి స్థానాన్ని కోరుతున్నట్టు చెబుతున్నారు.
మరి ఆ నేతల పరిస్థితి ఏమిటి..?
జనసేన, బీజేపీ కోరుతున్న సీట్లు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరిస్తే ఎంతో మంది సీనియర్లకు నష్టం వాటిళ్లనుంది. జనసేన, బీజేపీ కోరుతున్న స్థానాల్లో ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సీనియర్ నేతలు ఉన్నారు. ఆయా స్థానాలను ఇతర పార్టీలకు ఇస్తామంటే ఊరుకునే పరిస్థితి కూడా ఉండదని చెబుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇచ్చినా ఆయా నేతలను దారికి తెచ్చుకోవడం పార్టీకి ఇబ్బందితో కూడిన వ్యవహారంగానే చెబుతున్నారు. మరి పార్టీ అధినాయకత్వం పొత్తుల్లో భాగంగా కోల్పోనున్న స్థానాలపై అసంతృప్తులను ఎలా సద్ధుమణిగిస్తుందో చూడాలి.
సీట్ల పంపకాలకు ముందే చాలా మంది సీనియర్ నేతలు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. పొత్తు వల్ల తమ సీట్లను కోల్పోవాల్సి వస్తే మాత్రం చాలా మంది దానికి సిద్ధంగా లేరు. అధినేత చేసిన వ్యాఖ్యలతో ఇప్పటికే ఎంతో మంది నాయకుల్లో ఆందోళన పెరిగింది. వీరంతా తమ సీట్లకు ఎసరు రాకుండా ముఖ్య నాయకులతో మంతనాలు జరుపుతూ సేఫ్ జోన్‌లో ఉండే ప్రయత్నాలను సాగిస్తున్నట్టు చెబుతున్నారు. చూడాలి మరి ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఏ నేతల సీట్లకు ఎసరు రాబోతోందో.