Why did Jagan Mohan Reddy sideline Amanchi Krishnamohan  : వైఎస్ఆర్‌సీపీ ఏడో జాబితాలో రెండే పేర్లు ఉన్నాయి. అందులో ఒకటి పర్చూరు ఇంచార్జ్‌గా ఎడం బాలాజీ అనే నేతను నియమించడం. ఆ నియామకం కాదు ఆశ్చర్యకరమైన విషయం.. ఆ నియోజకవర్గంలో బలమైన నేత ఆమంచి కృష్ణమోహన్ ను తప్పించడం .. ఆయనకు మరో నియోజకవర్గం చూపించకపోవడమే వైసీపీ వవర్గాను సైతం ఆశ్చర్య పరిచింది. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరు పడిన ఆయనకు ఈ విషయంలో ముందే చెప్పారా లేదా అన్నదానిపైనా స్పష్టత లేదు. 


అమెరికా నుంచి వచ్చి పార్టీలో చేరిన యడం బాలాజీ 


పర్చూరుకు వైసీపీ ఇంచార్జ్ గా నియమితులై యడం బాలాజీ టీడీపీ నేత. 2014లో వైసీపీ తరపున  చీరాల నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆమంచి కృష్ణమోహన్ ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచారు. తర్వాత యడం బాలాజీ టీడీపీలో చేరారు. కానీ ఆయన యాక్టివ్ గా లేరు. ఇటీవలి కాలంలో ఆయన అమెరికాలో ఉంటున్నారు. ఇప్పుడు పర్చూరు కోసం అభ్యర్థిని వెదికిన వైసీపీ పెద్దలు యడం బాలాజీని అమెరికా నుంచి పిలిపించారు. ఆయన రెడీగా ఉండటంతో పర్చూరు ఇంచార్జ్ గా ప్రకటించారు. ఇలా ప్రకటనకు ముందు బాలాజీ క్యాంప్ ఆఫీస్ లో సీఎం జగన్ ను కలిశారు. ఆ సమయంలో ఆమంచి కృష్ణమోహన్ లేరు. అందుకే ఈ చేరికలపై ఆమంచికి సమాచారం లేదని అంటున్నారు. 


చీరాలలో పోటీ  చేయాలనుకుంటున్న ఆమంచి కృష్ణమోహన్ 
 
చీరాలలో ఇండిపెండెంట్ గా కూడా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ కు పర్చూరు పోటీ చేయడం ఇష్టం లేదు.  గతంలో టీడీపీలో ఉండే ఆయన  2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిపోయారు. ఆ పార్టీ తరపు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయినా వైసీపీ అధికారంలోకి వచ్చింది కదా అని ఆయన సంతోషంగా ఉండలేకపోయారు.   టీడీపీ నుంచి గెలిచిన కరణం బలరాం వైసీపీలో చేరడంతో జగన్ రెడ్డి ఆయనకే ప్రాధాన్యం ఇచ్చారు. నియోజకవర్గంలో జోక్యం చేసుకోవద్నది ఆమంచికి చెప్పి.. .. పర్చూరుకు పంపారు. అక్కడ కుదురుకునే పరిస్థితి లేదని తేలడంతో  ఆయన చీరాలపైనే దృష్టిపెట్టారు. వైసీపీ టిక్కెట్ ఇస్తే ఇచ్చింది లేకపోతే లేదు.. తాను మాత్రం చీరాలలోనే పోటీ చేయాలని డిసైడయ్యారని చెబుతున్నారు. ఇటీవల చీరాలలో ఆయన అనుచరులతో రహస్య సమావేశం కూడా నిర్వహించారని అంటున్నారు. పర్చూరులోనే పోటీ చేయాలని ఎన్ని సార్లు చెప్పినా ఆయన వినకపోవడంతో  సీఎం జగన్ కొత్త అభ్యర్థిని చూసుకున్నారని అంటున్నారు. 


ఇప్పుడు ఆమంచికి దారేది ? 


ఆమంచి కృష్ణమోహన్ బలమైన నేత. ఆయన చీరాల ఫలితాన్ని తేల్చగలరు. ఆయనను సీఎం జగన్ వదులుకోరని వైసీపీ వర్గాలు  భావిస్తున్నాయి. చీరాలలో ఆయనకు టిక్కెట్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తారని అంటున్నారు. చీరాలలో కరణం బలరాం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కుమారుడు కరణం వెంకటేష్ పోటీ చేయాలనుకుంటున్నారు. వారిని కాదని ఆమంచికి ఇస్తారా అన్న సందేహం ఉంది. ఒక వేళ వైసీపీలో టిక్కెట్ రాకపోతే ఆమంచి  జనసేన పార్టీలో అయినా చేరి పోటీ చేయాలనుకుంటున్నారని అంటున్నారు.  ఇప్పుడు ఆమంచి ఏం చేయబోతున్నారన్నది వైసీపీ వర్గాల్లోనూ ఆసక్తి కరంగా మారింది. ఆయన పార్టీ మారినా.. ఇండిపెండెంట్ గా పోటీ చేసినా వైసీపీకి తీవ్ర నష్టం జరగడం ఖాయంగా కనిపిస్తోందని రాజకీయవర్గాలంటున్నాయి.